ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు పెద్దలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక రకంగా ఇంట విజయం సాధించినట్లే అని చెప్పుకోవాలి. కానీ, మరి రచ్చ కూడా ఆయన గెలిచారా? ఎందుకంటే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే, అంటే అసలింకా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటించక ముందుగానే ఆయన ఒక ప్రత్యేక విమానం తీసుకుని అమెరికా బయల్దేరిపోయారు. మధ్యలో ఫ్రాన్స్‌లో కొందరు మిత్రులను పలకరించి, అక్కడి నుంచి తనకు అత్యంత ప్రియ మిత్రుడిగా చెప్పుకొనే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన సందర్భంగా ఆయనను వ్యక్తిగతంగా, నేరుగా అభినందించేందుకు వాషింగ్టన్ డీసీ వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య కరచాలనాలు, కౌగిలింతలు వరకు బాగానే అయిపోయాయి. కానీ…అసలు మోదీ అమెరికా పర్యటనతో భారతదేశానికి, భారతీయులకు ఒరిగిందేమిటి? అసలే ప్రస్తుతం అంతా అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో.. అక్కడి నుంచి భారీ సంఖ్యలో భారతీయులను సంకెళ్లు వేసి మరీ డిపోర్టేషన్ చేసేస్తున్న తరుణంలో తనకు అత్యంత ప్రియుడైన మిత్రుడి వద్దకు వెళ్లి ప్రధానమంత్రి సాధించింది ఏంటి? ఇద్దరూ ఒకరినొకరు నువ్వు గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ అని పరస్పర పొగడ్తల కార్యక్రమం మాత్రమే చేసుకుంటే సరిపోతుందా? మన దేశ ప్రజలకు అణుమాత్రమైనా మేలు ఏమైనా కలిగిందా? ఈ ప్రశ్నలన్నింటికీ దాదాపుగా లేదనే సమాధానమే వస్తోంది. దౌత్య విధానంలో అత్యంత సమర్థమైన ప్రభుత్వంగా పేరొందిన ఎన్డీయే సారథి ఈసారి అమెరికా వెళ్లి మాత్రం సాధించింది ఏమీ లేదనే చెప్పుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే.. ఆయన అక్కడ ఉండగానే హెచ్1బీ వీసాల విషయంలో గానీ, డిపోర్టేషన్ విషయంలో గానీ, రెసిప్రొకల్ టారిఫ్‌ల విషయంలో గానీ మనవాళ్లకు ఎలాంటి ఊరట లభించనే లేదు. అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు ఇప్పుడు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తమకు ఏమైనా ఊరట కలుగుతుందేమోనని వాళ్లంతా వెయ్యి కళ్లతో వేచి చూశారు. కానీ వారి కలలన్నీ కల్లలే అయిపోయాయి. ఈసారి పర్యటనల కేవలం పైపై మాటలే తప్ప.. చేతలపరంగా సాధించింది దాదాపుగా ఏమీ లేదనే విమర్శ గట్టిగానే వినిపిస్తోంది. ముఖ్యంగా రెసిప్రోకల్ టారిఫ్‌లు ప్రపంచపటంపై ట్రంప్ సృష్టించనున్న ఒక విష వలయంగా ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అసలేమిటీ రెసిప్రొకల్ టారిఫ్‌లు
వేరే దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద పడే పన్నులే టారిఫ్‌లు. వేరే దేశాలు తమ వస్తువులను ఎగుమతి చేసేటప్పుడు ఎంత మొత్తం పన్నులు వేస్తున్నాయో, తాము కూడా తమ వస్తువులను ఆయా దేశాలకు పంపేటప్పుడు అంతే మొత్తం పన్నులు వేయాలన్నది రెసిప్రొకల్ టారిఫ్ విధానం. పచ్చిగా చెప్పాలంటే.. పంటికి పన్ను, కంటికి కన్ను అన్నట్లుగా.. వాళ్లెంత వేస్తున్నారో, మనమూ అంతే పన్ను వేయాలి అన్నదే ఈ విధానం. అవతలి దేశం తమకు మిత్ర దేశమా, శత్రుదేశమా అన్న దాంతో ఏమాత్రం సంబంధం లేదు. వ్యూహాత్మక ప్రత్యర్థులైన చైనా లాంటి దేశాలకు గానీ, తమ మిత్ర దేశాలైన భారత్, యూరోపియన్ యూనియన్, జపాన్, కొరియాలకు గానీ కూడా అదే సూత్రం వర్తింపజేస్తున్నారు. ఏ దేశానికి ఎంత పన్ను అనేది వాళ్లు విధిస్తున్న పన్నులను బట్టే ఉంటుంది.
మనపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఇతర దేశాలు అన్నింటికంటే భారతదేశం అమెరికా వస్తువులపై విధిస్తున్న పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ఆ మాటకొస్తే అసలు భారతదేశాన్ని పన్నుల రారాజుగా అభివర్ణించొచ్చని ట్రంప్ తరచు అంటున్నారు. తాజాగా ఇటీవలే టారిఫ్ ఆర్డర్ మీద సంతకం చేసే సమయంలో కూడా ఆయన ఇదే వ్యాఖ్య చేశారు. తాను మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ పన్నుల విషయాన్ని భారత ప్రధానితో చర్చించానని, కానీ వాళ్ల నుంచి తమకు ఎలాంటి మినహాయింపులు రాలేదని ఆయన అన్నారు. అందుకే.. భారతదేశానికి కూడా తాము రెసిప్రొకల్ టారిఫ్ విధానాన్నే అవలంబిస్తామని స్పష్టం చేశారు. అంటే.. మనం ఎంత పన్ను వేస్తున్నామో మనకూ అంతే పన్ను పడుతుందని కుండ బద్దలుకొట్టేశారు. కానీ… అమెరికాలోని కుబేరులతో పోలిస్తే ఇక్కడి నుంచి ఎగుమతి చేసే చిన్నతరహా వ్యాపారుల మీద ఆ పన్ను భారం ఎంత పడుతుందో అటు ట్రంప్‌కు, ఇటు నరేంద్ర మోదీకి తెలియని సంగతి కాదు. ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ కుబేరులకు కొద్దిపాటి పన్ను పడినంత మాత్రాన నష్టం ఏమీ రాదు. కానీ, భారతదేశం నుంచి లేస్లు, వస్త్రాలు, యంత్రాలు, మందులు, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, తోలు వస్తువులు, వ్యవసాయోత్పత్తులు.. ఇవే ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ఇవన్నీ పంపేది సామాన్య, చిన్నతరహా వ్యాపారులే. వారు ఎగుమతి చేసే ఇలాంటి వస్తువుల మీద పన్నులు అధికంగా విధిస్తే సహజంగానే వాటి ధర అక్కడ పెరుగుతుంది, అప్పుడు వాటికి డిమాండు తగ్గుతుంది. ఫలితంగా మన దేశం నుంచి అక్కడకు చేసే ఎగుమతులు తగ్గిపోతాయి. ఏప్రిల్ రెండో తేదీ నుంచే ఈ రెసిప్రొకల్ టారిఫ్‌లు అమలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అసలెందుకు తీసుకొస్తున్నారు?
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయానికే అక్కడ విపరీతమైన ఆర్థికమాంద్యం ముంగిట సిద్ధంగా ఉంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావమో.. మరేమో గానీ చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉద్యోగులను లే ఆఫ్ పేరుతో తొలగిస్తున్నా యి. దీంతో అమెరికా ప్రజల్లో తీవ్రమైన అలజడి నెలకొంది. ఆర్థిక మాంద్యం ఏర్పడితే మొత్తం మార్కెట్ వ్యవస్థే అస్తవ్యస్తం అవుతుంది. అందుకే, దాన్నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో పన్నుల రూపంలో ఆదాయం పెంచుకునేందుకు ట్రంప్ ఈ ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. తాను అధికారంలోకి రాగానే.. ప్రజల మనుసులు దోచుకోవాలన్న ఉద్దేశంతో అమెరికన్లందరికీ ఆదాయపన్ను తీసేస్తున్నట్లు చెప్పారు. దాంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలావరకు తగ్గిపోనుంది. దాన్ని పూడ్చుకోవాలంటే ఏదో ఒకటి కావాలని ఆలోచించి మరీ.. ఇలా అన్ని దేశాల మీద తన ఆర్థికమాంద్యాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఇదంతా ఒక విషవలయంగా మారుతుంది. క్రమంగా అదే ఆర్థిక మాంద్యం అన్ని దేశాలనూ ఆవహించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేవాటి మాట ఎలా ఉన్నా, అక్కడకు ఎగుమతి చేయడం ద్వారా కొన్ని రంగాలకు బోలెడంత మార్కెట్ లభిస్తుంది. అదంతా ఇప్పుడు మందగిస్తుంది. ముఖ్యంగా మన దేశం నుంచి మందుల ఎగుమతులు అమెరికాకు చాలా పెద్దమొత్తంలో జరుగుతాయి. అలాగే వ్యవసాయోత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు కూడా. వస్త్ర ఉత్పత్తులు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఇక ఇప్పటికే సేవారంగంలో తీవ్రమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి ఉండడంతో అక్కడున్న భారతీయ యువత తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. హెచ్1బీ వీసాల రెన్యువల్ విషయంలో సైతం ట్రంప్ యంత్రాంగం పెడుతున్న అర్థం లేని నిబంధనల వల్ల భారతీయులే ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. అసలు ఇప్పటికే దేశాల వారీ కోటా విధించడం వల్ల మనవాళ్లు హెచ్1బీ వీసాలు దొరక్క అవస్థలు పడుతుంటే, ఇప్పుడు డ్రాప్ బాక్స్ రెన్యువల్స్ విషయంలోనూ కొత్త నిబంధనలు పెడుతూ, మనవాళ్ల ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నారు.
మాగా.. మిగా రెండూ ఒకేసారి ఎలా సాధ్యం?
మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మాగా) అని ట్రంప్ అంటుంటే.. అచ్చం అలాగే మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్ (మిగా) చేస్తామని నరేంద్రమోదీ అమెరికాలో తన మిత్రుడితో పాటు కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ అసలు ఈ రెండూ ఒకే ఒరలో ఇరికించాలనుకుంటున్న రెండు కత్తుల్లాంటివన్న విషయం మోదీకి తెలియదా? ఏదో ఒక కత్తి మాత్రమే ఒక ఒరలో దూరుతుంది. రెండు దేశాల ప్రయోజనాలూ ఒకేసారి గెలవడం దాదాపుగా సాధ్యం కానే కాదు. అయినా ఎవరి చెవుల్లో పూలు పెట్టడానికి ఇలా చెబుతున్నారో మోదీకే అర్థం కావాలి. ఎల్లకాలం అందరినీ మోసం చేయడం సాధ్యం కాదు. కొంతకాలం కొంతమందినే మోసం చేయగలరని అంటారు. కానీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో మోదీ చెబుతున్న మాటలు చూస్తుంటే మాత్రం భారతీయుల్లో చాలామందికి అనుమానాలే వస్తున్నాయి.
అమెరికాకు ప్రయోజనం ఉంటుందా?
కొత్తగా విధిస్తున్న, విధించాలనుకుంటున్న రెసిప్రొకల్ టారిఫ్‌ల వల్ల పోనీ అమెరికాకు ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయా అంటే.. అదీ అనుమానమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. వీటివల్ల అక్కడ ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని వాల్‌స్ట్రీట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దానివల్ల ఫెడరల్ రిజర్వ్ ఇకపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండదు. ఆర్థిక వృద్ధి మందగమనంలో వెళ్తుంది. కొత్తగా వాణిజ్యపరమైన చర్యలు ఏమీ లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లపైనా ప్రభావం పడుతుందని ఆ దేశ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెసిప్రొకల్ టారిఫ్‌లు ఇప్పటికిప్పుడే విధించకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లకు కొంత ఊర ట లభించవచ్చు గానీ.. అవి అమలైన తర్వాత ప్రభావాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయని బార్క్లేస్ సంస్థలోని విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఇద్దరి మధ్య అసలేం జరిగింది?
మోదీ, ట్రంప్ మధ్య ప్రధానంగా వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరింది. ట్రంప్ మొదటి టర్మ్ కంటే ఇప్పుడు రెండింతల వేగంతో తామిద్దరం కలిసి పనిచేస్తామని మోదీ వ్యాఖ్యానించారు. ట్రంప్ కూడా మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు, అందరూ ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. మోదీ నిజంగా గొప్ప నాయకుడు అని ట్రంప్ అన్నారు. టారిఫ్స్ గురించి అడిగిన ప్రశ్నకు డోనల్డ్ ట్రంప్ బదులిచ్చారు. అది భారత్ అయినా లేదా మరో దేశమైనా పన్నులు వసూలు చేస్తామని ట్రంప్ అన్నారు. మాకు పన్నులు వేసినట్లే మేం కూడా వారికి పన్నులు విధిస్తాం. ఇది అమెరికా పరిపాలనా విధానం. పరస్పర సుంకాలను వర్తింపజేస్తాం. భారత్ మా నుంచి ఎంత వసూలు చేస్తుందో, మేం కూడా వారి నుంచే అంతే వసూలు చేస్తాం అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక అమెరికా నుంచి భారతీయుల డిపోర్టేషన్ అంశానికి తాను మద్దతు పలుకుతున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు.
ఇదంతా చూస్తుంటే.. అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతులు ఇక చాలా ఎక్కువగా ఉండబోతున్నాయని, మన మార్కెట్‌ను అమెరికా కొల్లగొట్టబోతోందని అర్థమవుతుంది. ఎంత షుగర్ కోటింగ్ వేసి ఇచ్చినా.. చేదు మందు చేదు మందే అవుతుందన్న విషయం అందరికీ తెలుసు. అమెరికా నుంచి భారీస్థాయిలో చమురు, ఇతర ఉత్పత్తులు మన దేశం మీద వచ్చి పడ్డాయంటే సహజంగానే వాటి ధరలు పెరిగిపోతాయి. ఇంతకుముందు ఉక్రెయిన్ మీద యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను చాలా దేశాలు తగ్గించేశాయి. అయితే, ఆ దేశంతో మనకున్న సత్సంబంధాల దృష్ట్యా మనం తక్కువ ధరకే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోగలిగాం. ఆ ప్రయోజనం ప్రజల వరకు చేరకపోయినా.. ప్రభుత్వానికి మాత్రం చాలానే మిగిలింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకున్నప్పటి కంటే తక్కువ ధర పడడంతో ఖజానా బాగా బలపడింది. కానీ ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యాల నుంచి దిగుమతి చేసుకుంటే మళ్లీ చమురు ధరలు పెరుగుతాయి. తగ్గినప్పుడు తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు అందించే ప్రయత్నం ఏమాత్రం చేయని కేంద్ర ప్రభుత్వం.. అవి పెరిగితే మాత్రం వెంటనే పెంచేస్తుందనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.
గుడ్డిలో మెల్ల.. ఎఫ్35 డీల్
అమెరికాలో తయారు చేసిన అత్యాధునిక యుద్ధవిమానం ఎఫ్35లను భారతదేశానికి అమ్మజూపడం, అందుకు ఒక ఒప్పందం కూడా చేసుకోవడం మాత్రం ఈ పర్యటన మొత్తమ్మీద సాధించిన అతిపెద్ద విజయం అని చెప్పుకోక తప్పదు. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ యుద్ధ విమానం వివిధ సెన్సర్ల ద్వారా అందే సమాచారాన్ని కలిపి విశ్లేషించి పైలట్‌కు కచ్చితమైన సమాచారం, సూచనలు అందిస్తుంది. ఇతర విమానాలు, నేలమీద ఉండే రాడార్ల నుంచి సమాచారాన్ని సేకరించి, వాటికి సమాచారం ఇస్తుంది. శత్రు రాడార్లను సులభంగా తప్పుదోవ పట్టించి, అక్కడ ఎగురుతున్నది ఏదో ఒక చిన్న కీటకం అనే భ్రమ కలిగించగలదు. అంతేకాదు.. అసలు తనతో అనుసంధానమైన ఆయుధాలన్నీ కూడా తన సొంత శక్తిసామర్థ్యాలకు మించి శత్రువుపై దాడి చేసేలా ఇది తోడ్పడగలదు. ఎఫ్35 అనేది అయిదో తరం స్టెల్త్ విమానం. అయిదో తరం విమాన టెక్నాలజీల్లో భారత్ బాగా వెనుకబడి ఉందని, ఇది దేశ భద్రతకు అంత మంచిది కాదని రక్షణరంగ నిపుణుల నుంచి తరచు ఆందోళన వ్యక్తమవుతోంది. వీటి విషయంలో ఇప్పటికే చైనా ముందుకు దూసుకువెళుతోంది. వీటిని తాము చైనా నుంచి కొంటామని పాకిస్థాన్ కూడా ఈమధ్యే ప్రకటించింది. ప్రస్తుతం మన వద్ద మూడో తరం, నాలుగోతరం, లేదా మహా అయితే 4.5 తరం యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. పక్కలో బల్లెం పెట్టుకున్నట్లు ఇటు చైనా, అటు పాకిస్థాన్ దేశాలతో కయ్యం ఉండి మనం వైమానిక రంగంలో అంత వెనకబాటులో ఉంటే చాలా ప్రమాదమే. అలాంటి తరుణంలో మనకు ఆర్థికంగా భారం అవుతున్నా కూడా ఎఫ్35 విమానాలు రావడం అనేది గొప్ప విజయమే అవుతుంది. ఐదో తరం స్టెల్త్ విమానాలను తయారు చేసేందుకు స్వదేశీ పరిజ్ఞానాన్ని కూడా భారతదేశం అందిపుచ్చుకుంటోంది. కానీ, ఇందుకు చాలా సమయం పడుతుంది. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ వేగవంతం అయితేనే 2036 నాటికి తొలి విమానం అందుతుంది. ఇలాంటి తరుణంలో ఎఫ్35 లాంటి అత్యాధునిక యుద్ధ విమానం మనకు అందడం చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.
ఇదేం వ్యక్తిగతం..?
ఆదానీపై అమెరికాలో వస్తున్న అవినీతి ఆరోపణల విషయంలో మోదీని ఓ విలేకరి సూటిగానే ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మోదీ ఇది మొత్తం ఆదానికి సంబంధించిన వ్యక్తిగతమైన విషయం అని తప్పించుకున్నారు. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త మరో దేశంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు అవి ఆ వ్యాపారవేత్తకు సంబంధించిన వ్యక్తిగతమైనవి ఎలా అవుతాయో మోదీకే తెలియాలి. తన పార్టీతో పాటూ తను కూడా ఆదానీ ఎదుగుదలకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలు ఒక వైపు నుంచి వస్తున్నాయి. రాహుల్ గాంధీ పార్లమెంటు వేదిక నుంచి ఈ రకంగా ఆరోపణలు చేశారు. ఇలాంటి సమయంలో మోదీ ఈ విధంగా ఆదాని గురించి మాట్లాడటం ద్వారా దేశ ప్రజలకు ఏమి సందేశం పంపాలనుకుంటున్నారో అంతుబట్టడం లేదు. పిల్లి కళ్ళుమూసుకుని పాలు తాగుతూ ప్రపంచం మొత్తం కళ్ళు మూసుకున్నది అనుకున్నట్టుగా ఉంది ఈ అంశం. మోదీ ప్రధానమంత్రి అయిన తరువాతనే ఆదానీ బిజినెస్ గ్రాఫ్ పెరిగిపోయిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.
ఈ పర్యటనలో మరో గమ్మత్తు కూడా జరిగింది. మోదీ నాకు వ్యక్తిగత మిత్రుడు అంటూ ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. ఇదేదో బాగుందని అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతి సంతోషించింది. మిత్రుడు అడిగితే మరో మిత్రుడు సహకరించకపోతాడా అని అంతా అనుకున్నారు. కానీ ఆ మరుసటి రోజే మిత్రదేశమైన, శత్రుదేశమైన తాము త్వరలో అమలు చేయనున్న రెసిప్రొకల్ టారిఫ్‌ల విషయంలో ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. ఇక తాను స్వయంగా రాసిన ‘‘అవర్ జర్నీ టుగెదర్’’ అనే పుస్తకాన్ని మోదీకి అందించి ట్రంప్ చేతులు దులుపుకున్నారు.
ఈ పర్యటన ఓన్లీ పర్సనల్
ఫిబ్రవరి 2025 వరకూ ప్రధాని మోదీ చేపట్టిన విదేశీ పర్యటనల సంఖ్య అక్షరాల 85. ఇందులో 73 దేశాలను ఆయన చుట్టి వచ్చారు. ఈ దఫా అమెరికా పర్యటనపైనే విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన తరువాత మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే అప్పటికే ట్రంప్ ఆయన చేపట్టనున్న సంస్కరణల గురించి బహిరంగంగానే ప్రకటించారు. చట్టపరంగా ఆయా ప్రకటనలకు తుది రూపు ఇవ్వాల్సి ఉంది. ఈ సారి ట్రంప్ కేవలం అమెరికాను మాత్రమే ఒక యూనిట్‌గా తీసుకుని అన్ని రకాల ప్రణాళికలు రూపొందించుకున్నారు. అమెరికన్ ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన సంస్కరణలు, విదేశీ వాణిజ్యంపై ఆయన అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ అమలయ్యే సమయంలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రపంచ దేశాలను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ మోదీ మధ్య కుదరిన సయోధ్యేమైనా ట్రంప్ ఆలోచనా ధోరణిలో మార్పులు తీసుకుని వస్తుందేమోనని అంతా ఎదురుచూశారు. కానీ ఈ దఫా మోదీ విదేశీ పర్యటన దేశానికి పెద్దగా ఏమీ ప్రయోజనం కల్గించలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రపంచ దేశాల ఆశలు కూడా ఆవిరయ్యాయి.
‘సమయం’ కాలం బై సమయమంత్రి చంద్రశేఖర శర్మ, 98858 09432
