Saturday, July 27, 2024
Homeఓపన్ పేజ్Women reservation: మహిళా ప్రాతినిధ్యం అంతంత మాత్రమే!

Women reservation: మహిళా ప్రాతినిధ్యం అంతంత మాత్రమే!

శుష్కప్రియాలు, శూన్య హస్తాల ..

మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తూ చాలా నెలల క్రితం బిల్లు ఆమోదం పొందింది కానీ, కొత్తగా ఎన్నికైన లోక్‌ సభలో మాత్రం వీరి ప్రాతినిధ్యం పెరిగిన దాఖలాలు కనిపించడం లేదు. మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారికతకు కట్టుబడి ఉన్నామని ప్రచారం చేసిన పార్టీలన్నీ మహిళలను నిర్లక్ష్యం చేశాయనడంలో సందేహం లేదు. ప్రస్తుత 18వ లోక్‌ సభలో ఉన్న మహిళా సభ్యుల సంఖ్య కేవలం 74 మాత్రమే. గత లోక్‌ సభ కంటే ఇది నాలుగు తక్కువ. మొత్తం 543 మంది లోక్‌ సభ సభ్యులను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఇందులో 13 శాతం మంది మాత్రమే మహిళలు. విచిత్రమేమిటంటే, మొత్తం ఓటర్లలో 48 శాతం మంది మహిళా ఓటర్లున్నారు. లోక్‌ సభకు పోటీ చేసిన 8,360 మంది అభ్యర్థుల్లో 10 శాతం మంది మాత్రమే మహళలు. పైగా, 155 లోక్‌ సభ నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులే లేరంటే దేశంలోని రాజకీయ పార్టీలు మహిళలను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తు న్నాయో, వాటికి మహిళలంటే ఎంత చులకనో అర్థం చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా బీజేపీ 69 మంది మహిళలను అభ్యర్థులుగా నిలబెట్టగా అందులో 32 మంది విజయాలు సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టిన 41 మంది మహిళల్లో 13 మంది మాత్రమే గెలవ గలిగారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో ఓ అడుగు ముందున్నట్టు కనిపిస్తోంది. ఈ పార్టీ తరఫున పోటీ చేసిన 12 మంది అభ్యర్థుల్లో 11 మంది విజయాలు సాధించడం జరిగింది. ఆ పార్టీకి లోక్‌ సభలో ఉన్న మొత్తం 39 మంది సభ్యుల్లో 38 శాతం మంది మహిళా సభ్యులున్నారన్న మాట. వాస్తవానికి పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం అతి తక్కువ స్థాయిలో పెరుగుతోంది. 1952లో 4.4 శాతం ఉన్న మహిళా ప్రాతినిధ్యం ఇప్పటికి 13 శాతానికి పెరిగింది. దాదాపు అన్ని రంగా ల్లోనూ పురోగతి సాధిస్తున్న మహిళలకు రాజకీయాల వరకూ వచ్చే సరికి చుక్కెదురవుతోంది. పైగా, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారికి, చలన చిత్ర రంగానికి చెందిన వారికి ఉన్నంత ప్రాధాన్యం ఇతర వర్గాలకు ఉండడం లేదు.
రాజకీయ కుటుంబాలకు, చలన చిత్రాలకు మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో పైకి వచ్చిన మహిళలకు, ఇతర రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకున్న మహిళలకు కూడా రాజకీయ ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది. ఇతర రంగాలకు చెందిన మహిళలకు ప్రాతినిధ్యం పెరిగే వరకూ పార్లమెంటులో గానీ, ఇతర చట్ట సభల్లో గానీ మహిళలకు ఆశించిన స్థాయిలో సరైన ప్రాతినిధ్యం లభించే అవకాశమే లేదు.
రాజకీయాల్లో పురుషుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వారు మహిళలకు ఇందులో భాగస్వామ్యం కల్పించే అవకాశం లేదు. దీనికి ఒక కారణం పురుషాధిక్య ధోరణి కాగా, రెండవ ప్రధాన కారణం మహిళలతో అధికారం పంచుకోవడానికి ఇష్టం లేకపోవడం. నిజానికి, మహిళలు రాజకీయాల్లోకి రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఈసారి ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు ఓటు వేయడం జరిగింది. ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్న మాట నిజమే. మహిళల ఓట్లు సంపాదించుకోవడానికి రాజకీయ పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న మాట కూడా నిజమే. పార్టీలన్నీ మహిళలను ఒక ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయనడంలో సందేహం లేదు. పురుషులు అధికారంలో కొనసాగడానికి మహిళలను ఓటు బ్యాంకు లుగా ఉపయోగించుకోవడం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు శుష్కప్రియాలు, శూన్య హస్తాల కిందకే వస్తుంది. వచ్చే లోక్‌ సభ ఎన్నికల నాటికైనా రాజకీయ పార్టీలు మహిళలకు ప్రాతినిధ్యం పెంచే అవకాశం ఉంటుందా అన్నది సందేహమే.
మహిళలకు పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని కల్పించే విషయంలో అనేక దేశాలు భారతదేశం కంటే ముందున్నాయి. దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ సభ్యుల్లో సుమారు 46 శాతం మంది మహిళలే. బ్రిటన్‌ లో కూడా శాతం మంది ఎంపీలు మహిళలే కావడం గమనించాల్సిన విషయం. అమెరికా కూడా 29 మంది మహిళలకు తమ పార్లమెంటులో ప్రాతినిధ్యం ఇచ్చింది. లోక్‌ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి, ఇంకా ఇతర ప్రజా ప్రాతినిధ్య సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగే వరకూ అసలైన మహిళా సాధికారికత సాధ్యం కాకపోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News