Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Floods and rains: ఉత్తరాదిలో అతివృష్టి దక్షిణాదిలో అనావృష్టి

Floods and rains: ఉత్తరాదిలో అతివృష్టి దక్షిణాదిలో అనావృష్టి

అల్లాడుతున్న జనం

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టీ పూర్తిగా అక్కడే కేంద్రీకృతమై ఉంది. దక్షిణ భారతదేశంలో వర్షాభావ పరిస్థితి గురించి ఎవరికీ పట్టనట్టు కనిపిస్తోంది. జూలైలో కొద్దిపాటి వర్షాలను చూసిన తర్వాత ఆగస్టులో వర్షపు చుక్క కనిపించక పోవడం, సుమారు 40 శాతం వర్షపు లోటు ఏర్పడడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. వాస్తవానికి ఆగస్టు నెలలో దక్షిణాదిలో సర్వత్రా వర్షాలు పడుతుండడం ఆనవాయితీ. ఆగస్టులో వర్షాభావం ఇంత తీవ్రస్థాయిలో ఉండడం అన్నది 1913 తర్వాత ఇదే మొదటిసారి అని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏది ఏమైనా, గత ఎనిమిదేళ్ల కాలంలో ఇంత దారుణమైన వర్షాభావ స్థితిని దక్షిణ భారతదేశం ఎదుర్కోలేదనే చెప్పాలి. మహారాష్ట్రను కరువు బాధిత రాష్ట్రంగా పరిగణించాలంటూ ఇప్పటికే అక్కడ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం ప్రారంభించాయి. అక్కడి మరాఠ్వాడా తదితర ప్రాంతాల్లో భూములు ఎండిపోయి ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 900 ఆనకట్టల్లో నీటి మట్టం 30 శాతానికి పడిపోయింది.
ఇలా చాలా కాలం పాటు రుతు పవనాలు నిష్క్రమిం చడం ఎల్‌ నీనో ప్రభావమే తప్ప మరేమీ కాదని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడు తున్నారు. పసిఫిక్‌ మహా సముద్రంలో వేడి గాలులు మరింతగా విజృంభిస్తున్నాయని, తడి గాలులకు అవకాశమే లేకుండా పోతోందని వారు చెబుతున్నారు. ఈ ఎల్‌ నీనో ప్రభావం మరి కొంత కాలం కొనసాగే ప్రమాదం ఉందని, బహుశా సెప్టెంబర్‌ నెలలో కూడా వర్షాలు కురిసే అవకాశం లేదని వారు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద దేశంలో వర్షాభావపరిస్థితి 8 శాతానికి తగ్గడం జరుగుతుందని, 2015 తర్వాత ఇంత అధ్యాన స్థితి ఏ సంవత్సరమూ తలెత్తలేదని వారు వివరిస్తున్నారు. దాదాపు 70 శాతం పంటలు ఈ వర్షాల మీదే ఆధారపడి ఉన్నందువల్ల, 60 శాతం భూగర్భ జలాలు కూడా ఈ వర్షాకాలపు వర్షాల మీదే ఆధారపడి ఉన్నందువల్ల భారతదేశానికి ఈ ఏడాది ఒక విధంగా గడ్డుకాలమనే భావించాల్సి ఉంటుంది.
వర్షాభావం కారణంగా పంట దిగుబడులు బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, బియ్యం, గోధుమ, పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు, చక్కెర, కూరగాయలకు తీవ్రమైన కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం 7.44 శాతానికి చేరుకుంది. ఆహార ధాన్యాల ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. బియ్యం ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో ప్రభుత్వం బియ్యం ఎగుమతిని నిషేధించింది. దీనివల్ల దేశంలో బియ్యానికి కొరత ఉండదని, ధర పెరగదని ప్రభుత్వం భావిస్తోంది. మరో కోణం నుంచి చూస్తే ఇలా ఎగుమతులు నిషేధించడం వల్ల ఇతరత్రా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ప్రపంచంలో అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారతదేశం ఈ విధంగా బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ ఎగుమతి నిషేధం నాట్ల కాలంలో వచ్చినందువల్ల దేశంలో చాలా ప్రాంతాలలో రైతులు బియ్యం ఉత్పత్తిని పక్కనపెట్టి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లడం జరుగుతోంది. ఫలితంగా దేశంలో యాభై శాతం వరి ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది.
మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగే పక్షంలో ఆహార భద్రత గురించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తాగునీటి ట్యాంకర్లను సిద్ధం చేసుకోవడం, ఆహార శిబిరాలను ఏర్పాటు చేసుకోవడం, ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించడం వంటివి చోటు చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలను కరువు పరిస్థితులు చుట్టుముట్టే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఎల్‌ నీనో ప్రభావం కారణంగా భవిష్యత్తులో వర్షాలు సరిగ్గా, సకాలంలో పడే అవకాశం లేనందువల్ల దేశంలోని నీటిపారుదల వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఇప్పటి నుంచి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News