మహిళలు, అమ్మాయిలు తమకు అయినవారు లేదా సన్నిహితుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్న దారుణం గతంలో కనీవినీ ఎరుగునంత పెద్ద ఎత్తున ఇటీవల ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ఓవైపు పరువు హత్యలు మరోవైపు ఏదో ఒక బలమైన లేదా కొన్ని సార్లు చాలా చిన్న కారణాలతో కూడా ఆడబిడ్డలు నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి కూడా తాజాగా వెల్లడించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. మరో దారుణం ఏమిటంటే ఇలా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒకటి కావటం విడ్డూరం. పది నిమిషాలు అలా దాటిందో లేదో.. ఓ నిండు ఆడబిడ్డ ప్రాణం గాల్లో కలిసిపోతోంది. కాలి కింద భూమి కదిలిపోయినట్టు లేదూ?
ఈనెల 25న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ ఎగెనెస్ట్ వుమెన్ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్ ఇచ్చిన సందేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు అతి పెద్ద హెచ్చరికగా మారాయి. అవును..ఈ దిశగా మనమంతా ఎందుకు లోతుగా ఆలోచించట్లేదు అనేది వల్డ్ వైడ్ చర్చనీయాంశంగా మారింది. ఆంటోనియో చెప్పిన ఈ విషయంపై మనందరికీ అవగాహన ఉంది. సాధారణంగా తెలిసివారే అమ్మాయిలపై, మగువలపై దారుణాలకు ఒడిగడుతుంటారు. తాము ఎవరి వద్ద సురక్షితంగా ఉంటామని స్త్రీలు భావిస్తారో వారి చేతుల్లోనే మోసాలకు బలైపోతుంటారు.
తరాలుగా జరుగుతున్న తంతే అయినా దీన్ని అరికట్టలేకపోతున్నాం మనమంతా. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ నయానో, భయానో అమ్మాయిలు, మహిళలు ఈ విషయాలు ఇతరులకు చెప్పరు. ఒకవేళ చెప్పినా వాటిని పోలీస్ స్టేషన్, కంప్లైట్, కోర్టు కేసుల వరకు రానీకుండా కుటుంబీకులే బాధితుల నోరు మూపించేస్తారు. దీనికి కారణం అయినవారితో జగడాలు పెట్టుకోలేక, కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ఇలా రాజీపడి బతికేస్తుంటారు.
కేవలం కుటుంబ సభ్యులు లేదా బాగా ఎరిగినవారి చేతిలో ఇలా బలయ్యే అమాయక స్త్రీలు, అమ్మాయిల సంఖ్య ప్రతి 11 నిమిషాలకు కనీసం ఒకరంటే ఆడవారి ప్రాణాలు ఎంత చవకైపోయాయో కదా అనిపించక మానదు. మరి మానవహక్కుల ఉల్లంఘన ఇంత ఘోరంగా జరుగుతుంటే మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నట్టు? మన ఆడబిడ్డల మాన, ప్రాణాలకు విలువే లేదా?
ప్రతి దేశంలో ఆడబిడ్డల రక్షణకు అన్ని దేశాల ప్రభుత్వాల యుద్ధ ప్రాతిపదికన నేషనల్ యాక్షన్ ప్లాన్ రూపొందించి, అమలు చేయాలంటూ యూఎన్ చీఫ్ ఆంటోనియో పిలుపునిచ్చారు. వుమెన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కు కనీసం 50 శాతం నిధులు కేటాయించి, మహిళా హక్కులను పునరుద్ధరించేలా అన్ని దేశాల ప్రభుత్వాలు కృషి చేయాలంటారు యూఎన్ చీఫ్. 2026కల్లా ప్రపంచంలో మహిళలకు భద్రత ఉండేలా సరికొత్త, సురక్షితమైన భవిష్యత్తును మనమంతా కలిసి నిర్మించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు ప్రపంచంలోని ఏ ఒక్క దేశమైనా తీసుకుంటుందా?. అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు మొదలు, వెనుకబడ్డ దేశాల వరకూ అన్ని చోట్లా మహిళలపై అఘాయిత్యాలే కామన్ న్యూస్. ఆడవారి ప్రాణాలకు అండంగా అందరూ నిలబడితే మనందరి జీవితాలు అందంగా, అర్థవంతంగా తయారవుతాయని ఆయన అభిప్రాయపడటాన్ని కూడా వ్యతిరేకించేవారు లెక్కలేనంతమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. మనమంతా చేయి చేయి కలిపి సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టిద్దాం, ఇందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామనే మాటలు కొన్ని దేశాలైనా పట్టించుకుంటే మహిళల బతుకుల్లో మార్పు తప్పకుండా వచ్చే ఆస్కారం ఉంటుంది.
ప్రతి ముగ్గురు ఆడవారిలో కనీసం ఒక్కరైనా ఏదో ఒకరకమైన శారీరక లేదా మానసికమైన క్షోభను అనుభవించిన బాధితులే ఈ ప్రపంచంలో ఉన్నారంటూ వల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. అంటే అక్షరాలా 30శాతం ప్రపంచ మహిళలకు కనీస రక్షణ, హక్కులు లేనేలేవన్నమాట.
కోవిడ్-19 మహమ్మారి, ఆర్థిక సంక్షోభం వంటి సమయాల్లో మరింత ఎక్కువ మంది మహిళలు ఇలాంటి అరాచకాలకు బలి అవుతున్నారని ఆయన చేసిన హెచ్చరికలో చాలా లోతైన విషయాలు దాగున్నాయి. ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా, బయట వృత్తిపరంగా ఏ చిక్కులు వచ్చినా వాటన్నింటినీ ఇంట్లోని ఆడపిల్లలు, మహిళలపైనే చూపటం రొటీన్ విషయమే. సాఫ్ట్ టార్గెట్స్ గా మారిన మగువలను చిత్రహింసలు పెట్టడం చివరికి అంతమొందిచంటం అన్ని సమాజాల్లోనూ ఎప్పటినుంచో సాగుతున్న చెడ్డ సంప్రదాయంగా మారింది. మత కల్లోల్లాలు జరిగినప్పుడు కూడా చిన్నారులు, ఆడవారిపై లైంగికంగా దాడి చేయటం వంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం. మానవ సమాజం ఇంత ఆధునికతవైపు మరలుతున్నా, అత్యాధునిక జీవన శైలిలో బతుకుతున్నా మహిళలకు భద్రత మాత్రం కరువయ్యింది.
చదువు, ఉద్యోగం, పనిచేసే చోట ..ఇలా అన్నిచోట్లా వివక్షలకు అడుగడుగునా బలవుతున్నారు అతివలు. ప్రతి విషయంలో వంచనకు గురవుతున్న మహిళా వర్గాన్ని ఏ మానవ హక్కులూ కాపాడలేకపోతున్నాయి. ఇక ఆన్ లైన్ లో మహిళలపై జరుగుతున్న మాటల దాడి, వయలెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత సంస్కారంగా ఉంటుందేమో అన్నట్టు పరిస్థితి తయారైంది. మహిళల కనీస హక్కులను కూడా హరించేలా ఆధునిక సమాజం, ప్రపంచం తయారయింది.
మనదేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ దారుణ హత్యం నేపథ్యంలో ఇలా ఎంతోమంది మహిళలు నిత్యం తాము నమ్మినవారి చేతుల్లో, తాము ప్రేమించినవారి కబంద హస్తాల్లోనే ప్రాణాలు విడుస్తుండటం విశేషం. కసాయి భర్త, శాడిస్టు బాయ్ ఫ్రెండ్, కపట బంధువులు ..ఇలా ఎంతోమంది రాబందులు మహిళలపై కన్నేసి, వారిని మట్టుబెడుతున్నారు.
ఇలా ఓ మహిళ లేదా అమ్మాయి తమ సన్నిహితుల చేతుల్లోనే మరణించటం అనేది ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ ఈమధ్య కాలంలో ఇలాంటి దారుణాలు చాలా ఎక్కువ అయ్యాయి. ఓవైపు సోషల్ మీడియా మరోవైపు టిండర్ వంటి డేటింగ్ యాప్స్ కు బలయ్యేవారి సంఖ్య మరీ ఎక్కువ. అనవసర టైం పాస్ వ్యవహారాలు, ఉపయోగం లేకపోయినా కొత్త కొత్త పరిచయాలు వీరికి కొత్త జీవితాన్ని రుచి చూపిస్తూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. అత్యాచారాలు, హత్యాయత్నాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. కొత్త తరంవారితో పోటీ పడుతూ మధ్యవయసు వారు కూడా పలు కొత్త సంబంధాలకు ఈమధ్య అలవాటు పడిపోతున్నారు. ఇవన్నీ కొత్త టెన్షన్స్, అనుమానాలకు దారి తీసి, బంధాలు బలహీనమవుతున్నాయికూడా. కొందరి విషయంలో ఇదంతా శతృత్వానికి దారితీసి, హత్యలకు ఉసిగొల్పుతోంది.
తమ మేల్ పార్ట్నర్ అరాచకాలకు బలై, ప్రాణాలు పోగొట్టుకుంటున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా 38శాతం అంటే నమ్మశక్యం కాకపోయినా నగ్న సత్యం. తమ జీవిత భాగస్వామి (లివ్ ఇన్ కూడా కావచ్చు) తమను కడతేరిస్తే ఇక వీరు తమ గోడును ఎవరితో చెప్పుకోగలరు? ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ కు ఏటా 200 మిలియన్ మంది అమ్మాయిలు, మహిళలు ప్రపంచవ్యాప్తంగా బలవుతున్నారు. ఇది మరీ దారుణమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 15 మిలియన్ అమ్మాయిలు కనీసం 18 ఏళ్లు కూడా దాటకుండానే బలవంతంగా పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తోంది. అంటే ఇలా మైనర్ అమ్మాయిల పెళ్లిళ్లు నిమిషానికి కనీసం 28 జరుగుతున్నాయి. చైల్డ్ సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్ కు ఏటా 10 మిలియన్ మంది చిన్నారి అమ్మాయిలు బలవుతున్నారు. ఫ్యామిలీ సర్కిల్ కు చెందిన వాళ్ల చేతుల్లో ఏటా ప్రపంచవ్యాప్తంగా అత్యాచారాలకు బలవుతున్న ఆడవారి సంఖ్య 150 మిలియన్. ఈ గణాంకాలన్నీ అధికారికమైనవే. ఇలాంటి గణాంకాలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచంలోని ఏ ఒక్క దేశం, రాష్ట్రం, జిల్లా, పట్టణం, గ్రామం, గడప, కుటుంబం కూడా మహిళలకు-అమ్మాయిలకు సురక్షితమైన జీవితాన్ని, భవిష్యత్తుపై భరోసాను ఇవ్వలేకపోతోంది.
అప్పుడే పుట్టిన పసిగుడ్డు మొదలు, పెళ్లైన అమ్మాయికి గృహ హింస వరకూ.. అమ్మాయిలంతా ఏదో ఒక దశలో వివక్షలకు బలికాకుండా, స్త్రీ-పురుషులిద్దరూ సమానమే అన్న రోజులు వస్తాయా? వస్తే ఎప్పుడు వస్తాయి? అన్న ప్రశ్నకు సమాధానం కనుచూపు మేరలో కనిపించే అవకాశాలే లేని రోజుల్లో ఆడబిడ్డలు దినగండం నూరేళ్ల ఆయుష్షులా బతుకీడుస్తున్నారు.