Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్CM Mamata behaviour causing many tensions: అగ్గి రాజేస్తున్న దీదీ ధోరణి

CM Mamata behaviour causing many tensions: అగ్గి రాజేస్తున్న దీదీ ధోరణి

సీఎంకు చీమ కుట్టినట్టైనా లేదా?

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. ఆమెకు మహిళలంటే ద్వేషమని, మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఆమెకు చీమ కుట్టి నట్టయినా ఉండదని అత్యధిక సంఖ్యాక మహిళలకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. మహిళల సంక్షేమానికి, మహిళల భద్రతకు సంబంధించిన ఏ విషయాన్నీ మమత సీరియస్‌ గా తీసుకోరని ఆమెకు సన్నిహితులు కూడా చెబుతుంటారు. సాధారణంగా ఆమె మహిళా శాసనసభ్యులను గానీ, ఎంపీలను గానీ కలుసుకోరట. ఈ మనస్తత్వం కారణంగానే నౌఖాలీలో అత్యాచారాలు జరిగినా, కార్‌ ఆస్పత్రిలో అత్యాచారం జరిగినా ఆమె పెద్దగా స్పందించలేదనేది రాష్ట్రంలోని మహిళా సంఘాల అభిప్రాయం. కార్‌ ఆస్పత్రిలో ఒక వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగడం, ఆ తర్వాత ఆమెను పాశవికంగా హత్య చేయడం జరిగినా ఆమెలో కనీస స్పందన, కనీస మానవత్వం కనిపించలేదని మహిళా రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
మమతా బెనర్జీకి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న కోరిక ఎక్కువ. అయితే, ఆమె ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. ప్రతిపక్షాల ఇండీ కూటమి ద్వారా తన లక్ష్యాన్ని సాధించుకోవాలని ప్రయత్నించారు కానీ, శ్రమ తనది, ఫలితం కాంగ్రెస్‌ పార్టీదిగా కనబడే సరికి ఆమె నెమ్మదిగా దీని నుంచి బయటపడ్డారు. దేశ ప్రధానమంత్రి కావాలన్న తన కోరిక తీరక పోయే సరికి ఆమె కనీసం దేశ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందాలన్న ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ‘ఈ రోజు బెంగాల్‌ ఏం ఆలోచిస్తుందో రేపు యావద్దేశం అదే చేస్తుంది’ అని బెం గాల్‌లో ఒక నానుడి ఉంది. మమతకు ఆ నానుడి మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు తానేం ఆలోచిస్తున్నానో రేపే దేశం అదే చేస్తుంది అని ఆమెకు భావిస్తుంటారు. చివరికి అత్యాచారాలు, హత్యలు వంటి ఘోరమైన నేరాలు సైతం ఒక్క తమ రాష్ట్రంలోనే కాక దేశమంతా జరుగుతున్నా యంటూ ఆమె ప్రకటనలు చేయడం, అసెంబ్లీలోనూ, బయటా వాదించడం ఆమెలోని విచిత్ర, వికృత భావాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వంలోని అవినీతి కార్యకలాపాలు కూడా దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నవేనని కూడా ఆమె అనేక సందర్భాల్లో వాదించారు.
వ్యాధొక చోట మందొక చోట
గత మంగళవారం నాడు ఆమె రాష్ట్రంలో అత్యా చారాల నిరోధానికి సంబంధించిన ఒక బిల్లును ప్రవేశ పెడుతూ ఇదే రకమైన వాదనలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో జరిగిన అత్యాచారం కేసుల వివరాలను ఆమె శాసనసభలో వివరించడం ప్రారంభించారు. కోల్కతాలోని ఆర్‌.జి. కార్‌ ఆస్పత్రిలో ఒక 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరగడాన్ని పురస్కరించుకుని ఆమె ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ అత్యాచారం పట్ల నిరసరగా బెంగాల్‌ ప్రస్తు తం నిరసనలు, ప్రదర్శనలతో అట్టుడికిపోతోంది. ప్రజ లంతా తమకు తాముగా వీధుల్లోకి వచ్చి, అత్యాచార బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని, నేరస్థు లను కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. అత్యాచారానికి నిరసనగా ప్రారంభమైన ప్రదర్శనలు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంలోని అవినీతి, దళారీ కార్యకలాపాలు, అధికారుల దోపిడీ విధానాలు వగై రాలను కూడా ప్రస్తావించడం జరుగుతోంది. ఇంతవరకూ తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలకు భయపడతూ వస్తున్న సాధారణ ప్రజానీకం చివరికి ధైర్యం కూడగట్టుకుని గొంతె త్తడం ప్రారంభించింది. అయితే, ఆర్‌.జి. కార్‌ ఆస్పత్రి కేసులో తానొక బాధితురాలినని మమతా బెనర్జీ భావిస్తు న్నారు. బెంగాల్‌లోని తృణమూల్‌ పాలిత ప్రభుత్వం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మొదటి నుంచి ద్వేష మేనని, ఇప్పుడు కూడా వైద్యురాలి కేసును అడ్డం పెట్టుకుని తనను గద్దె దించే ప్రయత్నం చేస్తోందని ఆమె ఆరోపిం చారు. కేంద్ర ప్రభుత్వం కారణంగానే రాష్ట్రంలో ఆందోళ నలు చెలరేగాయని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనలకు బీజేపీ ఎంత కారణమో తెలియదు కానీ, ప్రజలు తమకు తాముగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళనలు చేయడం మాత్రం పచ్చి నిజం. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్వాకాలు ఇక చాలని, తాము ఇక వీటిని భరించేది లేదని సామాన్య ప్రజలు సైతం వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఆందోళనకు బీజేపీ మద్దతు పూర్తిగా లభిస్తోంది. దీనిని అవకాశంగా తీసుకుని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కూడా బీజేపీ భావిస్తోంది. ఒక్క బీజేపీయే కాదు, రాష్ట్రంలోని కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీ కూడా భావిస్తున్నాయి.
అసందర్భ ప్రేలాపనలు
కోల్‌ కతా అత్యాచారం కేసును సమర్థించుకుంటూ మమతా బెనర్జీ ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన హత్రాస్‌ దుర్ఘట నను, ఉన్నావ్‌ సంఘటనను కూడా ప్రస్తావించడం మాత్రం మమత అవివేకానికి, మూర్ఖత్వానికి పరాకాష్ట. “హత్రాస్‌ సంఘటనలో ఇంత వరకూ బాధితులకు న్యాయం జరగ లేదు. ఉన్నావ్‌ సంఘటనను అంతా మరచిపోయారు” అంటూ ఆమె శాసనసభలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మీద రెచ్చిపోయారు. “ప్రతి రాష్ట్రంలోనూ అత్యాచారాలు జరుగుతున్నాయి” అని ఆమె అనేక వివరాలను ఏకరువు పెట్టారు. “బులంద్‌ షహర్‌ లో ఆరేళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. ఆగ్రాలో ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థి మీద అత్యాచారం జరిగింది. ఉత్తరా ఖండ్‌లో ఒక యువతిని రేప్‌ చేశారు. ఆమె మృతదేహం తొమ్మిది రోజుల తర్వాత దొరికింది. మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు చిన్నారుల మీద అత్యాచారం చేశారు. ముంబైలో 13 ఏళ్ల బాలికను చెరపట్టారు. అస్సాంలో 14 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. రాజస్థాన్‌ లోని ధోల్పూర్‌ ఒక మైనర్‌ బాలిక మీద సామూహిక అత్యా చారం జరిగింది. ఆ తర్వాత ఆమెను చంపేశారు. జోధ్‌ పూర్‌లో మూడేళ్ల పాప మీద అత్యాచారం జరిగింది” అంటూ ఆమె ఒక పెద్ద జాబితాను బయటపెట్టారు. అత్యాచారం అనేది దేశానికి సిగ్గుచేటైన విషయం అని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాదు, దేశంలో మూడవ అతి పెద్ద సురక్షిత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌ అంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కితాబును కూడా ఆమె గుర్తు చేశారు. అయితే, ఆమె చెప్పిన వివరాలతో ఆందోళనకారులు, రాష్ట్రంలోని మహిళా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు ఏమాత్రం ఏకీభవించడం లేదు. కోల్‌కతా నగరం నడిబొడ్డున ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నప్పుడు తృణ మూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గూండాలు, రౌడీలు జొరబడి మహిళల మీద లైంగిక దాడులు జరిపినట్టు మహిళా సంఘాలు వెల్లడించాయి. కార్‌ ఆస్పత్రి వర్గాలు ఈ అత్యాచారం కేసును మసిపూసి మారేడు కాయ చేయ బోవడం, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడం ఆమె మరచి పోయినట్టున్నారు. ఆ ఆస్పత్రి-కళాశాల ప్రిన్సిపాల్‌ ను ఉద్యోగం నుంచి తొలగించవలసింది పోయి ఆయనను మరో ఆస్పత్రికి బదిలీ చేయడం ఆమె చేతుల మీదుగానే జరిగింది. మమత అధికారంలో ఉన్నంత వరకూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, ఆమె ఒక మహిళా ద్వేషి అని మహిళా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రతి చిన్న పనికీ కమిషన్లు తీసుకోవడం అలవాటైపోయిందని, దళారీలు పెరిగి పోయారని కూడా ఆందోళన కారులు విమర్శిస్తున్నారు.
కార్‌ ఆస్పత్రి సిబ్బందితో పాటు ఇతర ఆస్పత్రుల సిబ్బంది కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న నేరాలను ఉటంకించడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను మమత కప్పి పుచ్చడం జరిగే పని కాదు. పైగా ఇటువంటి పోలికల వల్ల మమత మరింతగా ఏకాకి అయిపోయే అవకాశం ఉంది. అవినీతికి, అత్యాచారాలకు, మహిళా భద్రతకు సంబం ధించి ఆందోళనకారులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను మమత ప్రభుత్వం ఎంత త్వరగా పరిగణనలోకి తీసు కుంటే అంత మంచిది. హత్రాస్‌, ఉన్నావ్‌, బద్లాపూర్‌ సం ఘటనలను ప్రస్తావించినంత మాత్రాన తప్పు ఒప్పయి పోదు. రాజకీయాలను పక్కనపెట్టి మమత ప్రభుత్వం ముందుగా కార్యాచరణ చేపట్టాలి. ప్రజల్లో ఉన్న ఆందోళ నలను పోగొట్టాలి. అయితే, ఇటువంటి సదాలోచనలు, సదుద్దేశాలు మమతకు ఇంకా ఒంటబట్టినట్టు కనిపించడం లేదు.

  • ఎం. వెంకటేశ్వర రావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News