Tuesday, May 21, 2024
Homeఓపన్ పేజ్Need of new Agriculture policies: ఉపయోగపడని వ్యవసాయ విధానాలు

Need of new Agriculture policies: ఉపయోగపడని వ్యవసాయ విధానాలు

కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు అన్ని చోట్లా తప్పనిసరి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రకటిస్తుండడం, నగదు బదిలీలు చేస్తుండడం వగైరాలు చూసి, వ్యవసాయ రంగం దారిలో పడ్డట్టే అని భావించిన వారు తీవ్ర నిరాశకులోనయ్యే పరిస్థితి ఇది. వీటి వల్ల వ్యవసాయ రంగమూ మెరుగుపడలేదు. రైతులూ బాగుపడలేదు. కేంద్ర ప్రభుత్వాల లెక్కలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ, తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి. విచిత్రమేమిటంటే, దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమన్నది అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందే తప్ప తగ్గుముఖం పట్టకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఈ విషయంలో ముందుండే మహారాష్ట్రలో ఈ ఏడాది మొదటి పది నెలల్లోనూ 2,366 ఆత్మహత్యలు నమోదయ్యాయి. అంటే ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు 8 మంది రైతులు ఆత్మ హత్య చేసుకోవడం జరుగుతోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో మహారాష్ట్రతో పోటీపడుతున్నట్టు కనిపిస్తోంది. కాగా, నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో నివేదిక ప్రకారం, 2022లో మొత్తం 11,299 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పైన పేర్కొన్న అయిదు రాష్ట్రాలలోనే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్నాయని కూడా ఈ బ్యూరో తెలియజేసింది.
ఆత్మహత్యల విషయంలో నిరుద్యోగులు, విద్యార్థుల తర్వాత రైతులు మూడవ స్థానంలో ఉన్నారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి, సంక్షేమాల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, వాళ్లెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నది పరిశీలిస్తే, రుణాల ఒత్తిడి, పంటల వైఫల్యాలన్నది ప్రధాన కారణాలని అర్థం అవుతోంది. ఆయేటికాయేడు రుణ భారం పెరగడం, ఆ భారాన్ని దించుకోలేక, దించుకునే అవకాశాలు లేక రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతోంది. ప్రతి ఏటా పేదలుగా, నిరు పేదలుగా మారుతున్న రైతుల సంఖ్య పెరిగిపోతోందే తప్ప తగ్గడం లేదు. విచిత్రంగా ఆకలి బాధలు కూడా పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతోంది. సాగుభూమి కూడా రాను రానూ తగ్గిపోతోంది. వీరి పరిస్థితి క్రమంగా దిగజారుతుండడానికి వర్షాభావం, పంటల వైఫల్యమే కారణాలనడంలో సందేహం లేదు. పంటలు వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకూ రైతులకు ఆందోళన, మానసిక ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. పలువురు రైతులను నిద్ర లేమి కూడా బాధిస్తుంటుందని వెల్లడైంది.
సరైన పద్ధతుల్లో, సరైన కాలంలో పంటలు వేయకపోవడం, రైతుల్లో ఉన్న మంద మనస్తత్వం వగైరా కారణాల వల్ల కూడా పంటలు విఫలం కావడం, పంటకు సరైన ధర లేకపోవడం వంటివి తలెత్తుతున్నాయి. ఒక్కోసారి ధరలు దారుణంగా పడిపోవడం వల్ల రైతులు నిరాశా నిస్పృహలకు లోనయి పంటను పారేసుకుంటున్న మసందర్భాలు కూడా ఉన్నాయి. ఏమాత్రం అనుకూలంగా లేని విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, అవినీతి అధికారులు, పంటల బీమా కొరత, సబ్సిడీలు లభించకపోవడం వంటివి రైతులను తీరని కష్టనష్టాలకు గురిచేస్తున్నాయి. రైతులను శాశ్వతంగా ఇటువంటి సమస్యలకు దూరం చేయడమన్నది దేశానికి సాధ్యం కావడం లేదు. వర్షాలపై ఆధారపడకుండా ఉండే పరిస్థితి, పంటలు విఫలం కాకుండా చేయడం వంటివి సాధ్యమైతే తప్ప వారి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదు. ఎకనామిక్‌ సర్వే ప్రకారం, దేశంలో 65 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. సుమారు 47 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు.
వ్యవసాయ సంబంధమైన ప్రాథమిక సదుపాయాలకు ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. శీతలీకరణ కేంద్రాలు భారీ సంఖ్యలో ఏర్పడడం అనేది అనివార్యంగా కనిపిస్తోంది. త్వరగా దెబ్బతినడానికి అవకాశం ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి, రైతులకు ఆధునిక నెట్వర్కులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించడం తప్పనిసరి. వారికి సంస్థాగత ఆర్థిక సహాయం అందించడంతో పాటు, పంటల బీమా కూడా పటిష్టంగా వర్తింపజేయాలి. నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంతో పాటు, పంటలు విఫలం కాకుండా చూడాల్సిన బాధ్యతను కూడా ప్రభుత్వాలే తలకెత్తుకోవాలి. కాయగూరలు, పండ్లకు కూడా గిట్టుబాటు ధరలను నిర్ణయించడం మంచిది. ఇటువంటి చర్యల వల్ల వ్యవసాయదారులు ప్రశాంతంగా పంట మీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలుగుతుంది. అనేకానేక వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేయడంలో స్వయం సమృద్ధి సాధించిన భారతదేశం వ్యవసాయ రంగం మీద మరింత శ్రద్ధ పెంచడం వల్ల ఎంతో ఉప యోగం ఉంటుంది. వ్యవసాయ రంగం ఇదే విధంగా అధ్వాన పరిస్థితుల్లో కునారిల్లే పక్షంలో భావి తరాలు లాభసాటి రంగాలకు మళ్లే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ రంగం విషయంలో తన వైఖరి మార్చుకోవడం మంచిది. పారిశ్రామిక రంగంతో సమానంగా వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యం పెంచడం వల్ల అంచనాలకు మించిన ప్రయోజనాలు ఉంటాయనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News