Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Congress strategy: ఉత్కంఠ రేకెత్తిస్తున్న వ్యూహాలు, ప్రతివ్యూహాలు

Congress strategy: ఉత్కంఠ రేకెత్తిస్తున్న వ్యూహాలు, ప్రతివ్యూహాలు

కొత్త ప్రచార యంత్రాంగాన్ని

ఇటీవలి అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలించిన వారికి భారతదేశం వంటి చైతన్య వంతమైన దేశంలో రాజకీయ నాయకులు, ఎన్నికల నిర్వాహకులు, ప్రచార సారథులు ఎప్పటికప్పుడు తమ ఎన్నికల విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందనిపిస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం ఆదమరచి ఉన్నా, తప్పటడుగు వేసినా ఇక జారిపోతుండడం మొదలవుతుంది. ఎన్నికల తీరుతెన్నులు మారిపోతున్న విషయాన్ని పార్టీల్లోని ఎన్నికల అజమాయిషీదార్లు ఎంతో నిశితంగా పరిశీలించి కొత్త కొత్త వ్యూహాలను అనుసరించడంతో పాటు, తమ పరిజ్ఞానాన్ని కూడా పెంచుకోవలసి ఉంటుంది. కర్ణాటక ఎన్నికల్లో అయిదు గ్యారంటీలను ప్రకటించి, ఘన విజయం సాధించడంతో తాను ఎన్నికల విజయానికి ఒక కొత్త సూత్రాన్ని కనిపెట్టినట్టు సంబర పడిన కాంగ్రెస్‌ పార్టీకి అయిదు రాష్ట్రాల ఎన్నికలతో మత్తు దిగిపోయింది. బీజేపీ తెలంగాణలో ఆరు గ్యారంటీలను, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌ లలో ఏడు గ్యారంటీలను ప్రకటించి తాను ఈ విషయంలో కాంగ్రెస్‌ కంటే ఒక ఆకు ఎక్కువే చదివినట్టు నిరూపించుకుంది.
ఇంకా కర్ణాటక ఎన్నికల విజయోత్సవాలలోనే మునిగి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆ మూడు హిందీ రాష్ట్రాలలో ఘోరపరాజయం పాలయింది. తెలంగాణలో విజయం సాధించినప్పటికీ కీలక రాష్ట్రాలను చేజార్చుకుంది. తెలంగాణలో బీజేపీ తన పరిస్థితిని మెరుగుపరచుకుంది. చివరికి తేలిందేమిటంటే, ఈ మూడు రాష్ట్రాలలో మోదీ గ్యారంటీలు, అమిత్‌ షా వ్యూహాలు ఘన విజయం సాధించినట్టు రూఢీ అయింది. కాంగ్రెస్‌ చేసిన మరో తప్పిదం ఏమిటంటే, అది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా గ్యారంటీలను ప్రకటించింది. ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదు. కర్ణాటకలో భంగపడ్డ మరుక్షణం బీజేపీ అంతర్గతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, వైఫల్యానికి కారణాలను పరిశీలించి, తప్పులు సరిదిద్దుకుని, కొత్త వ్యూహాలకు రూపకల్పన చేసింది. కాంగ్రెస్‌ కర్ణాటక విజయంతో సంతృప్తి చెంది, ఇదే వ్యూహాన్ని ఇతర రాష్ట్రాలలోనూ అమలు చేయాలని నిర్ణయించుకుంది. పైగా, అక్కడి తీర్పును తప్పుగా అంచనా వేసింది.
బీజేపీ పథకాలు, ప్రణాళికలు ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ తన తురుఫు ముక్క అయిన నరేంద్ర మోదీనే మళ్లీ ప్రయోగించింది. బీజేపీ ఈసారి కూడా ఈ వ్యూహానికే కట్టుబడి ఉంది. ఆయన జాతీయ స్థాయిలో తన గ్యారంటీలను ప్రకటించారు. ఈసారి స్థానిక సమస్యలను కూడా అత్యధికంగా ప్రస్తావించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీకి జ్ఞానోదయం అయి, తమ జాతీయ లక్ష్యాలను వివరించడంతో పాటు, తాము సాధించిన ఆర్థికాభివృద్ధిని, స్థానిక సమస్యలకు కూడా పరిష్కారాలు పేర్కొనడం జరిగింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీ వ్యవహార శైలిని గణనీయంగా మార్చేసింది. అది కొత్త వ్యూహాలు, ప్రతివ్యూహాలను రూపొందించుకోవడానికి, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండడానికి, తమ లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయి. కర్ణాటకలో ఘోర పరాజయం పాలవడం చూసి, బీజేపీ కుప్పకూలిపోలేదు. పంజాబ్‌, ఢిల్లీలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మాదిరిగా, కర్ణాటకలో కాంగ్రెస్‌ మాదరిగా అది ఉచిత విద్యుత్‌ సరఫరా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటివి ప్రకటించలేదు. పేదరికం నిర్మూలన, స్థానిక సమస్యలు, జాతీయ ఆకాంక్షల గురించి మాత్రమే అది ప్రస్తావించింది.
ఇందులో 80 కోట్ల మందికి ఉచితంగా నిత్యావసర వస్తువుల సరఫరా, ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్య బీమా పథకం, ఉజ్వల యోజన కింద పేదలకు సబ్సిడీపై గ్యాస్‌ సిలెండర్ల పంపిణీ, ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన కింద పేదలకు ఇళ్ల నిర్మాణం, కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఏటా రూ. 6000 నగదు బదిలీ, గర్భిణీలకు రూ. 5,000 నగదు వంటివి చేరి ఉన్నాయి. ఈ పథకాలన్నిటినీ పటిష్టంగా అమలు చేస్తామని, నేరుగా బ్యాంకులకే నగదు బదిలీ జరుగుతుందని బీజేపీ హామీ ఇచ్చింది. ఇవన్నీ పేదరికం నిర్మూలన, సామాజిక సంక్షేమ పథకాల్లో భాగమే తప్ప, ఉచితాలు కాదు. పైగా ఇవన్నీ దేశవ్యాప్తంగా అమలయ్యే పథకాలు. ఈ పథకాల అమలును మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నందు వల్ల ఇవి దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలావరకు అమలవుతున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి, లబ్ధిదారులకు సవ్యంగా, సజావుగా ఇవి చేరడానికి, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి అమిత్‌ షా ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని, వ్యవస్థను రూపొందించడం కూడా జరిగింది.
కార్యాచరణ వ్యూహాలు
అమిత్‌ షా రూపొందించిన సూక్ష్మ ఆర్థిక ప్రణాళిక బీజేపీకి ఎంతో ప్రత్యేకమైన కార్యాచరణ వ్యూహం. పాలక, ప్రతిపక్షాల్లో ఇది ఎంతగానో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందు వీలైనంత మంది ఓటర్లను కలుసు కోవడానికి బూత్‌ స్థాయిలో బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా బూత్‌ స్థాయి కార్యకర్తలను నియమించారు. వీరిని ‘పన్నా ప్రముఖ్‌’లుగా పిలుస్తు న్నారు. ఒక్కొక్క కార్యకర్తా కనీసం 30 మంది ఓటర్లను రోజూ కలుసుకోవాల్సి ఉంటుంది. మోదీ ప్రకటించిన పథకాలు వీరికి చేరుకున్నాయా లేదా అని వీరు ఆరా తీస్తుంటారు. ఒకయ కంపెనీ తమ ఉత్పత్తుల గురించి ఎలా ఆరా తీస్తుందో అదే విధంగా బీజేపీ కూడా తమ పథకాల అమలు గురించి ఆరా తీస్తుంటుంది. బీజేపీ సాగిస్తున్న ఈ బూత్‌ స్థాయి ప్రయత్నాలు చాలావరకు విజయాలను అందిస్తున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బీజేపీ ఈ యవిధంగానే పన్నా ప్రముఖ్‌లను ఏర్పాటు చేసి, దాదాపు కోటీ 20 లక్షల మంది మహిళలను కలుసుకుని వారికి మహిళా పథకాలు అందుతున్నాయో లేదో విచారించడం జరిగింది. వారిని పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేటట్టు కూడా చేసింది. అనేక నియోజక వర్గాల్లో మహిళల ఓట్లలో బీజేపీ వాటా కాంగ్రెస్‌ కంటే దాదాపు పది శాతం ఎక్కువగా ఉంది.
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలోనే కాకుండా, చత్తీస్‌ గఢ్‌లో కూడా బీజేపీ ఈ కార్యాచరణ పథకాన్ని చడీ చప్పుడూ లేకుండా అమలు జరిపింది. చత్తీస్‌గఢ్‌లో తాము ఓటమి పాలవుతామని కాంగ్రెస్‌ కలలో కూడా ఊహించ లేకపోయింది. ఈ కార్యాచరణ వ్యూహం కారణంగానే మోదీ గ్యారంటీల మీద ప్రజలకు నమ్మకం ఏర్పడింది. మోదీ మ్యాజిక్‌ ఆ విధంగా పనిచేసింది. మోదీ గ్యారంటీల మీదే దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ పార్టీకి బూత్‌ స్థాయిలో, అట్టడుగు స్థాయిలో బీజేపీ ప్రభంజనం పెరుగుతోందనే విషయం అర్థం కాలేదు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ కార్యాచరణ పథకం ఎంతగా ప్రజల్లోకి వెళ్లిందంటే, ప్రతి ఇంటికీ ప్రతి నెలా 1,500 రూపాయలు చెల్లిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ ‘గృహలక్ష్మి’వాగ్దానాన్ని ప్రజలు ఒకపట్టాన నమ్మలేకపోయారు. మోదీ పాలనతీరు బూత్‌ స్థాయి నుంచి ఓటర్లకు బాగా అర్థమైనందువల్ల, మోదీ ప్రకటించిన గ్యారంటీలు తప్పకుండా అమలు జరుగుతాయనే నమ్మకం కుదిరినందు వల్ల, కాంగ్రెస్‌ గ్యారంటీలు ఓటర్ల నమ్మకాన్ని చూరగొనలేకపోయాయి. మోదీ గ్యారంటీలు, అమిత్‌ షా వారంటీలు ఆ పార్టీకి ఘన విజయాలు తీసుకు వచ్చాయనడంలో సందేహం లేదు. ఇక ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు తగ్గట్టుగానే ఈ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంతో, మోదీ తాను చేసిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తారనే అభిప్రాయం కలిగింది.
ఏ విధంగా చూసినా కాంగ్రెస్‌ పార్టీలో కొత్త వ్యూహా లకు, కొత్త ఆలోచనలకు అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల యతీరు, ఎన్నికల నిర్వహణ తీరు, ఓటర్ల ఆకాంక్షలు, ఆశయాలు మారిపోతున్న పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఒకే వ్యూహానికి అంటి పెట్టుకుని ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఇక కర్ణాటక, తెలంగాణ వ్యూహాలను పక్కనపెట్టి, రాబోయే ఎన్నికలకు కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవడం మంచిది. లోక్‌ సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసన సభలకు కూడా ఎన్నికలు జరగబోతున్నందు వల్ల కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పటి నుంచి కొత్త ప్రచార యంత్రాంగాన్ని ఏర్పరచుకోవడం మంచిది. మతాల గురించి, హిందుత్వ గురించి, అదానీ గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. స్థానిక సమస్యలు, దేశ భవిష్యత్తు, దేశ భద్రత, విజన్‌ వగైరా అంశాలకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. బీజేపీ తదుపరి వ్యూహం మీద కూడా ఒక కన్ను వేసి ఉండడం శ్రేయస్కరం.

  • ఎస్‌. సంగమేశ్వర రావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News