Saturday, May 18, 2024
Homeఓపన్ పేజ్Gujarat Elections: అందరి దృష్టీ ఆదివాసీలపైనే, ట్రైబల్ ఓటర్స్ మెప్పుకోసం పార్టీల ఆరాటం

Gujarat Elections: అందరి దృష్టీ ఆదివాసీలపైనే, ట్రైబల్ ఓటర్స్ మెప్పుకోసం పార్టీల ఆరాటం

ఎన్నికలు ప్రకటించడానికి ఇంకా చాలా నెలలకు ముందు నుంచే పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు రాష్ట్రంలోని ఆదివాసీల ఓట్ల కోసం పడరాని పాట్లు పడటం ప్రారంభించాయి. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ లో జరగబోయే శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు గానూ పార్టీలన్నీ చాలా ముందు నుంచే సమాయత్తమవుతున్నాయి. కాగా, బీజేపీ ఎన్నికల వ్యూహంలో ఈసారి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆదివాసీలు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఒక ఆదీవాసీ వ్యక్తిని అత్యున్నత స్థానంలో నియమించి చాలా సంవత్సరాలే అయినప్పటికీ, ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయటం ద్వారా బీజేపీ ఆ కొరతను తీర్చడంతోపాటు ఆదివాసీల ఓట్లను కూడా ఆకట్టుకోవాలని దూరదృష్టితో ఆలోచించింది. నిజానికి సంప్రదాయ ఆదీవాసీ ఓటర్లు మొదటి నుంచి బీజేపీకి ప్రతికూలంగానే ఉన్నారనే సంగతి కాదనలేనిది.

- Advertisement -

రాష్ట్ర జనాభాలో సుమారు 15శాతం వరకు ఉండి, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఆదివాసీలను ఆకట్టుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు చేయని ప్రయత్నమంటూ లేదు. వాస్తవానికి గుజరాత్ లోని ప్రధాన ఆదివాసీ ప్రాంతాలపై కాంగ్రెస్ పార్టీకి మొదటినుంచీ గట్టి పట్టుంది. ఇప్పుడు ఆ పట్టును సడలించాలని, తమ పట్టును పెంచుకోవాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో రాష్ట్ర శాసనసభకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఆదివాసీ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తూనే ఉంది. అంతేకాదు, 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆదివాసీలకు సంబంధించినంత వరకూ బీజేపీ ఓట్ల శాతం 52కు పెరగగా, కాంగ్రెస్ ఓట్ల శాతం 38కి తగ్గిపోయింది.

ఇక గుజరాత్ రాష్ట్రం బీజేపీకి కంచుకోటలా ఉంటోంది. అయితే, ఈసారి గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అడుగుపెట్టడం, పైగా ఆదివాసీలపై దృష్టి కేంద్రీకరించడం బీజేపీని కొద్దిగా కలవరపరుస్తోంది. ఆగస్టు నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆప్, రాష్ట్రంలో ఆదివాసీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని, రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూల్ ను, ఆదివాసీల పంచాయతీ ఎన్నికల చట్టం (పీసా)లను సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, తాము అధికారంలోకి వచ్చే పక్షంలో పంచాయతీలకు వెంటనే ఎన్నికలు జరిపిస్తామని ఆప్ ప్రచారం చేస్తోంది. షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలలో అక్కడివారు స్వయం పాలన చేసుకోవడానికి 1996లో పీసా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఒక్క ఆప్ మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా ఆదివాసీల పంచాయతీల్లో ఎన్నికలు జరిపిస్తామని వాగ్ధానం చేస్తోంది. ఛత్తీస్ గఢ్ లో తాము ఏవిధంగా ఆదివాసీలకు ఎన్నికలు జరిపించిందీ వివరిస్తోంది.

పాలక పక్షంలో ధీమా

కాగా, ఎవరెన్ని వాగ్దానాలు చేసినా ఆదివాసీల ఓట్లు ఈసారి బీజేపీకే గంపగుత్తగా పడటం ఖాయమని బీజేపీలోని భారతీయ ఆదివాసీ విభాగం అధిపతి ఛోటూభాయ్ వసావా కుండబద్ధలు కొడుతున్నారు. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ రంగ ప్రవేశం వల్ల లబ్ధి పడేది బీజేపీయేనని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల నాయకులు ఎప్పుడు గుజరాత్ వచ్చినా ఆదివాసీల ప్రాంతాల్లో ప్రచారం చేయకుండా ఢిల్లీ వెళ్లడం లేదు. దేశంలోని ఆదివాసీల జనాభాకు సంబంధించినంత వరకూ గుజరాత్ అయిదవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏడవ వంతు జనాభా ఆదివాసీలేనని తాజా గణాంక వివరాలు కూడా తెలియజేస్తున్నాయి. ఆదివాసీలు ఎక్కువగా తూర్పు జిల్లాలలోని గ్రామాలలో ఉంటున్నారు. ఇక రాష్ట్రంలో 27 అన్ రిజర్వ్డ్ షెడ్యూల్డ్ తెగల సీట్లున్నాయి.

రాష్ట్రంలో బీజేపీ దాదాపు 1995 నుంచి అధికారంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే బీజేపీ అధికారం తిరుగులేనిది. కానీ, ఆదివాసీ ప్రాంతాలలో మాత్రం బీజేపీ పనితీరు పేలవంగానే ఉంటూ వస్తోందనే అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉంది. ఈ సంగతి బీజేపీకి కూడా అర్థమైంది. ప్రధాని నరేంద్ర మోడీ గత ఏప్రిల్ లో కొన్ని ఆదివాసీ ప్రాంతాలలో పర్యటించడమే కాకుండా, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న దహోద్ జిల్లాలో జరిగిన ఒక పెద్ద ఆదివాసీ ఉత్సవంలో కూడా పాల్గొన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆదివాసీల సంక్షేమానికి, అభివృద్ధికి చేసిన కృషిని ఆయన సాకల్యంగా వివరించారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా కొన్ని ఆదివాసీ ప్రాంతాలలో కాంగ్రెస్ కు ఇప్పటికీ గట్టి పట్టున్న విషయం విస్మరించరానిది. సీట్ల పంపకం విషయంలో బీజేపీ ఇప్పటికీ కాంగ్రెస్ కంటే వెనుకబడే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆప్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ, బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం ఒకదానికి మించి మరొకటి ఇక్కడ తీవ్రంగా పోటీపడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News