Sunday, June 16, 2024
Homeఓపన్ పేజ్Cong manifesto: కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో అవినీతిపై మౌనం

Cong manifesto: కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో అవినీతిపై మౌనం

బీజేపీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రచారం చేసినా అవినీతి నిర్మూలన గురించి, అవినీతి నిర్మూలనకు తాము తీసుకుంటున్న చర్యల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తోంది. అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ శిశోడియా, హేమంత్‌ సోరేన్‌, కల్వకుంట్ల కవితల అరెస్టులను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందుకు ప్రతిగా కాంగ్రెస్‌ మాత్రం అవినీతిపరులను వెనకేసుకు రావడంతో పాటు, అవినీతి నిర్మూలన గురించి, దానికి సంబంధించి తమ ఆలోచనల గురించి ఎక్కడా పెదవి విప్పిన దాఖలాలు లేవు. బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఎక్కడా అవకాశం కూడా లేదు. అవినీతి అనేది విశ్వవ్యాప్తంగా ఉన్న వ్యవహారమేనంటూ కొద్ది సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. బహుశా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ అభిప్రాయానికే కట్టుబడి ఉండి ఉంటారు. నిజానికి, జాతీయ స్థాయిలో అవినీతిని గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా నాయకులు, అధికారులు దీని గురించి చర్చించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. దాన్ని మినహాయించి ఇతర విషయాలు చర్చించడానికే సిద్ధపడుతుంటారు. ఇందుకు ఏదో ఒక కారణాన్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. దేశంలో ఈ అవినీతి గురించి విస్తృతంగా మాట్లాడే ప్రయత్నమే కాదు, కాంగ్రెస్‌ హయాంలో దీన్ని అరికట్టే ప్రయత్నం కూడా జరిగిన దాఖలాలు లేవు. నిజానికి దాదాపు ఆరు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీతో పోలిస్తే పదేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొద్దిగా నయమనే భావనే ఎవరికైనా కలుగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఓటర్లను ఉద్దేశించి బహిరంగ సభల్లో మాట్లాడుతూ, తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఉన్న 23 ఏళ్ల కాలం గురించి వివరంగా తెలియజేశారు. ఇంతవరకూ తనపైన ఎటువంటి అవినీతి ఆరోప ణలూ లేవని, అభివృద్ధి గురించే తాపత్రయపడతాననే పేరుందని ఆయన తెలిపారు. దేశంలో దాదాపు ప్రతి ప్రధానమంత్రి మీదా అవినీతి ఆరోపణలున్న నేపథ్యంలో ఆయన చెప్పింది నిజమేననిపిస్తుంది. అవినీతి వ్యవహారాల నేవి జవహర్‌ లాల్‌ నెహ్రూ హయాం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రిగా ఉండగా లాల్‌ బహదూర్‌ శాస్త్రి నియమించిన సంతానం కమిటీ నెహ్రూ హయాంలో పలువురు మంత్రులు అవినీతికి పాల్పడినట్టు, పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు కైంకర్యం చేసినట్టు నివేదికను సమర్పిం చింది. అన్యాయంగా, అక్రమంగా బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడి, నిధులు స్వాహా చేసినట్టు అది గణాంకాలతో సహా తెలియజేసింది.
అయితే, తమ మంత్రుల మీద ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి ఆ అవినీతి మంత్రిని కాపాడడానికే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తుల్మోహన్‌ రామ్‌, రుస్తుం సోహ్రబ్‌ నాగర్వాలా అవినీతి వ్యవహారాలు ఆమె హయాంలోనే బయటపడ్డాయి. అప్పట్లో విదేశీ వాణిజ్య మంత్రిగా ఉన్న లలిత్‌ నారాయణ్‌ మిశ్రాతో కలిసి, అక్రమంగా లైసెన్సులను జారీ చేశారని పార్లమెంట్‌ సభ్యుడు తుల్మోహన్‌ రామ్‌ పై ఆరోపణలు వచ్చాయి. ఆ మంత్రి కూడా పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసినట్టు, అక్రమంగా లైసెన్సులు మంజూరు చేసినట్టు విచారణలో తేలింది కానీ, ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ హయాంలో బోఫోర్స్‌ కేసులో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్టు వెల్లడైంది. ఆయనకు అనేక కోట్ల రూపాయల ముడుపులు అందినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో అత్యధిక అవినీతి కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూమి కబ్జాలకు, ఆర్థిక అవినీతికి పాల్పడినట్టు ప్రస్తుతం ఇండీ కూటమిలో ఉన్న నాయకులు కూడా అప్పట్లో ఆరోపణలు చేయడం జరిగింది. హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌ ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాల కింద వాద్రాకు భూములు, నిధులు కట్టబెట్టడం జరిగింది. మధ్యలో అటల్‌ బిహారి వాజ్‌ పేయీ ప్రభుత్వాన్ని మినహాయిస్తే, మిగిలిన ప్రభుత్వాలన్నీ అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలాయి. చరణ్‌ సింగ్‌, చంద్రశేఖర్‌, దేవెగౌడ, వి.పి. సింగ్‌, ఐ.కె.గుజ్రాల్‌ ప్రభుత్వాల్లో అవినీతి వ్యవహారాలు వెల్లువెత్తడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మోదీ తాను ‘అవినీతి రహిత’, ‘అభివృద్ధి యుత’ ప్రధానినని చెప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అవినీతిని, బంధుప్రీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని దగ్గరకు రానివ్వకపోవడమే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో మోదీకి సానుకూల అంశాలుగా మారాయి. మోదీ కుటుంబ సభ్యులెవరూ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ దగ్గరకు కూడా రావడం లేదు. స్వప్రయోజనాల కోసం ఆయన సోదరులెవరూ ఆయనను ఇంత వరకూ కలుసుకోవడం కూడా జరగలేదు. ఫలితంగా మోదీ ఇప్పుడు నైతిక బలంతో మాట్లాడగలుగుతున్నారు. అవినీతిరహిత అధికారుల్ని, ఫలితాలు సాధించేవారికి ఆయన ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు. మొత్తం మీద మోదీ తాను అవినీతిరహిత, అభివృద్ధి సహిత ప్రధానినని చెప్పుకోవడంతో పాటు దాన్ని ఆచరణలో చూపించారనడానికి అనేక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. అవినీతి మరక లేకుండా సమర్థంగా పనిచేయగలనని మోదీ చెప్పగలుగు తున్నారు. అవినీతి లేకుండా పాలన సాగించడం అసాధ్యమని, ఇది విశ్వవ్యాప్తంగా ఉన్నదేనని చెప్పడం భావ్యం కాదనే విషయం రుజువవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News