Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: చొక్కాపు మరో కోణం - మన జాతిపిత జీవితం

Telugu literature: చొక్కాపు మరో కోణం – మన జాతిపిత జీవితం

బాలసాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య పురస్కారం

చొక్కాపు వెంకటరమణ తెలుగు బాల సాహిత్యానికి చిరునామాదారుడే కాదు, చిరకాలం నుంచి విభిన్న రీతుల్లో బాలల సమీకృత వికాసమే లక్ష్యంగా పనిచేస్తున్న అక్షర కృషీ వలుడు, రచయితగా సంపాదకుడిగా మనోవికాస నిపుణుడిగా ఇంద్రజాలకుడిగా ఇలా ఏ విధంగా తన కృషి సాగిన అవి అన్ని బాలల కోసమే బాల సాహిత్య వికాసం కోసమే, అందుకే వారి బాలసాహిత్య కృషికిగాను బాలసాహిత్య విభాగంలో జాతీయస్థాయిలో కేంద్ర సాహిత్య పురస్కారం ఆయనను వరించింది.
తెలుగు బాల సాహిత్యంలో ఆయన చేయని ప్రయోగాలు లేవు, సృష్టించని రికార్డులు లేవు ఆయన ఏది చేసినా అందులో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అందులో భాగంగానే చొక్కాపుగారు ఇటీవల వ్రాసిన “గాంధీజీ జీవితకథ” గాంధీ మహాత్ముడు జీవిత చరిత్ర తెలియని భారతీయుడు లేడు ఆయన జీవితమే ఒక పార్టీ గ్రంధం కానీ వెంకటరమణ గారు అందరికీ తెలిసిన గాంధీ జీవిత గాధను భావి పౌరులైన పిల్లల కోసం తనదైన శైలిలో వినూత్నంగా వ్రాశారు. ఈ జీవిత చరిత్ర అంతా గాంధీ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలు ఆదర్శ సంఘటన మేలగింపుతో స్ఫూర్తివంతంగా రాయడంలో రచయిత శతశాతం సఫలం అయ్యారు. ఇక దీనికి మరో విశేషమేమిటంటే మహాత్ముడికి సంబంధించిన అరుదైన ఫోటోలు ఇందులో మనం చూడవచ్చు.
బాల గాంధీకి హరిశ్చంద్రుడు నాటకం కలిగించిన స్ఫూర్తి తల్లి పుత్రిబాయి సత్యం గురించి చేసిన వివరణ సాయంతో ప్రారంభమైన ఈ గాంధీ జీవిత చరిత్ర శాంతి కపోతాన్ని గాడ్సే చిదిమేసిన సంఘటనతో పరిసమాప్తి అవుతుంది. సంస్కృతి సాంప్రదాయాలను తల్లి పుత్లీవై నుంచి తండ్రి కరంచంద్ నుంచి నీతి, నిజాయితీ, విశ్వాస గుణం, అనేవి గాంధీకి బాల్యంలోనే అలవడ్డాయి. అంటే పిల్లల మనుగడలో తల్లిదండ్రుల ప్రభావం ఎంతటి ఆదర్శనీయంగా ఉంటుందో మనకు గాంధీ జీవితమే నిదర్శనం.
మన దేశంలో మహాత్ములు చాలామంది ఉన్నారు కానీ మహాత్ముడు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది జాతిపిత మహాత్మా గాంధీ పేరు మాత్రమే ఎందుకు అంతటి ప్రభావం ఆయనలో ఉంది? తెలిసి తెలియని బాల్యంలో గాంధీ కూడా కొన్ని తప్పులు చేశాడు చెడు పనులు చేశాడు మరి మహాత్ముడు ఎలా అయ్యాడు అనే సందేహం మనకు కలగవచ్చు ఇక్కడ మనం ఒకటి గమనించాలి తప్పులు చేయని మానవుడు ఒక్కడు లేడు, అది మానవుల సహజ గుణం కూడా! కానీ ఒకసారి చేసిన తప్పు పొరపాటు ఇక జీవితకాలంలో ఎప్పుడు చేయకుండా ఉండే అంత మార్పు ఎవరిలో వస్తుందో ఎవరు ఆ మార్పుకు కడదాకా కట్టుబడి ఉంటారో.. వారే చరిత్రలో మహాత్ములుగా నిలిచిపోతారు, అన్న నగ్న సత్యం చొక్కాపు గారి, “గాంధీ జీవిత కథ”లో స్పష్టం అవుతుంది.
గాంధీ లాయర్ పట్టా పొందారు సమాజంలో జరుగుతున్న ఆంగ్లేయుల అరాచకాలు పట్ల ధర్మాగ్రహంతో రగిలిపోయేవాడు కానీ తను భాషలో గాని మాట్లాడటం లో కానీ అంతగా పరిపక్వతలేదు సభల్లో మాట్లాడటం వచ్చేది కాదు, నోరు విప్పి మాట్లాడలేని ఈ బక్క ప్రాణి లాయర్ ప్రాక్టీస్ చేయడం కష్టం అని ఇంగ్లాండ్ లో మిత్రులంతా చలోక్తులు విసిరేవారు, దానితో.. న్యాయవాది పనికి తను పనికిరానని నిశ్చయించుకున్నారు గాంధి. అలా పదిమందిలో నోరు తెరవడానికి గడగడలాడిపోయిన గాంధీజీ, అనంతర కాలంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వేలాది మంది ఉన్న సభలో అనర్గళమైన విలువైన ఉపన్యాసాలు వందలాదిగా చేసి చరిత్రలో నిలిచిపోయిన ఘనత గాంధీజీ ది, ఇలాంటి స్ఫూర్తివంతమైన సంఘటనలు మనం ఇందులో అనేకం చదవవచ్చు.
పరిస్థితులు పరిసరాలు వ్యక్తులు మనుషులను ప్రభావితం చేసే శక్తి నిండుగా కలిగి ఉంటాయి, అందుకే కౌమారదశ బాల్యాన్ని పంట చేనును కాపాడినట్టు జాగ్రత్తగా కాపాడిన నాడే.. మనకు ఉత్తమ పౌరులు అనబడే అద్భుతమైన పంట మన చేతికి అందగలదు అని నిండు నిజాన్ని తల్లిదండ్రులు గురువులు ఆచరణ పూర్వకంగా అర్థం చేసుకోవాలి ఇలాంటి విలువైన సందేశాలను రచయిత చొక్కాపు గారు అనేక చోట్ల చెప్పకనే చెప్పారు.
గాంధీజీ జీవితం మార్పుకు ప్రధానమైనది ఆయన చేసిన దక్షిణాఫ్రికా ప్రయాణం అంతకుముందు బారిష్టర్ చదువు కోసం ఇంగ్లాండు వెళ్లారు అక్కడ అనేక కష్టాలు అవమానాలు ఎదుర్కొన్నారు అది విద్యార్థి దశ కాని ఒక లాయరుగా దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ కూడా తనలోని బలహీనతల వల్ల అవహేళనలకు గురై చివరికి తన దేశం పరాయిపాలనలో పడుతున్న అవమానాలు ఇబ్బందులు గుర్తుకు రాగా అదే ఆయనను స్వరాజ్యసమరం వైపు నడిపించింది.
ఆచరణ సూత్రమే అస్త్రంగా చేసుకుని అద్భుతమైన ఉద్యమానికి రూపకల్పన చేసుకుని అనేక వ్యూహ ప్రతి వ్యూహాలను సత్యాగ్రహం సాయంగా ఏర్పాటు చేసి ఊహించని విజయం సాధించి యావత్ భారత జాతికే పితామహుడుగా చిరంజీవిగా చరితార్ధుడు అయిపోయారు ఇది కేవలం గాంధీజీకి మాత్రమే పరిమితం అయిపోయిన విషయం కాదు, అన్ని రంగాలలో పనిచేస్తున్న మానవ మాతృలు అందరికీ వర్తిస్తుంది. ప్రయత్నిస్తే ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడే అన్న విద్యావంతుల మాటలను ప్రతి వ్యక్తి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి.. అనే నిజం ఇందులో కనిపిస్తుంది.
ఈ పుస్తకం మొత్తం 53 సంఘటనలతో సమ్మిళితం చేయబడింది. గాంధీజీ ఉప్పు ఉత్తరం, ఆటకు తోడు జీవితానికి జోడు, అప్పు తీరింది తప్పు తెలిసింది, గాంధీజీ గుండుసూది, గాంధీజీకి 40 కోట్ల చొక్కాలు, వంటి ఆకర్షణీయమైన శీర్షికలు ఈ పుస్తకానికి అదనపు విలువలు ఆకర్షణలుగా నిలిచాయి. పథకాన్ని కథగా కథనంతో కలిసిన ఈ జీవిత చరిత్ర లక్ష్యం బాలలే అయినా బాలల అభివృద్ధి కోరుకునేవారు బాలల కోసం మాట్లాడేవారు బాలల కోసం రాసేవారు తప్పనిసరిగా ఈ పుస్తకం చదవడం సభ్యత, ప్రతి విద్యాలయాల్లో విధిగా ఉండాల్సిన ఈ విలువైన వినూత్న పుస్తకమును, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వంటి సాహితీ పోషకులు పుస్తక రూపంలో తీసుకురావడం పాఠకుల పాలిట అదృష్టంగా భావిస్తూ అందరూ దీనిని ఆచరణాత్మకంగా చదివి తీరాలి.
జాతిపిత మహాత్మా గాంధీ (జీవిత కథ)

- Advertisement -

రచన: చొక్కాపు వెంకటరమణ,

ప్రచురణ: తెనాలి ప్రచురణలు,

సెల్ 9347661122,

పుటలు; 96.
సమీక్షకుడు: డా: అమ్మిన శ్రీనివాసరాజు,

సెల్ :-77298 83223.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News