Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Opposition: నోరు పారేసుకోవటమే ప్రతిపక్షాల విధా ?

Opposition: నోరు పారేసుకోవటమే ప్రతిపక్షాల విధా ?

భారతీయ జనతా పార్టీపై రోజూ పరుష పదాలతో విరుచుకు పడటమే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దినచర్యగా మారిందనే విమర్శలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఖర్గే మాటలు మిగతా నేతలకంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. పైగా ఈమధ్య ఆయన తన మాటలకు బాగా పదును పెట్టి గాంధీ కుటుంబాన్ని మరింత ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నట్టు సొంత పార్టీలోనే గట్టిగా కామెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్రం దగ్గర భారీ వాషింగ్ మెషీన్లు ఉన్నాయి ఎంత పెద్ద మరకలైనా, మొండి మరకలైనా అవి క్లీన్ చేసి మరకలే లేకుండా చేస్తాయని ఖర్గే చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆగ్రహం తెప్పించాయి. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖర్గే చేసిన ప్రసంగం శ్రేణుల్లో జోష్ తెప్పించకపోగా పార్టీలో భిన్నాభిప్రాయాలకు దారి తీయటం విశేషం.

అబద్ధాలకోరుల చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం కోసం మనందరం సమిష్టిగా పోరడదాం అంటూ ఆయన చేసిన ప్రసంగం కాస్త విపరీత ధరోణులను ధ్వనించిందనే వాదనలు లేకపోలేదు. ప్రతిపక్షం అంటే సిద్ధాంతాల ఆధారంగా, ప్రజా సమస్యలపై పోరాడటంలో ఓ నిబద్ధత, విధానం ఉండాలి కానీ ఇలా ఊరికే నోరు పారేసుకుని, ప్రసంగించటంతోనే ప్రజాపక్షం వహించినట్టు ఫీల్ అయిపోతే ఎలా అని రాజకీయ పండితులు సైతం పెదవి విరిచేలా గ్రాండ్ ఓల్డ్ పార్టీ తయారైంది. కుటుంబ పాలనలానే, కుటుంబ రాజకీయాల బారిన పడిన భారత రాజకీయాల పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధినేత బాధ్యతలు చేపట్టి రోజులు గడుస్తున్నా సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్ వంటి వారు కాంగ్రెస్ పార్టీ ఇంకా గాంధీల చేతుల్లోనే ఉందని నోరుజారి, అసలు విషయం అధికారికంగా చెప్పేశారు. వ్యక్తి పూజ, కుటుంబ పాలన ఇవన్నీ ప్రజాస్వామ్య జవసత్వాలను బలహీనం చేస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు 90వ వడిలో పడిన, శారీరకంగా చురుకుగా కూడా లేని నేతలు కూడా ఇంకా రాజకీయాల్లో చక్రం తిప్పుతూ, ఎన్నికల్లో పోటీ చేస్తుండటం విశేషం.

బలమైన, శక్తివంతమైన, ప్రజాపక్షపాతం మాత్రమే వహించే ప్రతిపక్ష పార్టీ ఏ ప్రజాస్వామ్య దేశానికైనా అతి పెద్ద ఆయుధం, ఆస్తి. అలాంటి ప్రతిపక్షం ఇలా పేపర్ పులిలా స్టేట్మెంట్లకే పరిమితం అయితే ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమిటన్నది ప్రతిపక్ష కాంగ్రెస్ తెలుసుకునేదెప్పుడో. రాష్ట్రాల్లోనూ అంతే ఇదే తంతే కనిపిస్తోంది. నిజానికి ఈ విషయంలో అటు కాంగ్రెస్ అయినా మిగతా ప్రాంతీయ పార్టీలన్నా అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్లాయంటే అంతే ఇక ఐదేళ్లు స్తబ్దుగా ఉండిపోతున్నాయి. ఏదో రెండు పరామర్శలు, నాలుగు శుభాకాంక్షలు, పది ట్వీట్లన్నట్టు పరిస్థితి తయారైంది. మరికొందరు సీనియర్ నేతలైతే తాము ఓటమిపాలైనా..తమ పార్టీ అధికారం చేపట్టలేకపోయినా ఫారిన్ వెళ్లి సెటిల్ అయిపోతారు. మళ్లీ ఎన్నికల టైంలోకానీ వాళ్లు ప్రజల్లోకి రారు, కనిపించరు.

ఇక ఎన్నికలు దగ్గరపడేకొద్దీ మళ్లీ ప్రతిపక్షాలు ప్రజల్లోకి రావటం ట్రెండింగ్ పాలిటిక్స్ గా మారింది. ఐదేళ్లు తాము అధికారానికి దూరమయ్యామని, ప్రజల తిరస్కరణకు కారణాలు తెలుసుకుని, వాటికి పరిష్కారాలు అమలు చేయటం అటుంచి ఏదో ఐదేళ్లపాటు లాంగ్ లీవ్ అన్నట్టు ఈ గ్యాప్ ను ఎంజాయ్ చేస్తాయి విపక్షాలు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పాదయాత్రలు, బస్సు యాత్రలు, రైలు యాత్రలు, ప్రజాపక్షం వంటి ప్రోగ్రామ్స్ పేరుతో మళ్లీ సందడి చేయటం షురు చేస్తారు. సోషల్ మీడియా సెల్స్ ను ఏర్పాటు చేసుకుని, వార్ రూములు, ఎన్నికల వ్యూహకర్తలు, మీడియా హౌసులను మేనేజ్ చేసేస్తూ ఎలాగోలా మళ్లీ గెలిచేందుకు కుస్తీ పడటం పార్టీలకు అలవాటైపోయింది. ఇది ఓ సైకిల్ లా రిపీట్ అవుతోంది.

రాజస్థాన్, హిమాచల్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల రాజకీయ సెంటిమెంట్ ల బాటలో నడుస్తున్న ప్రజలు కూడా ఐదేళ్ల తరువాత ప్రభుత్వాన్ని మార్చేయటం, ప్రతిపక్షానికి ఛాన్స్ ఇచ్చేయటం మనదగ్గర రొటీన్ పొలిటికల్ ఫార్ములాగా మారింది. ఎలాగూ ఐదేళ్ల తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అనే భరోసా రాజకీయ పార్టీలో బాగా పెరుగుతోంది. దీంతో ప్రజా సమస్యలపై గళమెత్తి, పోరాడి, వాటికి పరిష్కారాలు వెతికే రాజకీయ అండ సామాన్యులకు కరువైపోయింది.

ఇదిగో ఇలా కాంగ్రెస్ పార్టీలానే సంక్షోభంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదం అనే భారీ డైలాగులు, స్పీచులు ప్రజలముందు ఊదరగొట్టడమే ప్రతిపక్షాలకున్న ఏకైక విధిగా, బాధ్యతగా ఫీలయ్యే పార్టీలే అన్నీనూ. కానీ రాజకీయ పార్టీల పక్షంలో ఆలోచిస్తే పార్టీ నడపడం, ప్రచారాలు, నిత్యం ప్రజల్లో ఉండి పోరాడాలంటే అందుకు మందీ, మార్బలం, క్యాడర్, జెండాలు, జెండా మోసేవాళ్లు ..ఇలా చాలామంది సైన్యం అవసరం. మరి వారందరినీ ప్రతిపక్ష పార్టీ ఐదేళ్లపాటు పోషించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే అధికారం చేజారగానే సైలెంట్ గా ఉండి, అప్పుడప్పుడు ఖండనలు, పత్రికా ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకుంటాయి. ఎన్నికల సమయంలో ఎలాగూ కార్పొరేట్ ఫండ్స్ భారీగా వస్తాయి కనుక ఎలక్షన్ బాండ్స్ ద్వారా నిధుల ప్రవాహంతో ఓటర్లకు గాలం వేసే పని మళ్లీ స్టార్ట్ చేస్తాయి పార్టీలు. అందుకే ఇటు సామాన్యులు, అటు రాజకీయ పండితులు ఈ మూస ధోరణిలోని పార్టీ వ్యవహార శైలిని పలు వేదికల మీద ఈమధ్య ఘాటుగా ఎండగడుతున్నాయి. అయినా ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేతల్లో ఎలాంటి చలనం రావటం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News