భర్తకు చెందిన ఇంటి పేరును భార్య కొనసాగించాల్సిన అవసరం ఉందా? భర్తతో విడాకులు అయిన తర్వాత కూడా భర్త ఇంటి పేరునే కొనసాగించాలా? మహిళలు తమ పుట్టింటి ఇంటి పేరును కొనసాగించకూడదా? ఢిల్లీ హైకోర్టు ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలో సమాధానం చెప్పబోతోంది. పురుషులతో సమానంగా ప్రతి హక్కునూ మహిళలు కూడా అనుభవించడానికి పోరాటాలు, ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో పురుషాధిక్యానికి, అనవసర పెత్తనానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ మహిళల జీవితాల నుంచి తొలగించాల్సిందేనని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. మహిళలకు తమ గుర్తింపు తమకు ఉండాలని కూడా ఆ వర్గాలు సూచిస్తున్నాయి. తన భర్తతో తనకు విడాకులు మంజూరు అయినందు వల్ల తన పూర్వపు ఇంటి పేరు తనకు కొనసాగాలని, భర్త ఇంటి పేరుతో తనకు సంబంధం ఉండకూడదని దివ్యా మోదీ తోంగ్యా అనే మహిళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏ మహిళైనా భర్తతో విడాకులు పొందిన తర్వాత తన పూర్వపు ఇంటి పేరుతో కొనసాగాలన్న పక్షంలో సంబంధిత సంస్థలకు లేదా వ్యక్తులకు తన విడాకుల మంజూరు పత్రాలను కూడా అందజేయాలని, లేదా భర్త నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ తీసుకు రావాలని ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ ఆమెకు అందడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
తోంగ్యా పిటిషన్ పై మే 28లోపు స్పందించాల్సిందిగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ ‘లింగ వివక్ష’కు అద్దం పడుతోందని తోంగ్యా తన పిటిషన్ లో పేర్కొన్నారు. తన ఇంటి పేరుపై తనకు హక్కు లేకుండా ఈ నోటిఫికేషన్ ఆంక్షలు విధి స్తోందని, సొంత పేరును, ఇంటి పేరును ఎంచుకునే హక్కు తనకు రాజ్యాంగపరంగా సంక్రమించాయని ఆమె స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగంలోని 14, 19, 21 ఆర్టికల్స్ కు విరుద్ధమని ఆమె వాదించారు. మాజీ భర్త నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను పొందడమనేదే పురుషాధిక్యానికి సంకేతమని, తమ ప్రాధాన్యాలను తాము ఎంచుకునే హక్కును మహిళలకు లేకుండా ఈ పురుషాధిక్య నోటిఫికేట్ అడ్డుకుంటోందని తోంగ్యా వాదించారు. తనకు ఏ ఇంటి పేరు ఉండాలో నిర్ణయించుకునే హక్కు తనకుండాలని ఆమె తెలిపారు.
పురుషాధిక్యానికి సంబంధించిన ఏ అంశంలో పోరాటం ప్రారంభించినా మహిళలకు ఒత్తిళ్లు, వేధింపులు తప్పవు. పెళ్లి తర్వాత తన పూర్వపు ఇంటి పేరును కొనసాగించాలని మహిళలు నిర్ణయించుకునే పక్షంలో వారిని పలువురు పలు రకాలుగా ప్రశ్నలతో, సందేహాలతో వేధించడం జరుగుతూనే ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తన పూర్వపు ఇంటి పేరును కాకుండా తప్పకుండా భర్త ఇంటి పేరునే కొనసాగించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలన్నా, పిల్లలను స్కూళ్లలో చేర్పించాలన్నా, చివరికి పాస్ పోర్టుకు దరఖాస్తు చేయాలన్నా తప్పనిసరిగా భర్త ఇంటి పేరునే తెలియజేయాల్సి ఉంటుంది. కుల సంబంధమైన పెత్తనాలు, కుటుంబ సంబంధాలలో ఆధిపత్య ధోరణులు వగైరాల మీద పోరాటాలు సాగించడానికి మహిళలు తమ విలువైన సమయాన్నంతా వెచ్చించాల్సి వస్తోంది. లింగ వివక్ష లేకుండా, ఆధిపత్య ధోరణులు లేకుండా, పక్షపాత రహితంగా వృత్తి, ఉద్యోగాల్లో మహిళలకు సరైన స్థానాలు కల్పించడం కూడా కష్టతరమవుతోంది.
భారతదేశం వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో సామాజికంగానే కాక, రాజకీయంగా కూడా మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంటి పనీ, ఆఫీసు పనీ చేయాల్సిన వస్తున్న మహిళలను కార్మిక శక్తిలో ఒక ప్రధాన భాగంగా ఎవరూ గుర్తించడం లేదు. ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఇళ్లలో మహిళలు ఏం చేయాలో, ఏం చేయకూడదో నిర్దేశించేది పురుషులే. ప్రపంచంలో అతి పెద్ద మానవ హక్కుల సమస్య లింగ సమానత్వాన్ని, మహిళా సాధికారికతను సాధించడమేనని ఐక్యరాజ్య సమితి ఇటీవల వ్యాఖ్యానించడం జరిగింది. మహిళల సాధికారికత, సమానత్వం విషయంలో దాదాపు ప్రతి దేశమూ శుష్క ప్రియాలు, శూన్య హస్తాలతో కాలక్షేపం చేస్తోందని, మహిళల స్వేచ్ఛ, సాధికారికత, సమానత్వాల కోసం చట్టపరమైన భద్రతలను కల్పించడంతో పాటు, సామాజిక వ్యవస్థల్లో మార్పును తీసుకు రావడానికి కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టవలసి ఉంది.
A Women fighting for her surname: ఇంటి పేరుపై మహిళ పోరాటం
ప్రశ్నలు, సందేహాలతో వేధింపులు