Monday, May 20, 2024
Homeఓపన్ పేజ్ఇ-వ్యర్థాలను ఒదిలించుకోవడం ఎలా?

ఇ-వ్యర్థాలను ఒదిలించుకోవడం ఎలా?

ఎలక్ట్రానికి వృథాపై ప్రజలకు కనీస అవగాహన లేదు

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్చి 8, 2024న ఈ-వేస్ట్ (నిర్వహణ) సవరణ నియమాలు, 2024ను జారీ చేసింది. 20 మార్చ్ 2024న ఐక్యరాజ్యసమితి గ్లోబల్ ఇ-వేస్ట్ మానిటర్ 2024 నివేదికను విడుదల చేసింది.

- Advertisement -

ఇ – వేస్ట్ అంటే…..
ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో ప్రతీ పనీ చేయడానికి ఎలక్ట్రానిక్స్ పరికరాలనే ఉపయోగిస్తున్నాము.
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ టివిలు, రిమోట్లు, స్మార్ట్ వాచీలు, చార్జర్లు, ఎలక్ట్రానిక్స్ బొమ్మలు, అనేక వినోదపరికరాలు మొదలైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు మానవ జీవన విధానాన్ని సుఖమయం చేశాయి. కానీ ఈ పరికరాల జీవితకాలం పూర్తైన తరువాత వీటిని బయట పడేయవలసిందే..! కాలం పూర్తైన, మధ్యలో చెడిపోయిన, విరిగిపోయిన, పాడైపోయిన, పనిచేయకుండా ఉన్న ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ పరికరాలు లేదా ఉపకరణాలను ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు అంటారు. వీటినే ఇ – వ్యర్థాలు అని పిలుస్తారు. ఇది రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సమాచార సాంకేతికత కమ్యూనికేషన్ పరికరాలు. ఇంకొకటి కన్స్యూమర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు.
ఈ వ్యర్ధాలలో మనకు హాని కలిగించని రాగి, బంగారము , వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి లోహాలు, హాని కలిగించే సీసం, పాదరసం, కాడ్మియం, సెలీనియం, క్రోమియం వంటి అత్యంత విషపూరిత మూలకాలు ఉంటాయి. ఇ – వ్యర్థాలు సరైన యాజమాన్య నిర్వహణా పద్దతిలో రీసైక్లింగ్ లేదా బయట పారవేయక పోతే మనకు, పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయి. గ్లోబల్ ఇ-వేస్ట్ మానిటర్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2022 సంవత్సరంలో 6200 కోట్ల కిలోల ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు ( ఈ – వేస్ట్ ) ఉత్పత్తి చేయబడ్డాయి. 2010 కంటే 82 శాతం పెరిగింది. ఇదే రీతిలో కొనసాగితే 2030 నాటికి 8200 కోట్ల కిలోలకు చేరుకుంటుందని హెచ్చరించింది. ఇందులో 22.3 శాతం సుమారు 1300 కోట్ల కిలోలు మాత్రమే పర్యావరణ అనుకూలమైన పద్ధతులలో సేకరించి రీ సైకిల్ చేశారు. 2022లో ఉత్పత్తి చేయబడిన ఈ-వ్యర్థాలలో 3100 కోట్ల కిలోల లోహాలు, 1700 కోట్ల కిలోల ప్లాస్టిక్స్,1400 కోట్ల కిలోల ఇతర పదార్థాలు (ఖనిజాలు, గాజు, మిశ్రమ పదార్థాలు మొదలైనవి) ఉన్నాయి. 2022లో యూరప్ (17.6 కిలోలు), ఓషియానియా (16.1 కిలోలు) మరియు అమెరికా (14.1 కిలోలు) తలసరి ఇ-వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేశాయి. సాంకేతిక పురోగతి, ఎక్కువ మందికి ఉపకరణాలు అందుబాటులోకి రావడం , పరిమిత మరమ్మత్తు ఎంపికలు, స్వల్ప కాలం పనిచేసే పరికరాలు, పెరుగుతున్న ఎలక్ట్రానిఫికేషన్, తగిన పద్దతులు పాటించకుండా ఇ-వ్యర్థాల నిర్వహణ ఇ-వ్యర్థాల ఉత్పత్తి పెరుగుదలకు కారణమవుతున్నాయి.

మన దేశంలో రీసైక్లింగ్ కేంద్రాలు:
గృహ, వాణిజ్య యూనిట్ల నుండి వ్యర్థాలను వేరు చేయడం, ప్రాసెస్ చేయడం, పారవేయడం కోసం మన దేశంలో మొట్టమొదటి ఇ-వేస్ట్ క్లినిక్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏర్పాటు చేయబడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వారి సమాచారం మేరకు 8 జూన్ 2023 నాటికి మన దేశంలో తగిన ప్రమాణాలతో రీసైక్లింగ్ చేసే కేంద్రాలు మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ (10 ), తెలంగాణా( 23 ) కలిపి 569 ఉన్నాయి. ఇవి అధికారికంగా 1790348.27 మెట్రిక్ టన్నుల వార్షిక రీసైక్లింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ క్రమ క్రమంగా పెరుగుతుంది. ఇవి రీసైక్లింగ్ చేయడానికి శాస్త్రీయ మరియు పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబిస్తాయి. వీటి వలన పల్లపు ప్రదేశాల్లో వ్యర్థాల పరిమాణాన్ని, పర్యావరణంలోకి విడుదలయ్యే హానికరమైన రసాయనాలను, నేల, నీటి కలుషితాన్ని తగ్గిస్తాయి. 2016-17 నుండి 2021-22 వరకు ఇ వేస్ట్ రీసైక్లింగ్ 22 రెట్లు పెరిగింది. మన దేశంలో 2016-17 లో 23330.3 టన్నుల నుండి 2021-22 నాటికి 5,27,131.57 టన్నుల ఇ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం జరిగింది.

మన దేశంలో చట్టాలు:
ఇ-వ్యర్థాలను నిర్వహించడానికి చట్టాలు 2011 నుండి భారతదేశంలో అమలులో ఉన్నాయి, అధీకృత డిస్‌మాంటర్లు మరియు రీసైక్లర్లు మాత్రమే ఇ-వ్యర్థాలను సేకరించాలని నిర్దేశించారు. ఈ-వేస్ట్ (నిర్వహణ) రూల్స్ 2016-17లో రూపొందించబడింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్చి 8, 2024న ఈ-వేస్ట్ (నిర్వహణ) సవరణ నియమాలు, 2024ను జారీ చేసింది.

అనధికారిక రీసైక్లింగ్ రంగం:
మన దేశంలో దాదాపు లక్ష మందికి పైగా అసంఘటిత రంగంలో యెటువంటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా రీసైక్లింగ్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. వీరికి సంభవించబోయే అనారోగ్య ప్రమాదాలు గురించి అవగాహనా లేదు. వీరి వలన వారితో పాటుగా మిగిలిన వారికి, పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఇ-వ్యర్థాల అక్రమ నిర్వహణ, అనధికారిక రీసైక్లింగ్ పద్ధతులతో సహా, పాదరసం మరియు బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్‌లను కలిగి ఉన్న ప్లాస్టిక్‌లు వంటి ప్రమాదకర పదార్థాలను పర్యావరణంలోకి విడుదల చేయడానికి దారితీస్తుంది .ఇది పర్యావరణం మరియు ప్రజారోగ్యం రెండింటిపై ప్రత్యక్ష మరియు తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది.

ఇ- వ్యర్థాల ప్రభావం:
ఇ-వ్యర్థాలు హైడ్రోకార్బన్ రసాయనాలను కలిగి ఉంటాయి, ఇందులో బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్లు ఉంటాయి. పర్యావరణ ప్రమాదాలను పెంచుతాయి. మానవులకు విషపూరితమైనవి. వాతావరణంలోకి విడుదలైనప్పుడు అవి గ్లోబల్ వార్మింగ్‌కు కూడా దోహదం చేస్తాయి. ఎలక్ట్రానిక్స్‌ భాగాలలో విషపూరిత భారీ లోహాలు, రసాయనాలు కూడా ఉంటాయి. వీటిని సరిగ్గా పారవేయకపోతే ఇ-వేస్ట్ సమస్యలను కలిగిస్తాయి. ఇవి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని నిరూపించబడ్డాయి. సీసం పిల్లలలో మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చిన్నారుల ఎదుగుదలను అడ్డుకుటుంది. బేరియం మెదడు వ్యాపు వ్యాధికి దారితీస్తుంది. కణజాలాన్ని నాశనం చేస్తుంది. గుండె, కాలేయాన్ని దెబ్బతీస్తుంది. మెర్క్యురీ జ్ఞాపకశక్తిని, సంతానోత్పత్తిని తగ్గిస్తుంది.
కండరాల బలహీనతో పాటుగా మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాడ్మియంను పీల్చితే తీవ్రమైన ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయి. సల్ఫర్ కాలేయం, గుండె, మూత్రపిండాలు, కళ్లను దెబ్బతీస్తుంది. క్రోమియం క్యాన్సర్‌ను కలిగిస్తుంది. హెక్సావాలెంట్‌ క్రోమియం డి.ఎన్‌.ఎ వ్యవస్థను నాశనం చేస్తుంది. బెరీలియం క్యాన్సర్‌ వ్యాధికి దారితీస్తుందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది.

పరిష్కారాలు :
రెడ్యూస్ (తగ్గించడం), రియాజ్ ( పునర్వినియోగం ), రిపేర్ (మరమ్మత్తు) ప్రక్రియలను పాటించాలి. పరికరాలను ఉత్పత్తి చేసే దశలోనే హానికరమైన భాగాలను తగ్గించడం, పరికరాల జీవితకాలం ఎక్కువగా ఉండేటట్లు చేయాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేయడం వల్ల అవి ఈ-వేస్ట్‌గా మారకుండా ఉంటాయి. బయట పారవేయకుండా అధికారికంగా సేకరించే వారికి మాత్రమే విక్రయించాలి. నగరాలలో ప్రత్యేకంగా వీటిని సేకరించే ఏర్పాట్లు చేయాలి.అధికారికంగా పర్యావరణపరంగా మంచి విధానాలను ఉపయోగించి ఇ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం చివరి ప్రయత్నంగా ఉండాలి.

జనక మోహన రావు దుంగ
శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్
8247045230

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News