Sunday, July 14, 2024
Homeఓపన్ పేజ్2 CMs meeting changed the climate: ముఖ్యమంత్రుల భేటీతో ఆశావహ పరిస్థితి

2 CMs meeting changed the climate: ముఖ్యమంత్రుల భేటీతో ఆశావహ పరిస్థితి

దాదాపు దశాబ్ద కాలం పాటు వైషమ్యాలు, వైరుధ్యాలతో అట్టుడుకిన తెలుగు రాష్ట్రాల్లో శాంతి పవనాలు మళ్లీ వీస్తున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో సమావేశమై ఉభయ రాష్ట్రాల ఉమ్మడి సమస్యల మీద చర్చించడం, సంబంధాలను మెరుగుపరచుకోవడం ఏ విధంగా చూసినా హర్షణీయ పరిణామమే. ఈ రెండు రాష్ట్రాలు పరస్పర ఆధారిత రాష్ట్రాలు. సామాజికంగా కూడా సన్నిహిత సంబంధాలు కలిగిన రాష్ట్రాలు. ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా, సంస్కరణలు చేపట్టాలన్నా ఈ రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో చాలావరకు సుహృద్భావంతో మెలగడం, 2014లో ఆంధ్ర ప్రదేశ్‌ విడిపోయిన నాటి నుంచి అపరిష్కృతంగా ఉండిపోయిన అనేక సమస్యలను సామరస్యంగా, సావధానంగా చర్చించడం ఉభయ రాష్ట్రాల ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించింది. తమ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న ఈ ముఖ్యమంత్రుల నిర్ణయం కూడా ప్రశంసించదగ్గది.
ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం ఇందులో మొదటి వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు సీనియర్‌ అధికారులు, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తరచూ సమావేశమై, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఈ కమిటీలో కొన్ని ఉప కమిటీలు కూడా ఉంటాయి. ఇవి నీటి పంపకం, ఆస్తులు అప్పుల పంపిణీ, ఇదివరకటి ఖమ్మం జిల్లాలలోని అయిదు గ్రామాలను తిరిగి ఇవ్వడం వంటి సమస్యలను చర్చించి, పరిష్కార మార్గం కనుగొంటాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఈ గ్రామాలు ముణిగిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో వీటిని ఆంధ్ర ప్రదేశ్‌ లో విలీనం చేయడం జరిగింది.
ఇక రెండవ వ్యవస్థలో ఈ రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు మంత్రుల చొప్పున ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉన్నత స్థాయి అధికారుల కమిటీ వల్ల పరిష్కారం కాని సమస్యలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ రెండు కమిటీల వల్ల కూడా పరిష్కార సాధ్యం కాని అంశాలను పరిశీలించడానికి మూడవ వ్యవస్థ కింద ముఖ్యమంత్రులే చర్చలు జరుపుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి అయిదు సంవత్సరాల్లో విభజన సమస్యలు ఇక పరిష్కారం కాలేని స్థితికి చేరుకున్నాయి. ఒక సుసంపన్న రాష్ట్రాన్ని విభజించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేని ప్రజలు, పార్టీలు, నాయకుల వ్యతిరేకతలు, నిరసనల వల్ల ఎక్కడి సమస్యలు అక్కడ ఆగిపోయాయి. తెలంగాణలో కె. చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (భారత రాష్ట్ర సమితి), ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీల మధ్య వైరం, వైషమ్యాలు ఏ స్థాయికి చేరాయంటే, విభజన సమస్యలను పరిష్కరించలేకపోవడమే కాదు, చివరికి ఎవరి రాష్ట్రాలను వారు సజావుగా పాలించడం కూడా కష్టసాధ్యమైపోయింది.
ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 2017లో అకస్మాత్తుగా తెలంగాణకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో విద్యుత్‌ సరఫరా ఒప్పందాలను కుదర్చుకోవాల్సి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య వైరాన్ని పెంపొందించిన అంశాల్లో ఇది ఒకటి మాత్రమే. అయితే, చంద్రబాబు కారణంగా రాజకీయాల్లో ఎదగడంతో పాటు, అనేక సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన రేవంత్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకోవడం ప్రారంభం అయింది. ఇక ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు అవసరమైన చర్యలను ఈ ముఖ్యమంత్రులు చేపట్టగలవన్న నమ్మకం ఏర్పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News