Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్NCERT books: పాఠ్య పుస్తకాల్లో దిద్దుబాటు చర్యలు

NCERT books: పాఠ్య పుస్తకాల్లో దిద్దుబాటు చర్యలు

లెఫ్ట్ Vs రైట్

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి అనేక ఏళ్లుగా వక్రీకరణలకు గురైన చరిత్రను, పరిశోధనలను, పాఠ్యాంశాలను సరైన మార్గంలోకి తీసుకు రావడం ఆషామాషీ వ్యవహారం కాదు. చరిత్రను, పాఠ్యాంశాలను అర్థ సత్యాలతో కాకుండా, పూర్తి సత్యాలతో నింపే ప్రయత్నానికి సహజంగా రాజకీయ పక్షాల తాకిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. చరిత్ర, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాలను రాజకీయాలకు అతీతంగా, నగ్న సత్యాలతో శుద్ధి చేయడానికి జాతీయ విద్య, పరిశోధన మండలి (ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి) ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు సహజంగానే కాంగ్రెస్‌, వామపక్షవాద విద్యావంతులు, మేధావులు, పరిశోధకుల నుంచి ప్రతిఘటన మొదలైంది. ఈ మండలి ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థుల పాఠ్యాంశాలను చక్కదిద్దే పని మొదలుపెట్టినప్పుడు దీనినంతా వివాదాస్పద వ్యవహారంగా రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ పార్టీల భావజాలాన్ని అనుసరించే మేధో సంస్థల నుంచి వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పాఠ్యాంశాలలో చేస్తున్న మార్పులు విద్యావిషయక ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ వారంతా వ్యాఖ్యానాలు, విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పాఠ్యాంశాలనే కాకుండా, బోధనా పద్ధతులను కూడా తరచూ సవరిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. పాఠ్యాంశాలను ఎప్పటి కప్పుడు మెరుగుపరచడం, నిత్యనూతనం చేయడం వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం పెరగడానికి అవకాశముంటుంది. ఈ మండలి ఈ దిశగా చేస్తున్న కృషి మీద కొన్ని కుహానా మేధో సంస్థలు విరుచుకుపడడం జరుగుతోంది. విజ్ఞాన సృష్టి అనేది నిరంతరంగా కొనసాగాల్సిన వ్యవహారం. దేశంలో సమకాలీనంగా వస్తున్న మార్పులను పాఠ్యాంశాల్లో జొప్పిస్తుండడంతో పాటు, కొత్త పరిశోధనలకు, అధ్యయనాలకు కూడా ఇందులో అవకాశం కల్పించాల్సి ఉంటుంది. వీటినన్నిటినీ విద్యార్థులతో తప్పనిసరిగా పంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చరిత్ర, రాజనీతి శాస్త్రాలకు సంబంధించిన అంశాలను తప్పకుండా నిత్యనూతనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ బృహత్తర కార్యక్రమంలో నిమగ్నమైన విద్యామండలికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించడానికి, దానికి ప్రయత్నాలకు దురుద్దేశాలు అంటగట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది చేస్తున్న మార్పులు, చేర్పులు, తొలగింపులు పరిశోధకులు, మేధావుల అంచనాలకు అనుగుణంగా లేవంటూ వివిధ సంస్థలు, వర్గాలు విమర్శలు ప్రారంభించాయి.
ఉదాహరణకు, ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారన్న సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుంచి తొలగించడం జరిగింది. హరప్పా ప్రజలకు, వేద కాల ప్రజలకు మధ్య ఒక కొనసాగింపు సంబంధాలున్నాయని, ఇందుకు ఆ ప్రాంతాలలో లభించిన డి.ఎన్‌.ఏ కణాలు కూడా దోహదం చేస్తున్నాయని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ అంశాన్ని చరిత్ర పాఠ్య పుస్తకాలలో చేర్చడానికి ప్రస్తుత మేధావి వర్గాలు అభ్యంతరం చెబుతున్నాయి. పలువురు పరిశోధకులు ఈ ఆర్య వలస సిద్ధాంతాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నప్పటికీ, వలసవాద చరిత్రకారులు, వామపక్ష భావజాల ప్రభావితులైన చరిత్రకారులు దీనిని గట్టిగా సమర్థిస్తూనే ఉన్నారు. ఇటువంటి వివాదాస్పద అంశాలపై మరింత లోతుగా పరిశోధన జరగాల్సి ఉంది. ఈ అంశాన్ని విద్యార్థులకే వదిలివేసే ఉద్దేశంతో విద్యావిషయక పరిశోధన మండలి ఇందుకు సంబంధించి పాఠ్యాంశాలను చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చడం జరిగింది.

- Advertisement -

అయోధ్య ఆలయ నిర్మాణాన్ని కూడా ఒక పాఠ్యాంశంగా ఇందులో చేర్చడం జరిగింది. అయితే, బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని ఇందులో ప్రస్తావించలేదు. పైగా, రామమందిర నిర్మాణానికి దారి తీసిన పరిస్థితులను ఇందులో ప్రస్తావించడంతో పాటు దేశ లౌకక వాద మార్గాన్ని ఇది ఏ విధంగా మార్చిందో వివరించడం జరిగింది.
మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయడం, 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వంటి అంశాలను మార్చి రాయడం జరిగింది. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల్లోని పేదరికం గురించి కనీస ప్రస్తావన కూడా లేదని కొందరు మేధావులు విమర్శించాయి. సంఘ్‌ పరివార్‌ రాజకీయ, సైద్ధాంతిక భావజాలానికి తగ్గట్టుగా చరిత్ర, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం అంశాలను మార్చడం జరుగుతోందని, ఇటువంటి భావజాలాన్ని విద్యార్థుల మీద రుద్దడం భావ్యం కాదని వామపక్ష భావజాల మేధో సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి సంస్థ, బీజేపీ, సంఘ్‌ పరివార్‌ సంస్థలు తమ ఆశలు, ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా చరిత్రను, రాజనీతి శాస్త్రాన్ని మార్చడం భావ్యంగా లేదని, వీటిని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఈ మేధో వర్గాలు చెబుతున్నాయి. ఇది చక్కదిద్దే చర్యే తప్ప తమ భావజాలాన్ని ఎక్కడా ప్రవేశపెట్టడం లేదని బీజేపీ అనేక పర్యాయాలు స్పష్టం చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News