అనుకున్నట్టే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల హడావిడి సద్దుమణిగింది. బీజేపీ ప్రభుత్వం అధి కారంలోకి రావడం, స్థిరపడడం కూడా జరిగిపోయింది. ఇప్పటికైనా, ఈసారైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య ప్రజల గోడు విం టారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. వీరి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొటొక్కటిగానైనా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ వర్గాల వారి కోరికలు చాలా చిన్నవి. ప్రభుత్వ ఖజానా మీద కోట్లాది రూపాయల భారం పడే అవకాశం లేదు. ఈ చిన్నపాటి కోరికలను తీర్చడం వల్ల, స్వల్ప స్థాయి సమస్యలను పరిష్కరించడం వల్ల సాధారణ ప్రజానీకానికి ఎంతో ఊరట కలుగుతుంది. ప్రభుత్వం ఈ సాదా సీదా వ్యవహారాలను పట్టించుకోవడానికి అవకాశం ఉండదు. అయితే, ఇవి సాధారణ ప్రజానీకాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయాలు.
ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకాన్ని, ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వ వెబ్ సైట్లలో అప్‌డేట్ చేసి ఉంచా ల్సిన అవసరం ఉంది. ఈ పథకాలకు సంబంధించిన వివ రాలను మరింత సరళం చేయడంతో పాటు, వెబ్ సైట్లకు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం తమ వెబ్ సైట్లను అప్ డేట్ చేసి చాలా కాల మైంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వీటిల్లో పొందుపరచడం వల్ల సామాన్యు లకు వీటి ఫలాలు త్వరగా అందడానికి, తప్పకుండా అంద డానికి అవకాశం ఉంటుంది. పథకాలు, ఇతర సమాచా రాలను ఎప్పటికప్పుడు పొందుపరచడం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించడం తో పాటు, వారి స్పందనను తెలుసుకోవడానికి కూడా వెబ్ సైట్లు అవకాశం కల్పిస్తాయి. జి-మెయిల్ ద్వారా లేదా ఫ్రీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సందేశాలను పంపించడం మానుకోవాలి. ఇటువంటివి హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఇవి సామాన్యులకు అందు బాటులో ఉండకపోవచ్చు. ఇవి ప్రమాదకరం. అవినీతి కార్యకలాపాలకు దారితీస్తాయి.
సరికొత్త సమాచారం
ఆదాయ పన్ను శాఖకు చెందిన పోర్టల్స్ ను మరింత ఆధునికం చేయాల్సిన అవసరం ఉంది. కంపెనీల్లో ఆదా య పన్ను వసూలు చేసుకున్న మరుక్షణం ఇక్కడ ఉద్యోగు లకు ఆ సమాచారం అందే విధంగా పోర్టల్‌ను తీర్చిది ద్దాలి. సామాన్యులు తమకు అవసరమైన సమాచారం కోసం గంటల కొద్దీ ప్రయత్నించాల్సి వస్తోంది. ఈ కార ణంగానే ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడం బాగా ఆలస్యం అవుతోంది. చివరి క్షణంలో ఈ వివరాలన్నీ అప్ లోడ్ చేయలేక పెద్ద బ్యాంకులు సైతం అవస్థలు పడడం జరుగుతోంది. ఆదాయ పన్ను విభాగం తమ ఖాతాదార్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయని పక్షంలో వారి మీద చర్యలు తీసుకోవడం మంచిది. దీనివల్ల సాధారణ ప్రజానీకానికి, మధ్యతరగతి వారికి చాలా సమయం కలిసి వస్తుంది. డివిడెండ్ల మీద డబుల్ టాక్సేషన్‌ను తొలగించడం వల్ల సాధారణ పన్ను చెల్లింపు దార్లకు ఎంతో ఊరట లభిస్తుంది.
నగరాలు, పట్టణాల్లోనే కాదు, పంచాయతీల్లో కూడా ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలను మెరుగు పరచడం మంచిది. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తున్న విధంగానే ఆరోగ్య కేంద్రాలను కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం మంచిది. సాధారణంగా ఈ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కనిపించరు. సౌకర్యాలు నామమాత్రంగా ఉంటాయి. సరైన చికిత్సలకు, రోగ నిర్ధారణలకు అవకాశం ఉండదు. ఇక్కడి సిబ్బందితో పనిచేయిస్తే సరిపోతుంది. వారి దాష్టీకం, వ్యవహార శైలి కారణంగా సాధారణ ప్రజానీకం ఈ ఆరోగ్య కేంద్రాలకు రావడానికి వెనుకాడుతుంటారు. ప్రభుత్వాలు వీటి మీద భారీగా ఖర్చుపెట్టినా ప్రయోజనం ఉండడం లేదు. ఇవి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు.
ప్రయాణాల్లో ఇబ్బందులు
తక్కువ దూరపు రైలు ప్రయాణాలకు సంబంధించిన నెట్ వర్కును పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా తక్కువ దూరపు విమాన ప్రయాణాలను కూడా క్రమబద్దం చేయడం మంచిది. ఇది పర్యావరణానికి మం చిది. ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుంది. విమా నాశ్రయాల్లో విమానాలు ఎక్కడానికి, దిగడానికి నిర్దేశి స్తున్న సమయాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. విమానం ఎక్కడానికి ముందు రెండు గంటలు, దిగిన తర్వాత రెండు గంటలు విమానా శ్రయాల్లోనే గడపాల్సి వస్తోంది. రెండు గంటల ప్రయాణానికి ఏడెనిమిది గంటల సమయం వృథా అవుతోంది. దీనివల్ల విమానాలను ఎక్కడం వల్ల ఉపయో గం లేకుండా పోతోంది. విమానాశ్రయాల్లో విమానం ఎక్క డానికి ముందు అనేక దశలు దాటడమనేది వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది.
ఇక విమానాల్లో తక్కువ ధరకు, సాధారణ ఆహారం లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు విమాన ప్రయాణాలు సాధారణ ప్రజలకు కూడా అవసరంగా మారుతున్నందువల్ల, విమానాశ్రయాలను సంపన్నులకు మాత్రమే పరిమితం చేయడం మంచిది కాదు. రబ్బరు చెప్పుల వారు, ప్లాస్టిక్ చెప్పుల వారు కూడా విమాన ప్రయా ణాలు చేయడానికి ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్న సమ యంలో వారికి తగ్గ ఆహార సౌకర్యాలను కూడా కల్పిం చడం ప్రభుత్వ కనీస బాధ్యత. సందర్భానుసారంగా విమాన చార్జీలను పెంచే పద్ధతికి కూడా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. ధరలను స్థిరీకరించడం ఎయిర్ లైన్సుకూ మంచిది. ప్రయాణికులకూ మంచిది. ఎప్పటికప్పుడు చార్జీ లను మార్చేయడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడడం జరుగుతోంది.
ఆరోగ్యం మీద శ్రద్ధ
ఆస్పత్రుల నిర్మాణం సమంజసమైన విషయమే కానీ, నివారణ చర్యల మీద శ్రద్ధ పెట్టడం అంతకన్నా మంచిది. ఔషధ పరిశ్రమలకు ఇది నచ్చకపోవచ్చు. ఆస్పత్రుల నిర్మాణం అనేది రోగ పరిశ్రమ కాగా, నివారణ చర్యలు తీసుకోవడమన్నది ఆరోగ్య పరిశ్రమ. ఆరోగ్య పరిశ్రమ మీద ఇకనైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నివారణ ఔషధాల మీదా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ఉత్పత్తి మీదా శ్రద్ధ పెట్టే పక్షంలో ఆస్పత్రుల నిర్మాణ అవసరం తగ్గుతుంది. రైతులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో, రైతుల ఆదాయాలను పెంచాలన్న అభిప్రాయంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఇతోధికంగా ప్రోత్సహించడం జరుగుతోంది. దేశంలో ఆరోగ్య సంరక్షణ ఉద్యమం ఊపందుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఫుడ్ ప్రాసె సింగ్ వల్ల ఆరోగ్య సంరక్షణ సాధ్యమవు తుందా అన్న విషయాన్ని పరిశీలించాలి. గృహ పదార్థాలు ముఖ్యమా, దుకాణ పదార్థాలు ముఖ్యమా అన్నది ఆలోచించాలి.
రోడ్ల పక్కన నడవడానికి అవకాశం లేకుండా పోతోంది. ఫుట్‌పాత్‌ల అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడం జరుగుతోంది. రోడ్ల పక్కన నడక మార్గాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు తగ్గడంతో పాటు, తక్కువ దూరం నడిచి వెళ్లడానికి అవకాశం కల్పించినట్టవుతుంది. ప్రజలకు కనీసం కిలోమీటర్ దూరంలో ఉన్న తమ కార్యాలయా లకు, మార్కెట్లకు నడిచి వెళ్లే అవకాశం ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇక మోదీ తమ మూడవ పర్యాయపు హయాంలోనైనా, అధి కార వికేంద్రీకరణకు సిద్ధ పడాలి. అధికారాన్నంతా ఢిల్లీలో కేంద్రీకృతం చేయకుండా, రాష్ట్రాల స్థాయికి కూడా తీసుకు రావాల్సిన అవసరం ఉంది.
- ఎస్. విశ్వేశ్వర రావు