వీకెండ్ వచ్చిందంటే సరదాగా అలా పిల్లా పాపలతో కలిసి బీచ్‌లో తిరగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో మాత్రం బీచ్ అంటేనే జనం భయపడుతున్నారు. ఒక్క సిడ్నీ నగరంలోనే కాదు.. ఇతర ప్రాంతాల్లోనూ తీరప్రాంతాల్లో నల్లటి తారుబంతులు కనిపించడమే ఇందుకు కారణం. ఉన్నట్టుండి ఆస్ట్రేలియాలోని అనేక బీచ్‌ల వెంబడి ఈ తారుబంతులు బయటపడుతున్నాయి. వీటిని చూసి సామాన్య ప్రజలే కాదు.. అధికార యంత్రాంగం, శాస్త్రవేత్తలు సైతం ఉలిక్కిపడ్డారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి వందలాది తారు బంతులు ఇలా కొట్టుకొచ్చేసరికి ఒక్కసారిగా ఏమవుతోంది, వీటి వెనక ఉన్న మిస్టరీ ఏంటని అంతా ఆందోళనకు గురయ్యారు. ముందుగా కూగీ బీచ్‌లో ఈ గోళాకార బంతులు కనిపించాయి. దాంతో ఆ బీచ్‌ని మూసేశారు. రాండ్విక్ సిటీ కౌన్సిల్‌తో పాటు ఎన్ఎస్‌డబ్ల్యు పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) దీనిపై విచారణ మొదలుపెట్టాయి. క్రమంగా.. క్లోవెల్లీ బీచ్, గార్డన్స్ బే, మరౌబ్రా బీచ్ ఉత్తర భాగంలో కూడా ఈ తారు బంతులు కనిపించడం మొదలైంది. రెండు మూడు రోజులకల్లా.. బొండి, బ్రాంట్, తమరమా, లిటిల్ బే, మలబార్, ఫ్రెంచ్‌మాన్స్, కాంగ్‌వాంగ్ బీచ్‌లలోనూ ఇవి దర్శనం ఇవ్వసాగాయి. కొన్నాళ్ల తర్వాత దేశ దక్షిణ భాగంలోని కొన్ని బీచ్‌లలోనూ తారుబంతులు కనిపించాయి.
బీచ్‌ల మూసివేత.. విచారణ
ఒకటి కాదు.. రెండు కాదు.. దేశంలోని అనేక బీచ్‌లలో వందలాది తారుబంతులు ఇలా కనిపించడంతో పర్యావరణ శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. కొన్నిచోట్ల ఇవి చిన్నగా, తక్కువ రంగులో కనిపిస్తే, మరికొన్నిచోట్ల మాత్రం కాస్త పెద్ద బంతులు, బాగా చిక్కటి నలుపుతో ఉంటున్నాయని ఎన్ఎస్‌డబ్ల్యు మారిటైం డైరెక్టర్ డారెన్ వుడ్ తెలిపారు. సుమారుగా గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉన్న కొన్ని వేల తారు బంతులు ఒక్కసారిగా వస్తున్నాయని, వాటిని శుభ్రం చేస్తున్నా కూడా మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయని చెప్పారు. దీంతో ముందుగా దేశంలో ఇవి ఎక్కడెక్కడ కనిపించాయో ఆ బీచ్‌లన్నింటినీ మూసేసి.. ఆ తర్వాత వాటిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఎందుకైనా మంచిదని వాటిని చేత్తో ముట్టుకోవద్దని కూడా సామాన్య ప్రజలతో పాటు బంతులను తీసేస్తున్న సిబ్బందికీ సూచనలు ఇచ్చారు. ఏవైనా పరికరాలతో గానీ, లేదా చేతులకు మందపాటి గ్లోవ్స్ ధరించి గానీ మాత్రమే తొలగించాలని చెప్పారు.
అసలేంటీ తారు బంతులు?
సాధారణంగా సముద్రాల్లో కొన్నిసార్లు చమురు తెట్టు ఏర్పడుతుంది. ఆఫ్‌షోర్ చమురు శుద్ధి కేంద్రాల్లో ప్రమాదవశాత్తు, క్రూడాయిల్ పైపులైన్లలో పగుళ్లు రావడం, ఆయిల్‌ను రవాణా చేసే నౌకలు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా వాటి నుంచి లీకైనప్పుడు చమురు ముందుగా ఒక తెట్టులా ఏర్పడుతుంది. కాలక్రమేణా ఇది ఇతర కలుషితాలతో కలిసి బంతులుగా రూపొంది తీరానికి కొట్టుకొస్తుంది. ఇందులో ప్రధానంగా చమురుతో పాటు ఇతర క్రూడ్ హైడ్రోకార్బన్ పదార్థాలు ఉంటాయని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లండ్ చెప్పారు. గాలి, కెరటాలు, వాతావరణ పరిస్థితుల కారణంగానే చమురుతెట్టు ఇలా బంతిరూపంలోకి మారుతుందని ఆయన వివరించారు. పెట్రోలు, బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలతో పాటు.. ఇళ్ల నుంచి వెలువడే కొన్నిరకాల వ్యర్థాలతో కలిసి కూడా ఈ తారు బంతులు ఏర్పడి ఉంటాయన్న అభిప్రాయం వస్తోంది.
ప్రమాదం ఉందా?
ప్రస్తుతానికి వీటిలో కేవలం చమురు, హైడ్రోకార్బన్ మాత్రమే ఉన్నాయని భావిస్తుండడంతో ఇవి మరీ అంత ప్రమాదకరం కాకపోవచ్చని కొందరు చెబుతున్నారు. అయితే.. వీటిని చేత్తో ముట్టుకోవడం మాత్రం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. పొరపాటున చేయి తగిలినా.. వెంటనే తగినంత సబ్బు, నీళ్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని, నల్ల రంగు చేతుల మీద ఏమాత్రం లేకుండా చూసుకోవాలని ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లండ్ సూచించారు. ఒకవేళ ఆ చేతులతో ఏమైనా తింటే మాత్రం క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. వీటివల్ల అసలైన ముప్పు మాత్రం ఆహార గొలుసులో ఉంటుంది. ఎందుకంటే.. సముద్రాల్లో వేటాడే చేపలు, ఇతర మత్స్య జాతులను మనుషులు తింటారు. అవి చమురుతెట్టును గానీ, ఈ తారు బంతులను గానీ అప్పటికే కొంత తీసుకుని ఉంటే.. వాటిలో ఉండే ప్రమాదకరమైన విషపదార్థాలు మనుషుల శరీరాల్లోకి చేరిపోతాయి.
కావాలని చేసిన కుట్రా?
తారుబంతులు ప్రమాదవశాత్తు ఏర్పడితే వాటిని శుభ్రం చేస్తే ప్రస్తుతానికి సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, ఎవరైనా ఒకవేళ కుట్రపూరితంగా వీటిని కావాలని సముద్ర తీరాల్లో వదులుతున్నా, లేదా సముద్రంలో చమురు లీకేజి కావాలనే చేసినా.. ఇది ఇప్పట్లో ఆగే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు దాని గురించి ముమ్మరంగా దర్యాప్తుచేసి, ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ల మీద చర్యలు తీసుకోక తప్పదు. ఒక మిలియన్‌కు ఎన్ని భాగాల చమురు సముద్రంలోకి వెళ్లొచ్చనడానికి అంతర్జాతీయ నియమ నిబంధనలు ఉన్నాయి. అయినా, ఏదైనా ఉద్దేశంతో.. ఏ రూపంలోనైనా చమురును సముద్రంలోకి వదులుతుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
బీచ్‌లు తెరిచినా.. ఇంకా వీడని మిస్టరీ
సిడ్నీలో కొన్ని బీచ్‌లను స్విమ్మర్ల కోసం మళ్లీ ఈ మధ్యే తెరిచారు. “ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది” అని పర్యావరణ పరిరక్షణ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీఫెన్ బీమన్ తెలిపారు. బంతులు కనిపిస్తే, దగ్గర్లో ఉన్న అధికారులకు చెప్పాలి తప్ప.. ఎవరికి వారు వాటిని తీసి శుభ్రం చేయాలని మాత్రం పొరపాటున కూడా ఆలోచించొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికి బీచ్‌లను తెరిచినా, ఈ ముప్పు మాత్రం ఇప్పట్లో తొలగిపోయేలా లేదు. ఎందుకంటే, సముద్రంలో వేలాది కిలోమీటర్ల దూరంలో కొన్ని నెలల నుంచి లేదా సంవత్సరాల నుంచి కూడా ఈ చమురుతెట్టు ఏర్పడి ఉండొచ్చని, అది ఒక ఘన పదార్థంగా మారడానికి ఇంత కాలం పట్టి ఉండొచ్చని, ఈ లెక్కన చూసుకుంటే మరిన్ని తారు బంతులు తయారై.. బీచ్‌లను ముంచెత్తే ప్రమాదం లేకపోలేదని ప్రొఫెసర్ ఇంగ్లండ్ హెచ్చరించారు.
కాబట్టి ఆస్ట్రేలియన్లతో పాటు.. ఆ దేశంలో పర్యటించడానికి వెళ్లేవారు సైతం బీచ్‌లలో తిరిగేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం కచ్చితంగా ఉంది.
(తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి)