విద్యావంతులు నాయకత్వం వహించే సమాజం సుస్థిర సమగ్రాభివృద్ధి దిశలో పయనిస్తుంది. విద్యతోనే అన్ని సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. పేదరిక నిర్మూలనలో విద్య పాత్ర వెలకట్టలేనిది. ప్రపంచ దేశాల తొలి ప్రయత్నం అక్షరాస్యత రేటును పెంచడం అవుతుంది. అక్షరాస్యులకు ఉన్నత విద్య గొడుగును కల్పి స్తే కుటుంబాల జీవనశైలిలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయి. 2018 గణాంకాల ప్రకారం ప్రపంచ వయోజనుల అక్షరాస్యత రేటు 86 శాతం (పురుషుల్లో 90 శాతం, స్త్రీల్లో 83 శాతం) ఉండగా, భారతదేశ అక్షరాస్యత రేటు 77.7 శాతంగా (పురుషుల్లో 86 శాతం, స్త్రీల్లో 67 శాతం) నమోదు అయ్యింది. ప్రపంచ దేశాల్లో 15-24 ఏండ్ల యువతలో అక్షరాస్యత రేటు 92 శాతంగా ఉంది. ఉన్నత విద్యలో చేరుతున్న భారత యువతకు సంబం ధించిన గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జిఈఆర్) 27.1 శాతంగా ఉండగా, ప్రపంచ దేశాల్లో అత్యధికంగా టెర్షరీ స్థాయి విద్య ఆస్ట్రేలియాలో 67 శాతంగా నమోదు అయ్యింది. ప్రపంచంలోని 145 పేద అల్పాదాయ, మధ్య ఆదాయవర్గ దేశాల విద్యారంగాలకు అభివృద్ధి చెందిన దేశాలు చేయూతను ఇవ్వాలి. విశ్వ విద్యకు, ఆరోగ్య కల్పనకు పెద్ద పీట వేయాలి. సామాజిక ఆర్థిక ప్రగతి, పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, అధిక జనాభా, శాంతి సామరస్యాల జీవనం లాంటివి విద్యతోనే పరిష్కరించబడతాయి.
నిర్భంధ పాఠశాల విద్య నేటికీ అందని ద్రాక్షేనా
ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 జాబితాలో 4వ లక్ష్యంగా ‘నాణ్యమైన విద్య (క్వాలిటీ ఎడ్యుకేషన్)’కు పెద్ద పీట వేశారు. ఐరాస ఎజెండా-2030కి సంబంధిం చిన 2021 నివేదిక ప్రకారం కోవిడ్-19 కల్లోలం విద్యారంగాన్ని అత్యంత ప్రభావితం చేసిందని తేలింది. ఏప్రిల్ 2020లో 1.6 బిలియన్ల పిల్లలు (91 శాతం) పాఠ శాలలకు దూరమైనారు. మధ్యాహ్న భోజనంపై ఆధార పడిన 369 మిలియన్ల పిల్లలు పోషకాహారానికి దూరం అయ్యారు. విద్యకు విఘాతం కలిగితే అన్ని రంగాలపై దాని దుష్ప్రభావం పడుతుంది. విపత్తుల విజృంభనలతో దాదాపు 70 శాతం పిల్లల చదువులకు పూర్తిగా లేదా పాక్షి కంగా ఆటంకం కలిగింది. పేదలు, అల్ప ఆదాయ వర్గాల పిల్లల విద్యార్జన కుంటుపడింది. దాదాపు 100 మిలియన్ల పిల్లలు కరోనా కారణంగా రీడింగ్ స్కిల్స్ కోల్పోయారు. పాఠశాలల మూసివేతతో పేద విద్యార్థులు అధికంగా బాల కార్మికులు లేదా బాల్యవివాహాల బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా గత పది ఏండ్లలో (2010-19) సెకండరీ విద్య పూర్తి చేసిన యువత 46 శాతం నుంచి 53 శాతానికి పెరిగారు. 2010లో ప్రాథమిక విద్య 70 శాతం ఉండగా, 2018లో 84 శాతానికి పెరిగింది. 2030 నాటికి 89 శాతానికి చేరవచ్చని ఐరాస అంచనా వేస్తున్నాది. కరోనా విపత్తుతో 2030 నాటికి 200 మిలియన్ల ప్రపంచ బాలలు పాఠశాల విద్యకు కూడా దూరంగా ఉంటారని అంచనా. నేటికీ 65 శాతం పాఠశాలల్లో మాత్రమే కనీస వసతులు కల్పించబడి ఉన్నాయి.
అక్షరాస్యత పునాది – ఉన్నత విద్య ప్రగతి
నిరంతర విద్య కల్పనతో పాటు నైపుణ్య శిక్షణలను పెంపొందించే కృషి జరగాలి. విద్యరంగంలో లింగ వివక్ష మరింత దుష్ప్రభావాన్ని చూపుతున్నది. బాలికలకు విద్య ను అందిస్తే అనంతర కాలంలో కుటుంబమే విద్యావంతుల కోవెల అవుతుంది. మహిళా సాధికారతకు మహిళా విద్య ప్రధాన ఆయుధం కావాలి. పాఠశాలలు లేకపోవడం, వస తుల లేమి, బాలికలకు టాయిలెట్స్ కొరత, విద్యుత్తు కనె క్షన్ లేకపోవడం, ఆధునిక ఐసిటి వనరుల లేమి, నిరక్ష రాస్యులైన తల్లితండ్రులు, పేదరికం, అధిక జనాభా లాంటి ప్రతికూలతలు విద్యావ్యాప్తిని నిరోధిస్తున్నాయి. ఆర్థికాభి వృద్ధికి దోహదపడే అంశాలుగా పేదరిక నిర్మూలన, ఉచిత విద్య కల్పన, వైద్య ఆరోగ్య వసతులు, సామాజిక రక్షణ, ఉద్యోగ ఉపాధుల కల్పన, వాతావరణ ప్రతికూల మార్పు లను తగ్గించడం లాంటి చర్యలు తీసుకోవడం మరువ రాదు. అందరికి నిర్భంధ పాఠశాల విద్య ఉచితం చేయాలి. వృత్తి నైపుణ్యాలు అందించే విద్య ప్రణాళికలు వేసి కార్య రూపం ఇవ్వాలి. ఉన్నత విద్యలో జీఈఆర్‌ను క్రమంగా పెంచేలా చర్యలు తీసుకోవాలి. విశ్వం కుగ్రామమైన ఈ డిజిటల్ యుగంలో దేశాల మధ్య అసమానతలు ప్రపంచ మానవాళికి ప్రతిబంధకాలు కానున్నాయి.
విద్యతోనే విశ్వ కళ్యాణం కలుగుతుందని, మానవాళి సంక్షేమానికి విద్య ఉత్తమ ఉపకరణమని తెలుసుకొని అందరు పిల్లల్ని, యువతను విద్యావంతులుగా మార్చే మహా యజ్ఞంలో మనందరం భాగస్వామ్యం తీసుకుందాం.
డా॥ బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037
(నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం)
World literacy day: అక్షర జ్ఞానంతోనే అసమానతల తగ్గింపు
విద్య తోనే విశ్వ కళ్యాణం, మానవాళి సంక్షేమం విద్యలోనే