Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Girijan University: గిరిజన యూనివర్సిటీ కోసం ఎదురు చూపులు

Girijan University: గిరిజన యూనివర్సిటీ కోసం ఎదురు చూపులు

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీలు పూర్తిస్థాయిలో వచ్చేదెన్నటికో?

కారడవుల్లో కకావికలమైన బతుకులతో కాలం వెళ్లదీస్తున్న ఆదివాసుల్లో.. చదువుల వెలుగు నింపడానికి కేంద్ర ప్రభుత్వం వారి విద్య కోసం 889.07 కోట్ల రూపాయలతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి పూనుకుంది. ఆదివాసీల ఆరాధ్య దైవాల పేరు మీదుగా ఆ విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంగా పేరు పెడుతూ పార్లమెంట్ లో బిల్లు పెట్టడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కొన్ని ప్రత్యేకమైన హామీలను కల్పించారు. అందులో భాగంగా రెండు రాష్ట్రాలకు సెక్షన్ 93షెడ్యూల్ 13 (3) ప్రకారం రెండు గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2017 లోనే ఆమోదం తెలిపింది. గిరిజనులు భాష, సంస్కృతి, ఆచారాలు, కళలలో ప్రత్యేక శైలి కలవారు. అటవీ ఆధారిత ఉత్పత్తులు, ఔషధాలను ఉపయోగించుకొనే ప్రావీణ్యం వారి సొంతం. కాబట్టి వారికి నాణ్యమైన విద్యను అందించి, వారి సేవలను సామాజిక పునర్నిర్మాణానికి అందించాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం 2008లో మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ ప్రాంతంలో తొలి నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నెలకొల్పింది.

మన రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. కానీ, గిరిజనుల అక్షరాస్యత రాష్ట్ర అక్షరాస్యతో పోల్చితే సుమారు 17 శాతం తక్కువ. రాష్ట్రంలో వీరి జనాభా 10 శాతంగా ఉంది. కళలు, సాహిత్యం, భాష, ఆచార సంప్రదాయాలలో గిరిజనులది ప్రత్యేక శైలి. అలాగే నైపుణ్యాలు, సామర్థ్యాల విషయాల్లో అత్యంత ప్రతిభావంతులు. కానీ, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఉన్నత విద్యను అభ్యసించే సగటు జనాభాతో పోల్చి చూసినప్పుడు గిరిజనుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో అక్కడ గిరిజన యూనివర్సీటీని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి ప్రాంతంలో 2019 లో ఏర్పాటు చేశారు. అక్కడ తాత్కాలికంగా తరగతులు ప్రారంభమైనవి. కానీ, తెలంగాణలో ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ములుగు ప్రాంతంలో యూనివర్సిటీ కోసం 335.04 ఎకరాల భూమి కేటాయించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ కూడా పరిశీలించింది. 2019 లో తాత్కాలిక తరగతులు ప్రారంభించడానికి హెచ్ సి యూ కి భాధ్యత అప్పగించినప్పటికీ కొంత అలసత్వం ఏర్పడింది. అలాగే ఈ గిరిజన యూనివర్సీటీలో 30 శాతం సీట్లు రాష్ట్ర కోటాగా కేటాయించాలని గత ప్రభుత్వంలో రాష్ట్ర గిరిజన శాఖామంత్రి కోరారు. కానీ తెలంగాణ గిరిజన అభ్యర్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా 50శాతం సీట్లు గిరిజనులకే కేటాయించాలి. అలాగే ఉద్యోగాలు 50శాతం వారికే కల్పించాలి.

నేడు ఆదివాసీలు విద్య, ఉపాధి రంగాల్లో చాలా వెనకబడిపోయారు. ఉన్నత చదువులు చదవలేక ఈ నాగరికత సమాజంలో ఇతరులతో పోటీ పడలేకపోతున్నారు. పశుపోషణ, అటవీ ఉత్పత్తుల సేకరణ, వ్యవసాయం చేసుకుంటూ ఏజెన్సీకి పరిమితం అయ్యారు. ఐదవ షెడ్యూల్ కు చెందిన ఆదివాసీ భూభాగంలోని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదివాసీలకు సరైన ఉన్నత విద్యావకాశాలు అందక చాలా మంది నేడు నిరాశ్రయులుగా మిగులుతున్నారు. విద్య, ఉపాధి అవకాశాలు ఆదివాసీల దరికి చేరక పట్టణ ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశాలు సన్నగిల్లు తున్నాయి. ఆదివాసీలకు ప్రత్యేకంగా ఉన్నత విద్యను అందించే ఆదివాసీ యునివర్శిటి త్వరగా ఏర్పాటు చేస్తే ఆదివాసీ సమాజం విద్య, ఉపాధి రంగాల్లో ముందడుగు వేస్తుంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, అస్థిత్వం మనుగడ అంతమవుతున్న నేపద్యంలో ఆదివాసీ యునివర్శిటీ ఏర్పాటు చేస్తేనే ఆదిమ జాతి సంరక్షణ సాధ్యం అవుతుందని రాజకీయ విశ్లేషకులు, మేధావులు సూచిస్తున్నారు. ఈ యునివర్శిటీ ద్వారా ఆదివాసీ సమాజాన్ని మేల్కొల్పే అవకాశం ఉంటుంది. కాబట్టి నేడు ఆదివాసీల స్ధితి గతులను సంపూర్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ యునివర్శిటి వల్ల భవిష్యత్ తరాలను ఉన్నత విద్యావంతులుగా చూపించాలంటే యునివర్శిటి ఏర్పాటు అనివార్యము. ఇప్పటికే ఆదివాసీలది 75 ఏళ్ల వెనుకబాటు. ప్రతి రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల సమయంలో ఏజెన్సీలోని ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడుతున్నారే గానీ చేసేదేమి లేదు.

నేడు ఆదివాసీలు విద్యారంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ వంటి వృత్తి విద్య, ఉన్నత చదువులు పొందాలంటే వారికి ప్రైవేట్ కళాశాలలే దిక్కు. వేలు లక్షలు పెట్టి చదవాలంటే ఆర్ధిక స్తోమత ఆదివాసీలకు లేదు. మైదాన ప్రజలతో చాలా మంది ఆదివాసీలు పోటిపడలేక చదువును మధ్యలోనే మానేస్తున్నారు. ఆదివాసీ గ్రామాలలో సరైన పాఠశాలలు, కళాశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నంటికి పరిష్కార మార్గంగా ఏజెన్సీలలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రత్యేక గిరిజన యూనివర్సిటీ దోహద పడుతుంది. మానవ వనరుల ఉత్పత్తి ప్రక్రియలో, అభివృద్ధి ప్రక్రియలో ఆదివాసీలు భాగస్వామ్యం అవుతారు.

ప్రపంచ వ్యాపితంగా ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సంక్షోభం సవాళ్లు ఒకేవిధంగా ఉంటున్నాయి. ఆదివాసీ తెగల రాజ్యంగ రక్షణలు, భాష, వేషధారణ, గిరిజన కళలను సంరక్షించడానికి ఈ విశ్వవిద్యాలయం ఉపయోగపడుతుంది. ఆదివాసీ జీవన ప్రమాణాలు, వారి నైపుణ్యం, అభివృద్ధి, అవకాశాలు అంతరించి ఈ సమాజపు సంక్షోభానికి దారి తీయకముందే యూనివర్సిటీ ప్రారంభం కావాలి. ఆదివాసీ సమాజంపై జరుగుతున్న దోపిడి పీడన సమాజ పరిణామక్రమం అన్ని ఆదివాసీ యూనివర్సిటీ ద్వారా చర్చకు వస్తాయి. నేడు ఆదివాసీ విద్యార్థులు యూనివర్సిటీ విద్యకు వచ్చే సరికి ఒక శాతానికి తగ్గిపోతున్నారు. యూనివర్సిటీలో రాజ్యమేలుతున్న ప్యూడల్ రాజకీయ అధిపత్య దోరణులకు ఆదివాసీ విద్యార్థులు తట్టుకొలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పైరవీలు, రాజకీయ నాయకులు అండదండలు ఉన్నవారికే ఇతర యూనివర్సిటీలలో సీట్లు ఇస్తున్నారు. ఆదివాసీ విద్యార్థులు ఆర్థిక స్థోమత లేక, సరైన సామర్ధ్యం ఉండీ కూడా యూనివర్సిటీ స్థాయిలో ఆదివాసీ విద్యార్థులు రాణించలేక పోతున్నారు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని త్వరగా సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభించాలి.

* గుమ్మడి లక్ష్మీ నారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక,
సెల్ : 9491318409

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News