Saturday, May 4, 2024
Homeఓపన్ పేజ్Naxalites: 100 రోజుల్లో 87 మంది మావోల హతం

Naxalites: 100 రోజుల్లో 87 మంది మావోల హతం

ప్రణాళిక విజయవంతం: అమిత్ షా

చత్తీస్‌ గఢ్‌ అడవుల్లో కొందరు సీనియర్‌ కమాండర్లతో సహా 29 మంది మావోయిస్టులను భద్రతా దళాలు హతమార్చడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే. గూఢచారి వర్గాల వారు అందించిన నిర్దిష్ట సమాచారంతో జిల్లా అటవీ పోలీసులతో కలిసి సరిహద్దు భద్రతా దళాలు ఈ మావోయిస్టులను ఇటీవల ఒక ‘ఎన్‌ కౌంటర్‌’లో అంతమొందించడం జరిగింది. ఈ మావోయిస్టుల దగ్గర నుంచి ఆధునిక ఆయుధాలతో సహా భారీ మొత్తంలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిని ఒక ఎన్‌ కౌంటర్‌ గా భద్రతా దళాలు అభివర్ణించాయి కానీ, ఇది నిజంగానే ఎన్‌ కౌంటరేనా అన్న విషయంలో అనుమానాలున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడాన్ని బట్టి, భద్రతా దళాల దాడి విషయం వారికి ఏమాత్రం తెలియదనే విషయం అర్థమవుతోంది. భద్రతా దళ సిబ్బందికి మాత్రం కొద్దిపాటి నష్టం, స్వల్ప గాయాలు తప్ప మరేమీ జరగలేదు. మొత్తం మీద ఈ దాడి విజయవంతంగానే పూర్తయినట్టు కనిపిస్తోంది. మావోయిస్టులంతా ఒక చోట మాటా పలుకూ లేకుండా కూర్చుని భద్రతా దళాల దాడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా వ్యవహారమంతా పూర్తయింది.
మావోయిస్టులను అంతమొందించడానికి తాము సిద్ధం చేసుకున్న ప్రణాళిక విజయవంతం అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. గత వంద రోజుల కాలంలో 87 మంది మావోయిస్టులను హత మార్చినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో మావోయిజాన్ని దేశంలో పూర్తిగా నిర్మూలించబోతున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. కొద్దిరోజుల్లో లోక్‌ సభ ఎన్నికలు జరగబోతున్నాయనగా, ఈ ఎన్‌ కౌంటర్‌ చోటు చేసు కోవడం వల్ల కేంద్రంలోని బీజేపీకి రాజకీయంగా కూడా లబ్ధి చేకూరే అవకాశముంది. మావోయిస్టు కార్యకలాపాల కారణంగా ఈ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న సామాన్య ప్రజానీకానికి ఇది నిజంగా గొప్ప ఉపశమనంగానూ, ఊరటగానూ భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ చర్యల వల్ల, భద్రతా దళాల నిఘా వల్ల ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయినట్టు కూడా అమిత్‌ షా తెలిపారు. దీన్ని అర్ధ సత్యంగానే పరిగణించాల్సి ఉంటుంది.
చత్తీస్‌ గఢ్‌లోనే కాదు, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌, జార్ఖండ్ ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు యథావిధిగా సాగిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో వీరి మాటే శాసనంగా చెలామణీ అవుతోంది. ప్రభుత్వ ఆదేశాలు, చట్టాలు అమలు కాని ప్రాంతాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. వీలైనప్పుడు భద్రతా దళాల మీద దాడులు చేయడం, దోచుకోవడం వంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఆదివాసీలు ఎక్కువగా ఉండే, మధ్య, తూర్పు భారతదేశంలో మావోయిస్టులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నారు. దేశంలో రాజకీయ నాయకులు, సంపన్నులు, ఇతర వర్గాల నిరంతర దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను తగిన సహాయంతో, మద్దతుతో తమ వైపు తిప్పుకోవడానికి మావోయిస్టులు కృషి చేస్తున్నారు. అయితే, ఆదివాసీల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా, వారికి సరైన పాలనను చేరువ చేయడం ద్వారా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నందు వల్ల ఆదివాసీలు మావోయిస్టుల కబంధ హస్తాల నుంచి క్రమంగా బయటపడడం కూడా జరుగుతోంది. మావోయిజం ప్రబలడానికి దారి తీస్తున్న కారణాలను తొలగించడం ద్వారా మాత్రమే మావోయిజాన్ని అంతం చేయగలమని దీనిని బట్టి అర్థమవుతోంది.
మావోయిస్టులు కూడా తమను తాము కాపాడుకోవడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వికేంద్రీకరణ పద్ధతుల ద్వారా వారు చిన్న చిన్న బృందాలుగా విడిపోయి, దేశమంతా విస్తరించి తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనివల్ల, వారిని పూర్తిగా అంతం చేయడమనేది ప్రభుత్వాలకు కష్టమవుతోంది. మావోయిస్టులను అంతం చేయడానికి, తుడిచిపెట్టడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు, ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి మరింతగా కృషి చేయడం ద్వారా మావోయిజానికి సమాధి కట్టగలమని అర్థం చేసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News