Saturday, May 18, 2024
Homeఓపన్ పేజ్Kejri Vs Modi: ముదురుతున్న ఢిల్లీ వివాదం

Kejri Vs Modi: ముదురుతున్న ఢిల్లీ వివాదం

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి తమ అధికారులపై అధికారం ఉంటుందంటూ గత మే 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఢిల్లీ దేశ రాజధాని కూడా అయినందువల్ల ఇక్కడి అధికారులపై కార్యనిర్వాహరపరంగా, శాసనపరంగా తమకే అధికారాలు ఉండాలని అది పేర్కొంటూ ఇందుకు సంబంధించి ఒక ఆర్డినెన్సును కూడా జారీచేసింది. ఈ చర్య ఒక కొత్త వివాదానికి తెర తీసింది. ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్సును సవాలు చేయాలని నిర్ణయించుకుంది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఈ తీర్పును పునఃస్సమీక్షించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 1991నాటి ది నేషనల్‌ క్యాపిటల్‌ టెర్రిటరీ ఆఫ్‌ ఢిల్లీ యాక్ట్‌ (ఎన్‌.సి.టి.డి) ఒక ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని సృష్టించింది. దీని మీద చాలా ఏళ్లుగా న్యాయపరమైన వాదోపవాదాలు రేగుతూనే ఉన్నాయి. అది కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య మొదటి నుంచి వివాదాస్పదమైన అంశంగానే కొనసాగుతూ వస్తోంది. ఇంతకూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వమే కనుక, అధికారులపై అధికారాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు వర్తిస్తున్న నిబంధనలే ఈ ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి. కాగా, ఢిల్లీకి సంబంధించినంత వరకు శాంతిభద్రతలు, భూమికి సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇతర రాష్ట్రాలలో ఈ నిబంధన మాత్రం వర్తించదు. ఉద్యోగులు, అధికారులపై ప్రజాప్రతినిధుల అధికారాలకు సంబంధించి ప్రత్యేకంగా చట్టం అంటూ ఏమీ లేదని కూడా అది స్పష్టం చేసింది. నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీసెస్‌ అథారిటీని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టేసినట్టయింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఇందులో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ ఇద్దరు సభ్యులను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తాను కోల్పోయిన అధికారాలను ఈ అథారిటీ ద్వారా అది తిరిగి పొందినట్టయింది. సుప్రీంకోర్టు తీర్పును సైతం చట్టసభ ద్వారా తిరస్కరించడానికి కేంద్రానికి అధికారం ఉంది. అయితే, తీర్పును తిరస్కరిస్తూ ఒక ఆర్డినెన్స్‌ను జారీచేయాల్సిన అగత్యాన్ని మాత్రం ప్రశ్నించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వ చర్య వెనుక రాజకీయ ఉద్దేశాలేమైనా ఉన్నాయా అన్న అనుమానం కలగక మానదు. పాలనకు సంబంధించిన అంశాలకు సంబంధించినంత వరకూ వివిధ రాష్ట్రాలతో కేంద్రం మొదటి నుంచి ఘర్షణ వాదాన్నే అనుసరిస్తూ వస్తోంది. కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ పరస్పరం సహకరించుకోవడం అన్నదే జరగడం లేదు. అయితే, ఢిల్లీ దేశ రాజధాని అయినందువల్ల, భద్రతా చర్యల దృష్ట్యా సున్నిత పరిస్థితి ఏర్పడి ఉన్నందువల్ల కేంద్రం ఒక్క ఈ రాష్ట్రం విషయంలో మాత్రం తనకు ఎక్కువ అధికారాలు ఉండాలని, ముఖ్యంగా అధికారుల మీద కొంతవరకూ అధికారం ఉండాలని భావిస్తోందని కేంద్ర అధికారులు భావించడం జరుగుతోంది. నిజానికి, ఇందులో రాజకీయాలకు అవకాశంలేదు. ఇది ఢిల్లీ ప్రజలకే కాక, యావద్దేశ ప్రజలకు అర్థమయ్యే విషయమే.
ఢిల్లీ అధికారులకు కూడా ఇది అర్థం కాకపోలేదు. దేశకాల పరిస్థితులతో పాటు, పాలనాపరమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెనుకటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా ఢిల్లీ పాలనకు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకున్న విషయం, అనేక ఆంక్షలు విధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఫెడరల్‌ వ్యవస్థలో సైతం కేంద్రం తన బాధ్యతలను విస్మరించడం అంత తేలికైన విషయం కాదు. ఇతర రాష్ట్రాల ప్రజలు ఢిల్లీ వచ్చి ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాలను పొందడాన్ని ఢిల్లీ ప్రభుత్వాలు ప్రశ్నించడం కూడా ప్రారంభించాయన్నది జగద్వితమే. దేశ రాజధానిని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడమన్నది సమంజసమా కాదా అన్నది తేల్చాల్సింది న్యాయస్థానాలు, పార్లమెంటేననడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News