Monday, May 20, 2024
Homeఓపన్ పేజ్Indians believe in plurality: బీజేపీకి ఓకే, హిందుత్వకు కాదు!

Indians believe in plurality: బీజేపీకి ఓకే, హిందుత్వకు కాదు!

దేశం అన్ని మతాలకు చెందినది: 79% ఓటర్స్

ఎన్నికల ముందు చోటు చేసుకుంటున్న సర్వేల్లో అనేక కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. కేవలం ఎన్నికల ఫలితాల గురించే కాక, ఇతర రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో ఓటర్ల మనోభావాలు కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నాయి. త్వరలో లోక్‌ సభ ఎన్నికలు జరగబోతున్న సమయంలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విషయాలకు సంబంధించి సి.ఎస్‌.డి.ఎస్‌-లోక్‌ నీతి ఇటీవల జరిపిన దేశవ్యాప్త ఓటర్ల సర్వేలో అనేక కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రధానంగా పది వేల మంది ఓటర్ల మనోభావాలను, ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ, దాదాపు వంద కోట్ల మంది మనోభావాలకు ఇది నిజంగానే అద్దం పడుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయమే. అయితే, ఇందులోని కొన్ని అభిప్రాయాలను ఎన్నికలకు సంబంధం లేకుండా పరిశీలించాల్సి ఉంటుంది. ఎన్నికలకు సంబంధం లేకుండా ఓటర్లు వ్యక్తం చేసిన ఇతర అభిప్రాయాలను మాత్రమే ఎక్కువగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓటింగ్‌ ఉద్దేశాల మీద నేరుగా ప్రశ్నించడం జరిగింది. ఓటింగు సరళిని పరోక్షంగా ప్రభావితం చేసే మత, సామాజిక, రాజకీయ అంశాలను కూడా ప్రశ్నించడం, పరిశీలించడం, జరిగింది. ఊహించిన విధంగానే రాజకీయాలకు, ఎన్నికలకు అతీతంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ అధ్యయనంలో వెల్లడయ్యాయి.
విచిత్రమేమిటంటే, 79 శాతం మంది ఓటర్లు ఈ దేశం అన్ని మతాలకు చెందినదనీ, కేవలం హిందువులకు మాత్రమే చెందినది కాదనీ స్పష్టం చేశారు. పదకొండు శాతం మంది ఈ దేశం హిందువులకు మాత్రమే చెందినదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి పది మంది హిందువుల్లో ఎనిమిది మంది భారతదేశం బహుళ సంస్కృతుల, బహుళ మతాల సమ్మేళనమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశం ఒక వైవిధ్యభరితమైన దేశమనీ, రాజకీయ నాయకులు ఎంతగా మత పునరేకీకరణకు ప్రయత్నం చేస్తున్నా ప్రజల్లో మాత్రం అటువంటి అభిప్రాయమేమీ లేదనీ ఈ అధ్యయనంలో వెల్లడయింది. అనేక సంవత్సరాలుగా భారతదేశం పరమత సహనానికి పుట్టినిల్లుగా ఉంటోందని కూడా ఓటర్లు భావిస్తున్నారు. అత్యధిక సంఖ్యాక ఓటర్లు ఇది కేవలం హిందువులకు చెందిన దేశం మాత్రమే కాదని స్పష్టం చేయడాన్ని బట్టి, వారు మత రాజకీయాలను తిరస్కరిస్తున్నట్టు అర్థమవుతోంది.
అదే సమయంలో నలభై శాతం మంది ఓటర్లు హిందువుల పార్టీగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీని సమర్థించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతర రాజకీయ, ఆర్థిక, సామాజిక, అంతర్జాతీయ అంశాల్లో బీజేపీ ప్రజాభీష్టానికి తగ్గట్టుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం కూడా ఓటర్ల నుంచి వ్యక్తమైంది. మొత్తం మీద దేశ ప్రజలు మతాన్ని, ఇతర అంశాలను వేర్వేరుగా చూస్తున్నట్టు కూడా అవగతమవుతోంది. అత్యధిక సంఖ్యాక ఓటర్లకు హిందుత్వకంటే నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల, దేశ భద్రత పట్ల, దేశాభివృద్ధి పట్ల మాత్రమే నమ్మకం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఇతర అంశాలన్నిటి కంటే ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు అర్థమవుతోంది. హిందుత్వ, హిందూ దేశం వంటి అంశాలకు ఈ అధ్యయనంలో ఎక్కువగా మద్దతు లభించ లేదు. భారతదేశమనేది దేశ ప్రజలందరికీ చెందిన దేశమని, ఈ దేశం బహుళ సంస్కృతుల, బహుళ మతాల దేశంగానే కొనసాగాలని తాము కోరుకుంటున్నామని ఓటర్లు చెప్పడాన్ని బట్టి, దేశంలో మత రాజకీయాలకు స్థానం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాక, మతపరమైన భావాలను, మతోన్మాద వైఖరులను ప్రజల్లో ఎక్కువ మంది ప్రోత్సహించడం లేదని, ఇటువంటి భావనలకు ప్రజల నుంచి అతి తక్కువగానే మద్దతు లభిస్తోందని అర్థమవుతోంది. ప్రస్తుతం మత వ్యవహారాలకు సంబంధించి దేశంలో ఎంతో ఎక్కువగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రజల మనోభావాలు మాత్రం మతానికి, మతోన్మాదానికి అతీతంగా మాత్రమే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. ఇది కేవలం హిందువులకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా పరిగణించకూడదని, ముస్లిం, క్రైస్తవ మతాలకు కూడా ఇది వర్తిస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వే సంస్థ ప్రశ్నించిన ఓటర్లలో అన్ని మతాల వారూ ఉన్నందువల్ల, ఓటర్ల మనోభావాలను ఓ ఒక్క మతానికో వర్తింపజేయ రాదని సర్వే సంస్థ ప్రకటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News