దేశంలో పేర్ల మార్పు అనేది ప్రస్తుతం ఒక ఉద్యమంలా సాగుతోంది. ఈ పేర్ల మార్పు వ్యవహారంతో అభివృద్ధి వెనుకపట్టు పడుతోంది. పేర్లు మారిస్తే చాలు అభివృద్ధి దానంతటదే జరిగిపోతుందనే భావన పాలక పక్షాల్లో బాగా వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోడ్లకు, వీథులకు మొఘల్ రాజులు, బ్రిటిష్ పాలకులు పెట్టిన పేర్లను తొలగించి దేశ నాయకుల పేర్లు పెట్టడంలో అర్థం ఉంది. వలస పాలకుల ప్రభావం నుంచి బయటపడాలనే తపనను ఏమాత్రం కాదనలేం. అయితే, వివిధ రాష్ట్రాలలో ఇది ఒక కొత్త రకం పైత్యంగా విజృంభించడం దుస్సహంగా ఉందనేది వాస్తవం. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన పేర్లను, తమకు తోచిన పేర్లను పెట్టుకోవడం మరొక తంతు. ఏమీ తోచనప్పుడు, ఏ విధాన నిర్ణయానికీ, ఏ అభివృద్ధి కార్యక్రమానికీ అవకాశం లేనప్పుడు పేర్లను మార్చడం మీద నాయకులు లేదా పాలకుల దృష్టి పడుతోంది. తమ ప్రాభవాన్ని, ప్రాబల్యాన్ని పెంచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో పాలక పక్షాలు రోడ్లు, వీధులు, ప్రాజెక్టులు, పథకాలు, నగరాలు, పట్టణాలు, ప్రాథమిక సదుపాయాలకు యథేచ్ఛగా పేర్లు మార్చడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.
ఈ విషయంలో కర్ణాటక కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక్కడ పథకాలకు, రోడ్లకు, నగరాలకు తమ కులాల పేర్లను, తమ కుల దేవతల పేర్లను కూడా పెట్టడం జరుగుతోంది. ‘నమ్మ మెట్రో’ అనే వ్యవహార నామంతో చెలామణీ అవుతున్న బెంగళూరు మెట్రో నెట్వర్క్ కు 12వ శతాబ్దం నాటి తత్త్వవేత్త, సంఘ సంస్కర్త అయిన బసవేశ్వర పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం మీద అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వాదోపవాదాలు చెలరేగుతున్నాయి. అనుకూల డిమాండుకు సారథ్యం వహిస్తున్న లింగాయత్ నాయకుడు, ప్రాథమిక సదుపాయాల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ ఈ నెట్వర్కుకు బసవేశ్వర పేరు పెట్టడంలో న్యాయం ఉందని, సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపు ఇవ్వాలని పాటిల్ తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. బెంగళూరు విమానాశ్రయానికి కెంపెగౌడ పేరు పెట్టినప్పుడు, మెట్రో నెట్వర్కుకు బసవేశ్వర పేరు పెట్టడంతో తప్పేమిటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు.
ప్రజల్లో మాత్రం దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పేర్ల మార్పిడి వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ప్రజా సంఘాలు మెట్రో నెట్వర్కుకు పేరు మార్చడానికి బదులుగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే ఆలోచన చేయాలని డిమాండు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి పథకాన్నీ ప్రకటించడమే కానీ, సమర్థవంతంగా పూర్తి చేయడమంటూ జరగడం లేదని, అభివృద్ధిని పక్కన పెట్టి పేర్లను మార్చడం మీద దృష్టి పెట్టడంలో అర్థం లేదని కూడా వారు వాదిస్తున్నారు. అయితే, పాటిల్ మాత్రం ఈ విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి ‘బసవనాడు’ అని పేరు పెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో లింగాయతుల ప్రాధాన్యం మీద మళ్లీ చర్చ ఊపందుకుంది.
ఇది ఇలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తన వంతుగా కొన్ని పేర్ల మార్పులతో ముందుకు వచ్చారు. రామనగర జిల్లాలోని కనకపురా తాలూకాను బెంగళూరు అర్బన్ జిల్లా పరిధిలోకి తీసుకు రావాలని, దాని పేరును బెంగళూరు సౌత్ అని మార్చాలని ఆయన డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా పేరు మార్చే పక్షంలో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. బెంగళూరులో ఇప్పటికే బెంగళూరు సౌత్ అనే పేరుతో ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఏర్పడి ఉంది. అంతేకాదు, ఆయన ప్రతిపాదన మీద ఇప్పటికే ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి వ్యతిరేకత ప్రారంభం అయింది. ఒకప్పుడు బెంగళూరు జిల్లాలో రామనగర, కనకపురా, మాగాడి ప్రాంతాలు కలిసి ఉండేవని, ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ‘బ్రాండ్ బెంగళూరు’గా అభివృద్ధి చేసే పక్షంలో మరింతగా పెట్టుబడులను ఆకట్టుకోగలుగుతామని శివకుమార్ వాదిస్తున్నారు. అయితే, మాజీ ముఖ్య మంత్రి హెచ్.డి. కుమారస్వామి దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దుల్ని మార్చడం ద్వారా శివకుమార్ కబ్జాలను, ఆక్రమణలను చట్టబద్ధం చేసే ఆలోచన చేస్తున్నారని కుమార స్వామి ఆరోపించారు.
వాస్తవానికి, 2007లో ముఖ్యమంత్రిగా ఉండగా కుమారస్వామి ఒక్కలిగలు అధిక సంఖ్యలో ఉండే రామనగరను బెంగళూరు రూరల్ నుంచి విడదీసి, ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇందులో కనకపురా శివకుమార్ కు కంచుకోట కాగా, రామనగర కుమారస్వామికి పెట్టని కోట అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకులుగా మారాయి. ఒక్క కర్ణాటకలోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాలలో రాజకీయ ఆవశ్యకతలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ప్రాంతీయ సంస్కృతికి, ప్రాంతీయ ప్రాధాన్యాలకు ప్రాధాన్యం పెంచాలని కొద్ది కాలంగా తపన పెరుగుతోంది. వీధులు, ఊర్లకు ప్రాచీన నాయకులు, కథా నాయకుల పేర్లను పెట్టడమనే ఆచారం క్రమంగా ప్రబలుతోంది. బ్రిటిష్ కాలం నాటి పేర్లకు కాలం చెల్లుతోంది. భారతీయకరణ అనేది సమంజసమైన వ్యవహారమే. ఇలా పేర్లను మార్చడంలో ఉత్తరప్రదేశ్, గోవాలు అగ్రస్థానంలో ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా క్రమంగా ఇదే పంథాను అనుసరించడం ప్రారంభించాయి. ఇది ఏ స్థాయికి వెడుతుందో మాత్రం అర్థం కావడం లేదు.
Geographical renaming: పేర్ల మార్పుతో అభివృద్ధి సాధ్యమా?
బసవనాడు, బెంగళూరు సౌత్, బ్రాండ్ బెంగళూరు తో వివాదాలు