Monday, June 24, 2024
Homeఓపన్ పేజ్Telugu language usage is decreasing: వన్నె తగ్గుతున్న తెలుగు

Telugu language usage is decreasing: వన్నె తగ్గుతున్న తెలుగు

విద్యావంతులు మాతృభాష సమస్యను ఎదుర్కొంటే మనం కలలు కంటున్న స్వేచ్ఛా భారతాన్ని సాధించలేమని, అన్ని స్థాయిలలో మాతృభాషను ప్రభుత్వ భాషగా, బోధనా భాషగా కొనసాగించాలని మహాత్ముడు ఆనాడే కోరారు. నేటికీ మహాత్ముడి మనోవ్యధను చిత్రించే పరిస్థితులు ఎందుకున్నాయో అందరూ ఆలోచించాల్సిన విషయమే.

- Advertisement -

భారత రాజ్యాంగం (ఆర్టికల్ 350A) మరియు కొఠారి కమిషన్ ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరం అని సూచించారు. యునెస్కోతో పాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా పిల్లలకు మాతృభాషలోనే చదువు చెప్పాలని చెబుతున్నాయి. ఉత్పత్తిలో అత్యున్నత స్థాయి అభివృద్ధి సాధించిన జపాన్ దేశీయ మాధ్యమాన్ని అత్యున్నత స్థాయిలో అమలు చేస్తోంది. భారత ప్రభుత్వం 2010 లో ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించిన ప్పటికీ ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. చాలా దేశాలు మాతృభాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుండగా, మన దేశం మాత్రం ఆంగ్ల భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విచారకరం. యువత ఇంగ్లీషు భాషపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో అన్ని రాష్ట్రాల్లో మాతృభాషా మాధ్యమాన్ని బోధించే ప్రభుత్వ పాఠశాలలు మూత పడే పరిస్థితి ఏర్పడింది. తెలుగు వద్దు ఆంగ్లం ముద్దు అంటూ ప్రైవేట్ పాఠశాలలు యువతను, తల్లిదండ్రులను విశేషంగా ఆకర్షిస్తున్నా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

మాతృభాషలోనే ఎందుకు బోధించాలి:

భాష ఒక దేశం యొక్క నాగరికత, సంస్కృతి మరియు ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భాష అనేది భావాన్ని వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా, భావాలు ఏకీకృతం చేయడానికి మరియు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి సహాయపడుతుంది. మనం తల్లి నుండి మొట్టమొదటగా నేర్చుకునేది , ఎక్కువగా మాట్లాడేదీ, భావోద్వేగ లేదా హృదయాను గత సంబంధం కలిగినదీ, ప్రతిచర్యలో ఉపయోగించేది మాతృభాష. చదువు సమయంలో పిల్లలకు ఆసక్తి, అవగాహన పెంపొందించేందుకు మాతృభాషలో బోధన తప్పనిసరి. విద్యార్థులకు కొత్త విషయాలపై అవగాహన కల్పించడంలో మాతృభాష ముఖ్య పాత్ర పోషిస్తుంది. మాతృభాషలో బోధించడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి పెంపొందుతాయి. మాతృభాషలో వ్యక్తీకరించడం, బోధించడం మరియు నేర్చుకోవడం వంటి ప్రక్రియలు సులభతరం అవుతాయి. వ్యక్తిత్వ వికాసం, కళాపోషణ, సాహిత్య అభినయం, సృజనాత్మకత, తీర్పు మొదలైన వాటిలో మాతృభాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. మాతృభాషలో చదువుకోవడం వల్ల ప్రతి పాఠాన్ని కంఠస్థం చేయకుండా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న పాఠం మరచిపోలేము. అంతేకాదు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అవగాహన భావాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలు కల్పిస్తుంది. విద్యార్థి మాతృభాషలో జ్ఞానాన్ని పెంపొందించుకుని స్వీయ రచనకు సిద్ధమవుతాడు. మాతృభాషలో విద్యాబోధన చేస్తే విషయం బాగా అర్థమవుతుంది. ఇంగ్లీషు మీడియంలో అదే చదివే పిల్లలు  పాఠం పై పట్టు సాధించ లేరు. ఇంగ్లీషు మీడియంలో చదివిన వారిని, మాతృభాషా మాధ్యమం లో చదివిన వారిని పరిశీలించినప్పుడు మాతృభాషా మాధ్యమంలో చదివే వారికి పాఠ్యాంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది.

తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత కొరత:

ఇప్పటివరకు ఏ పార్టీ అయినా ప్రాథమిక విద్యను ఇంగ్లీష్ మీడియానికి మార్చుతామని, తెలుగు ని ఒక సబ్జెక్ట్ గా మాత్రమే ఉంచుతామని హామీలు ఇవ్వడం జరిగింది అంతే తప్ప ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమం లో ఉంచి ఇంగ్లీష్ ని ఒక సబ్జెక్టుగా ఉంచుతామని ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు హామీ ఇవ్వలేదు. తెలుగు మాధ్యమం లో చదువుకు, ఉపాధికి ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వకపోవడమే కాదు గత మూడేళ్ల నుంచి అనేక ప్రాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమం గా మార్చారు. దీంతో పాటు మిగిలిన పాఠశాలలను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నుంచి అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అవుతుందనడంలో సందేహం లేదు. ఇందుకు కారణం విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమంపై మక్కువ చూపుతున్నారనే ఒక్క కారణం చూపుతూ తెలుగు మాధ్యమాన్ని లేకుండా తీసిపారేస్తున్నారు. అందువల్ల విద్యార్థులకు మాతృభాష పై పట్టు కోల్పోవడమే కాక గురువులు చెప్పే పాఠం లోని సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకానొక సందర్భంలో మహాత్మాగాంధీ మాతృభాషలో విద్య ఉంటె స్వరాజ్యం ఎప్పుడో వచ్చేది అన్నారట. ఇది మాత్రం అక్షర సత్యమే, భాషా చాతుర్యం ఉంటే ఏదైనా సంక్లిష్టమైన విషయాన్ని సులభంగా పరిష్కరించగలము మరియు మనం చెప్పదలుచుకున్న ప్రతిదాన్ని క్షణాల్లో వివరించగలము. ఊహాత్మక ఆలోచనకు, ఊహాత్మక శక్తికి, సృజనాత్మకతకు మూలం మాతృభాష.

మాతృభాషను విస్మరిస్తున్నారు:

మాతృభాషను విస్మరించి పర భాషకు పట్టం ఎందుకు కడుతున్నారంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పర భాషలోనే దొరుకుతున్నాయి కాబట్టి అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్య లేనందున విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యం కోల్పోతున్నారు. ఆంగ్ల మాధ్యమం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా  ఆంగ్లమాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగు మాట్లాడితే అందులో చాలావరకు తప్పులు ఉంటున్నాయి. అంటే వారు కనీసం మాట్లాడటానికి కూడా విముఖత చూపుతున్నారు. రాబోవు రోజుల్లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముంది. ఆంగ్ల మాధ్యమానికి ఉన్నంతగా ప్రోత్సాహకాలు తెలుగు మాధ్యమానికి లేకపోవడంతో ప్రజలు కూడా తమ పిల్లలు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని మార్పు కోరుకుంటున్నారు.  

ఇతర దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో చూద్దాం:

అభివృద్ధి చెందిన దేశాలన్నీ మాతృభాషకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడి విద్యా విధానం విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది కాబట్టి వారు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేస్తున్నారు.
 
జపాన్:
జపాన్‌లో విద్యార్థులకు పాఠాలే కాకుండా ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటం ఎలా? స్వీయ నియంత్రణ ఎలా ఉండాలి? ఈ సబ్జెక్టులను ప్రాథమిక మాధ్యమంలోనే విద్యార్థులకు బోధిస్తారు. పది సంవత్సరాల వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా చిన్న చిన్న పరీక్షలతోనే విద్యార్థులకు బోధిస్తున్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత గా భావించి ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే కాకుండా వారితో పాటు పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వారికి ఉపయోగపడే జపనీస్ కాలిగ్రఫీ మరియు సాహిత్యం కూడా నేర్పిస్తారు.

ఫ్రాన్స్:
ఆరేళ్లలోపు పిల్లలందరిని తప్పనిసరిగా పాఠశాలకు పంపాలి. ఇక్కడ పాఠశాలలు వారానికి నాలుగున్నర రోజులు మాత్రమే పనిచేస్తాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా ప్రతిభ తక్కువగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వారిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మన దేశంలో 10వ తరగతి పరీక్ష లాగా ఇక్కడ కూడా బ్యాకలారియాట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయినట్లు. బ్యాకలారియాట్ అనేది US హైస్కూల్ డిప్లొమా కి సమానం.

సింగపూర్:
ఇక్కడ పాఠశాల విద్య మూడు భాగాలు. తొలి ఆరేళ్లు ప్రైమరీ, నాలుగేళ్లు సెకండరీ, ఆ తర్వాత మూడేళ్లు పోస్ట్-సెకండరీ విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ప్రైమరీ విద్య నాలుగేళ్లు పూర్తికాగానే పాఠశాలలే సొంతంగా పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో రాణించగలుతున్నారో గుర్తించి, ఆ తర్వాత రెండేళ్ల చదువును కొనసాగిస్తారు.

ప్రభుత్వ పాఠశాలలు మూత బడటానికి కారణం:

తెలంగాణలో ప్రభుత్వ బడులు మూసివేయడం బాధాకరమైన విషయం. అందుకు కారణం బడుల్లో పిల్లలు లేకపోవడం వల్లే మూసివేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలో టీచర్స్ కొరత వల్లే పిల్లలను పంపలేక పోతున్నామని చెబుతున్నారు. కానీ ఆయా ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరకపోవడానికి, తల్లిదండ్రులు చేర్పించక పోవడానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి అధికారికంగా, శాస్త్రీయంగా ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. కేవలం ఉపాధ్యాయులనే నిందిస్తున్నారనే విష ప్రచారం జోరుగా సాగుతోంది. పిల్లలను తెలుగు మీడియం చదివిస్తే రాబోవు రోజుల్లో సరైన ఉద్యోగ అవకాశాలు ఉండవేమో అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చదువు కొరకు ఊరి బడిని వదిలి, కిక్కిరిసిన బస్సుల్లో తమ పిల్లలను పేరెంట్స్ దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు బడులకు పంపడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమ బోధన అందులో మొదటిది. కాగా సర్కారు బడుల్లో ముఖ్యంగా ప్రైమరీ స్థాయిలో ఒకటి లేదా రెండు గదుల్లో అన్ని తరగతులు ఒకరు లేదా ఇద్దరు టీచర్లు నిర్వహించాల్సి రావడం మరొక ప్రధాన కారణం. ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా, ఉపాధ్యాయుల కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News