Friday, September 29, 2023
Homeఇంటర్నేషనల్Hot summer in America: అమెరికాలో భ‌గ‌భ‌గ‌లు

Hot summer in America: అమెరికాలో భ‌గ‌భ‌గ‌లు

సెప్టెంబ‌రు వ‌చ్చినా మండుతున్న ఎండ‌లు

: ఒక‌వైపు సెప్టెంబ‌రు నెలలో రెండోవారం వ‌చ్చేసింది. హైద‌రాబాద్ స‌హా ప‌లు ప్రాంతాల్లో విప‌రీతంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డిపోయింది. కానీ అగ్ర‌రాజ్యం అమెరికాలో మాత్రం కొన్ని ప్రాంతాలు ఇంకా భ‌గ‌భ‌గ‌లాడుతూనే ఉన్నాయి. ఏ స్థాయిలో అంటే, ఈశాన్య ప్రాంతంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఒక‌టైన బోస్ట‌న్‌లో అక్క‌డి మేయ‌ర్ మిషెల్ వు ‘హీట్ ఎమ‌ర్జెన్సీ’ని ప్ర‌క‌టించారు. మ‌రీ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఉంటే త‌ప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని తెలిపారు. ఈ ప‌రిస్థితి రెండు మూడు రోజుల పాటు క‌చ్చితంగా ఉంటుంద‌ని శాస్త్రవేత్త‌లు అంటున్నారు. అక్క‌డి హీట్ ఇండెక్స్ 90లు దాటిపోతుంద‌ని ముంద‌స్తు వాతావ‌ర‌ణ హెచ్చ‌రిక‌ల కేంద్రం తెలిపింది. “వాతావ‌ర‌ణ మార్పు, భూతాపం ప్ర‌భావం ముందెన్న‌డూ లేనంత తీవ్ర‌స్థాయిలో క‌నిపిస్తోంది. మ‌న న‌గ‌రంలో ఉండేవారికి విప‌రీత‌మైన వేడి ప్ర‌మాద‌క‌రంగా మారేలా క‌నిపిస్తోంది. అన్ని వ‌య‌సుల వారి మీదా ఈ ప్రభావం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు పాఠ‌శాల‌లు కొత్త‌గా తిరిగి ప్రారంభం అవుతున్నాయి. అందువ‌ల్ల బోస్ట‌న్ ప‌బ్లిక్ స్కూల్ సిబ్బంది కొన్ని ప్రొటోకాల్స్ పాటించి, పిల్ల‌ల ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. మొద‌టి వారంలోనే పిల్ల‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌దు. న‌గ‌రవాసులు కూడా మ‌రీ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఉంటే త‌ప్ప అస్స‌లు బ‌య‌ట‌కు రాకుండా చూసుకోవాలి. ఇళ్ల‌లో ఏసీలు వేసుకుని ఉష్ణోగ్ర‌త త‌గిన స్థాయిలో ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి” అని మేయ‌ర్ మిషెల్ వు ప్ర‌క‌టించారు. న‌గ‌ర‌వాసుల‌ను ఈ హీట్ ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితి నుంచి కాపాడేందుకు బోస్ట‌న్ యంత్రాంగం కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. త‌మ ప్రాంతంలో వేడి ఎక్కువ‌గా ఉందంటూ 911 అత్య‌వ‌స‌ర నంబ‌రుకు వ‌చ్చే కాల్స్ ఈ రెండు రోజుల్లోనే 15-20 శాతం పెరిగాయి. ఈ ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు కొన్ని క‌మ్యూనిటీ కూలింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటుచేస్తున్నారు. న‌గ‌రంలోని 15 కేంద్రాల్లో ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ కూలింగ్ కేంద్రాలు ప‌నిచేస్తాయి. ఇళ్ల‌లో ఏసీలు లేనివారు, లేదా ఏదైనా ప‌నిమీద బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారు బ‌య‌టి వేడిని భ‌రించ‌లేని ప‌రిస్థితి ఉంటే వెంట‌నే ఈ కూలింగ్ కేంద్రాల్లోకి వ‌చ్చి సేద‌తీర‌వ‌చ్చు. వీటితోపాటు ఓపెన్ పార్కులు, ప్లేగ్రౌండ్ల‌లో 64 స్ప్లాష్ ప్యాడ్ల‌ను కూడా అందిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్, ఫౌంటెన్ల‌ను తెరిచి ఉంచుతున్నారు. వీట‌న్నింటి ద్వారా ప్ర‌జ‌ల‌ను చ‌ల్ల‌గా ఉంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇవి కాక ప‌లు ప్రాంతాల్లో బోస్ట‌న్ ప‌బ్లిక్ హెల్త్ క‌మిష‌న్ (బీపీహెచ్‌సీ) అత్య‌వ‌స‌ర కేంద్రాల‌ను ఏర్పాటుచేసింది. ఇవి పురుషులు, మ‌హిళ‌ల‌కు వేర్వేరుగా ఉన్నాయి. ఇవి 24×7 ప‌నిచేస్తాయి. పిల్ల‌లు, పెద్ద‌ల‌కు జాగ్ర‌త్త‌లు
భూతాపం కార‌ణంగానే ఇలా హీట్ ఎమ‌ర్జెన్సీ వ‌చ్చింద‌ని చెబుతున్న శాస్త్రవేత్త‌లు.. ఈ సంద‌ర్బంగా పౌరులు తీసుకోవాల్సిన ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను తెలిపారు.

 • వ‌దులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి
 • త‌గినంత నీరు తాగుతూ శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి
 • ఎండ‌లోకి వ‌చ్చినప్పుడు త‌ప్ప‌నిస‌రిగా గొడుగులు ధ‌రించాలి
 • స‌న్‌స్క్రీన్ లాంటివి రాసుకోవ‌డం ద్వారా అతినీల లోహిత కిర‌ణాల నుంచి ర‌క్షించుకోవాలి
 • పాఠ‌శాల‌లు, ఇత‌ర విద్యాసంస్థ‌ల‌కు అవ‌స‌ర‌మైతే సెలవులు ప్ర‌క‌టించాలి
 • ఒక‌వేళ తెరిస్తే, విద్యాసంస్థ‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా ఏసీలు వేసి ఉంచాలి
 • పిల్ల‌ల‌ను, పెంపుడు జంతువుల‌ను కొద్ది సేపు కూడా కార్ల‌లో వదిలి వెళ్ల‌కూడ‌దు
 • మ‌ద్యం గానీ, కెఫిన్ లేదా తీపి ఎక్కువ‌గా ఉండే పానీయాలు తాగ‌కూడ‌దు
 • చ‌ల్ల‌నీళ్ల‌తో స్నానం చేయ‌డం, ఏసీ, ఫ్యాన్లు వేసుకుని నీడ‌లో ఉండ‌టం ద్వారా చ‌ల్ల‌గా ఉండేలా చూసుకోవాలి
 • ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు అతినీల లోహిత రేడియేష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఆ స‌మ‌యంలో అస్స‌లు బ‌య‌ట‌కు రాకూడ‌దు.
 • చెమ‌ట‌లు ఎక్కువ‌గా ప‌ట్టినా, క‌ళ్లు తిరిగినా, వికారం అనిపించినా, కండ‌రాలు నొప్పులు పుట్టినా అది వ‌డ‌దెబ్బ‌కు సూచ‌న‌. వెంట‌నే 911కు కాల్ చేయాలి.
 • ఎస్‌పీఎఫ్ 30 లేదా అంత‌కంటే ఎక్కువ ఉన్న స‌న్‌స్క్రీన్ల‌ను పిల్ల‌లు, పెద్ద‌లు వాడాలి.
 • పొడ‌వు చేతుల దుస్తులు వేసుకుని హ్యాట్లు పెట్టుకోవాలి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News