Naga Panchami 2025 Date,Time and Significance: హిందూ సంప్రదాయంలో నాగుపాము ఒక భాగం. ఎందుకంటే హిందువులు పామును దేవతగా కొలుస్తారు. అంతేకాకుండా సర్పాలను ఆరాధిస్తూ నాగ పంచమి, నాగుల చవితి వంటి పండుగలను కూడా మన దేశంలో జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం, నాగపంచమి నాడు సర్పాలను పూజించడం వల్ల విషపూరితమైన పాముల నుండి రక్షణ లభించడమే కాక.. మీ జీవితంలో శ్రేయస్సు, పురోగతి ఉంటుందని నమ్ముతారు. కాలసర్ప దోషం ఉన్నవారు ఈరోజు నాగేంద్రుడిని ఆరాధించడం వల్ల దోషం తొలగిపోతుంది. ఈ ఏడాది నాగపంచమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.
నాగ పంచమి ఎప్పుడు?
ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమ తిథి నాడు నాగపంచమి జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగ జూలై లేదా ఆగస్టులో వస్తుంది. ఈ సంవత్సరం నాగపంచమి మంగళవారం, జూలై 29న వచ్చింది.
శుభ ముహూర్తం:
తేదీ: జూలై 29, 2025 (మంగళవారం)
పూజకు అనువైన సమయం: ఉదయం 5:41 నుండి ఉదయం 8:23 వరకు
వ్యవధి: 2 గంటల 43 నిమిషాలు
నాగ పంచమి ప్రాముఖ్యత:
హిందూ మతంలో నాగదేవతకు పవిత్ర స్థానం ఉంది. ఈ రోజున భక్తులు పన్నెండు ప్రధాన సర్పాలను దేవతలుగా భావించి పూజిస్తారు. వీరు మట్టితో పాము విగ్రహాలను తయారు చేసి..రంగులతో అలంకరిస్తారు. కొంత మంది పాము పుట్టల దగ్గర పూజలు చేస్తారు. ఈ సమయంలో భక్తులు పాలు మరియు ఇతర ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండుగ ప్రకృతి పట్ల నిబద్దతను చాటుతుంది.
నాగ పంచమి రోజున ఏం చేయాలి?
**నాగ పంచమి రోజునే తెల్లారే స్నానమాచరించి ఉపవాస దీక్ష తీసుకోవాలి.
**ఈరోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి మహాదేవుడిని బిల్వపత్రాలు మరియు నీటితో అభిషేకించండి.
**అనంత, వాసుకి, పద్మ, మహాపద్మ, తక్షక, కులీర, కర్కట మరియు శంఖ అనే ఎనిమిది సర్ప రూపాలను పూజించండి.
**మీ ఇంటి ప్రవేశ ద్వారం రెండు వైపులా ఆవు పేడను ఉపయోగించి పాము బొమ్మలను తయారు చేయండి.
**నాగ దేవతకు పెరుగు, బియ్యం, పాలు, పువ్వులు మరియు స్వీట్లు సమర్పించండి.
**నాగ దేవతకు సంబంధించిన మంత్రాలను పఠించండి.
**మీ శక్తి కొలదీ అవసరమైనవారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి.


