Monday, July 14, 2025
Homeఓపన్ పేజ్Nawab Ali Nawaz Jung: తెలంగాణ ఇంజినీర్స్ డే.. అపర భగీరథుడు నవాబ్ అలీ జంగ్

Nawab Ali Nawaz Jung: తెలంగాణ ఇంజినీర్స్ డే.. అపర భగీరథుడు నవాబ్ అలీ జంగ్

Telangana Engineers Day: నవ తెలంగాణ నిర్మాతగా, తెలంగాణ బిడ్డల ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణంగా ఆయనను భావిస్తారు. ఆయన పర్యవేక్షణ, ముందుచూపుతో తెలంగాణలో ప్రాజెక్టులు, కట్టడాలు రూపుదిద్దుకున్నాయి. నాటి హైదరాబాద్ సంస్థానంలో ఇరిగేషన్ ప్రాజెక్టులక పునాది వేసిందే ఆయనే. అతని ఫలితంగానే దేశంలో పలు భారీ ప్రజెక్టులు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణలో టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎంతగానో కృషి చేశారు. అతని పేరే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. నాటి నిజాంల పాలనలో ఆయన అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఎనలేని సేవలు అందించి తెలంగాణ కట్టడాలు, ప్రాజెక్టులపై తన పేరు మీదుగా లిఖించుకునేలా చరిత్రలో నిలిచిపోయాడు. ప్రతి యేటా జూలై 11న ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా జరుపుతోంది. అసలు నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఎవరు? ఆయన చేసిన సేవలు ఏంటి? నాటి ప్రధాని నెహ్రూకు ఆయన చేసిన సూచనలు ఏంటి? నాడు హైదరాబాద్‌కు ప్రధానిగా నియామకం అయ్యే అవకాశం వచ్చినా నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఎందుకు వద్దన్నారు తదితర విషయాలు తెలియాలంటే ఈ ప్రత్యేక కథనం చదవాల్సిందే.

- Advertisement -

హైదరాబాద్ టు ఇంగ్లండ్:
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ 11 జూలై 1877లో జన్మించారు. ఆయన తండ్రి మీర్ వైజ్ అలీ దఫ్తార్-ఏ-ముల్కీకి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. నవాబ్ జంగ్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, మదర్సా-ఇ-అలియాలో చదువుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో చేరాడు. 1896లో అతను స్టేట్ స్కాలర్‌షిప్‌పై ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. అక్కడ అతను కూపర్స్ హిల్ కాలేజీలోని ప్రసిద్ధ ఇంజినీరింగ్ కళాశాలలో అద్భుతమైన ప్రతిభ చూపాడు. కూపర్స్ హిల్ కాలేజీలోని ప్రసిద్ధ ఇంజినీరింగ్ కళాశాలలో విజయవంతమైన అభ్యర్థుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు నవాబ్ అలీ. ఇంజినీరింగ్‌లోని వివిధ శాఖలలో అనేక స్కాలర్‌షిప్‌లను పొందాడు.

ప్రతిభకు గుర్తింపు:
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ 1899లో ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరారు. అనంతరం 1913లో ఆయన ప్రభుత్వ పీడబ్ల్యుడీ, టెలిఫోన్ విభాగానికి కార్యదర్శిగా నియమితులయ్యారు. 1918లో ఆయన చీఫ్ ఇంజినీర్ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఆయన సేవలను గుర్తించిన బొంబాయి ప్రభుత్వం 1929లో ఎం. విశ్వేశ్వరయ్యతో కలిసి సుక్కూర్ బ్యారేజీ ఆర్థిక, సాంకేతిక అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆహ్వానించింది.

ప్రాజెక్టుల రూపకర్త:
హైదరాబాద్ నిజాం పాలనలో చీఫ్ ఇంజనీర్‌గా నవాజ్ అలీ పనిచేశారు. హైదరాబాద్ రాష్ట్రంలోని ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, హిమాయత్ సాగర్, నిజామాబాద్ జిల్లాలోని అలీ సాగర్ జలాశయం వంటి ప్రధాన నీటిపారుదల పనులు, భవనాలు, వంతెనలకు నవాజ్ జంగ్ బాధ్యత వహించారు. వీటికి ఆయన పేరు కూడా పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా సోన్ దగ్గర గోదావరిపై రాతి వంతెన, గుల్బర్గా జిల్లా యాద్గిర్ దగ్గర భీమా నదిపై రాతి వంతెన నిర్మాణం, నిజామాబాద్ జిల్లా బండిపల్లి దగర్గర రాతి వంతెన, ఖమ్మం జిల్లా మున్నెరు నదిపై రాతి వంతెన, ఔరంగాబాద్ శాఘడ్ దగ్గర ఆర్‌సీసీ వంతెన, మహబూబ్ నగర్ జిల్లా అనగొండ దగ్గర క‌ృష్ణా నదిపై రాతి వంతెన, రాయచూర్ జిల్లాలో తుంగభద్ర నదిపై రాతి వంతెన.. ఇలాంటి మరెన్నో నిర్మాణాలు ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నాయి.

భారీ ప్రాజెక్టులకు ఆద్యుడు
తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజినీర్ నవాబ్‌ అలీ నవాజ్ జంగ్‌ బహదుర్.. తన దార్శనికతతో భవిష్యత్ సాగు, తాగునీటి అవసరాలకు అందేలా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. చీఫ్ ఇంజనీర్‌గా ఆయన పదవీకాలంలో, పెద్ద నీటిపారుదల పనులు ప్రారంభించబడ్డాయి. ఆయన ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. గోదావరి, మంజీరా నదిపై ప్రధాన వంతెనలు సహా అనేక భవనాలు, వంతెనల నిర్మాణానికి నవాబ్ సాహెబ్ బాధ్యత వహించారు. జిల్లాలకు టెలిఫోన్ సేవలను విస్తరించడంలో ఆయన ఎంతగానో కృషి చేశారు. వైరా, పాలెర్, ఫతే నహర్, వంతెనలు వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులకు ఆయన బాధ్యత వహించారు. అత్యంత తెలివైన ఇంజనీర్లలో ఆయన ఒకరు మరియు నిజామాబాద్‌లోని అలీ సాగర్‌కు ఆయన పేరు పెట్టారు. వర్షపాతాన్ని నమోదు చేయడానికి రెయిన్ గేజ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని గుర్తించిన దార్శనికుడు నవాజ్ జంగ్ భాక్రానంగల్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ లాంటి భారీ ప్రాజెక్టుల్లో జంగ్ కీలక పాత్ర పోషించారు.

మూసీ ముంపు నుంచి రక్షణ
భారీ వర్షాలతో మూసీ నదికి వరదలు వచ్చి ముంపనకు గురి కాకుండా, హైదరాబాద్ జలమయం కాకుండా మూసీ నదికి ఇరువైపులా రాతి కట్టడాలు(రిటైనింగ్ వాల్‌ను) నిర్మించడానికి నవాబ్ జంగ్ ఇచ్చిన ప్రణాళికలే దోహదం చేశాయి. ఆయన ఫలితంగానే మూసీకి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించారు.

నదీ జలాల వివాదాలు పరిష్కరించడంలో దిట్ట
అంతరాష్ర్ట నదీ జలాల వివాదాలు పరిష్కరించడంలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ దిట్ట. తుంగభద్ర, కృష్ణ జలాల కేటాయింపు సమస్యను నవాబ్ సాహెబ్ మద్రాస్ అండ్ హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య పరిష్కరించాడు. ఎంతో నేర్పుతో ఆయన ఈ సమస్యను పరిష్కరించారని చెబుతారు. ఆయన చూపిన చొరవ కారణంగానే 1930లో మద్రాస్ ప్రభుత్వం నిజాం ప్రభుత్వానికి 50 శాతం నది నీటిని ఉపయోగించుకునే హక్కును ఇచ్చింది.

ఇండియన్ యూనియన్‌లో లేకున్నా..
నెహ్రూ ఆహ్వానంతో ఫ్యూచర్ ప్లానింగ్ కమిటీలో నవాజ్ జంగ్ పనిచేశారు. నాడు హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో లేకున్నా జంగ్ సేవలు అందించారు. రివర్ ట్రైనింగ్ అండ్ ఇరిగేషన్ పేరుతో జంగ్ నివేదిక అందించారు. దాని ఫలితమే నేడు ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏర్పాటుకు కారణం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని ఢిల్లీలో జంగ్ నివేదిక ఆధారంగా నెహ్రూ ప్రభుత్వం అమలు చేసింది. అలాగే పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసర్చ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. హైడ్రాలజీపై జంగ్ పరిశోధనలతో ఇంజినీరింగ్‌లో ఒక పార్ములానే తయారయ్యింది. దీని ప్రకారమే డిండి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలని నాడు నెహ్రూను కోరారు. నవాజ్ జంగ్ బహదూర్ లౌకికవాది.

నాటి హైదరాబాద్‌కు ప్రధాని అవకాశం వచ్చినా..
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ రాజ్యానికి ప్రధాని అవుతారని నాడు కథనాలు వచ్చాయి. కానీ తనకు పదవిపై వ్యామోహం, ఆసక్తి లేదంటూ ఆయన తిరస్కరించారు. నీటి ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ, టెలిఫోన్ సేవల విస్తరణలో జంగ్ చేసిన సేవలే ఇప్పటికీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధారాలుగా ఉన్నాయని చెబుతారు. ఇంజినీర్‌గా హైదరాబాద్ నగర భవిష్యత్తును నిర్మించిన నవాజ్ జంగ్ హైదరాబాద్ విలీనం తరువాత 1949 డిసెంబర్ 6న కన్నుమూశారు. తరువాతి ప్రభుత్వాలు ఆయన సేవలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించినా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడినాక నవాజ్ జంగ్ సేవలకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 11న ఆయన జయంతిని తెలంగాణ ఇంజినీర్స్ డేగా జరుపుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News