Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Pak crisis: సంక్షోభాల గుప్పిట్లో పాకిస్థాన్‌ విలవిల

Pak crisis: సంక్షోభాల గుప్పిట్లో పాకిస్థాన్‌ విలవిల

మొదటి నుంచీ పాకిస్థాన్‌ తన ఆర్థికాభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఇప్పుడు దాని విషఫలితాలను అనుభవిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ అనేకానేక సంక్షోభాల్లో కూరుకుపోయి ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా సంక్షోభాలు చుట్టుముట్టడం కాదు. అన్నీ ఒక్కసారే చుట్టుముట్టి ఈ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశం ఏ సంక్షోభాన్నీ, ఏ సమస్యనూ పరిష్కరించుకోలేని పరిస్థితిలో ఉంది. ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా అడంగుకు చేరిందంటే, పాకిస్థాన్‌ కన్నా శ్రీలంకే ఆర్థికంగా నయమనిపిస్తోంది. రెండు రకాలైన ఆర్థిక లోట్లు పాక్‌ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఏ దేశమైనా ముందుకు వచ్చి ఆదుకుంటే తప్ప ఈ దేశం కోలుకునేలా కనిపించడం లేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్‌) సంస్థకు అది వరుసగా అభ్యర్థనలు పంపిస్తూనే ఉంది. ప్రస్తుతం పాకిస్థాస్లో పర్యటిస్తున్న ఈ సంస్థ ప్రతినిధులు ఎంత వరకూ తమ కరుణా కటాక్షాలను ఈ దేశం మీద కురిపిస్తారో తెలియదు. మరి కొన్ని వితరణ దేశాలకు కూడా అది అభ్యర్ధనలు పంపించింది. ప్రస్తుత ఆర్ధిక మాంద్య పరిస్థితుల్లో ఏ దేశం పాకిస్థాన్‌ను గట్టెక్కిస్తుందన్నది వేచి చూడాల్సిన విషయం.
తాము ఆర్థిక సహాయం చేయాలన్న పక్షంలో తాము సూచించే పొదుపు సూత్రాలను, ఆంక్షలను పాక్‌ తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని, ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధిసంస్థ ప్రతినిధుల బృందం అన్యాపదేశంగా సూచించింది. ముఖ్యంగా ద్రవ్య పరిస్థితిని స్థిరీకరించుకోవాలని అది స్పష్టం చేసింది. ఐ.ఎం.ఎఫ్‌ సూచించిన నియమ నిబంధనలను పాటించే పక్షంలో పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు దేశంలో ఏమాత్రం విలువ లేకుండాపోతుంది. ఐ.ఎం.ఎఫ్‌ బృందం ఈ దేశంలో అడుగుపెట్టడాదనికి కొద్ది రోజుల ముందు షరీఫ్‌ ప్రభుత్వం మారక రేటు మీద ఉన్న నియంత్రణలను సడలించింది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చుకుంటే పాకిస్థాన్‌ రూపాయి విలువ అధ్వాన దశకు చేరుకుంది. ఫలితంగా అమెరికా నుంచి జరిగే దిగుమతులకు భారీగా నిధులు చెల్లించాల్సి ఉంటుంది. చాలావరకు ఎగుమతులకు కూడా ఆస్కారం లేకుండాపోయింది. పాక్‌ ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది.
గోరుచుట్టుపై రోకటి పోటు మాదిరిగా గత ఏడాది చివర్లో పాకిస్థాన్లోని అనేక ప్రాంతాలను భీకర వరదలు, తుఫానులు చుట్టుముట్టి అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడా గోధుమ గింజ అనేది కనిపించడం లేదంటే అందులో అతిశయోక్తేమీ లేదు. నిత్యావసర వస్తువులకు తీవ్రస్థాయిలో కొరత ఏర్పడింది. చివరికి విద్యుచ్ఛక్తి కూడా చాలినంతగా ఉత్పత్తి కావడం లేదు. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు కనీసమాత్రంగా నిలదొక్కుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే, విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. విద్యుదుత్పత్తి సంస్థల దగ్గర ఇంధనం లేకుండా పోయింది. ఇంధనం కొనడానికి ఖజానాలో నిధులు లేవు. విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటిపోయాయి. విదేశీ మారక నిల్వలకు సంబంధించినంత వరకూ పాకిస్థాన్‌ ప్రస్తుతం ప్రమాదం అంచున ఉంది.
అడకత్తెరలో షరీఫ్‌
తప్పనిసరి పరిస్థితుల్లో షరీఫ్‌ ప్రభుత్వం గతవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాల్సి వచ్చింది. దీంతో సామాన్యుడి పరిస్థితి మరీ అధోగతిలో పడింది. దీని మీద దేశంలో అనేక ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. గత నెల అతికష్టం మీద యు.ఎ.ఇ నుంచి 300 కోట్ల డాలర్లసహాయ ప్యాకేజీని పొందగలిగింది. అయితే, ఇందులో 200 కోట్ల డాలర్లను వస్తురూపేణా చెల్లించడం జరుగుతుంది. దాంతో పాకిస్థాన్‌ కొద్దిగా తెరిపిన పడింది. కానీ, ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. వాస్తవానికి శ్రీలంక మాదిరిగానే పాకిస్థాన్‌ కూడా అడపాదడపా చైనా నుంచి సహాయం పొందుతుంటుంది. అయితే, పాకిస్థాన్‌ ఆ దేశానికి ఇప్పటికే 3 వేల కోట్ల డాలర్ల సహాయం పొందింది. ఇక చైనా సహాయం చేస్తుందా లేదా అన్నది అంతుబట్టకుండా ఉంది. విదేశా లకు పాకిస్థాన్‌ చెల్లించాల్సిన మొత్తం రుణంలో ఇది మూడవ వంతు. పాకిస్థాన్‌ ఈ మొత్తాన్ని చెల్లించలేని స్థితిలో ఉంది. పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితిని చైనా ప్రభుత్వం గమనిస్తూ ఉందే తప్ప ఆర్థిక సహాయం విషయంలో ఎక్కడా మాట ఇవ్వడం లేదు.
గతంలో 2019 ప్రాంతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఐ.ఎం.ఐ నుంచి 6.5 వందల కోట్ల డాలర్ల సహాయం పొందగలిగింది. ఈ మొత్తాన్ని ఐ.ఎం.ఎఫ్‌ విడతలవారీగా చెల్లించడం ప్రారంభించింది. అయితే, తాము పెట్టిన నియమ నిబంధనలను పాకిస్థాన్‌ మధ్యలో గాలికి వదిలే సరికి ఆ సంస్థ ఈ రుణ సహాయాన్ని మధ్యలోనే ఆపేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పదవి నుంచి దిగిపోయి, షరీఫ్‌ అధికారం చేపట్టిన తర్వాత ఈ రుణ సహాయాన్ని కొనసాగించడానికి ఐ.ఎం.ఎఫ్‌ ముందుకు వచ్చింది. అయితే, అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాక పోవడంతో ఈ సంస్థ ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. ఇక, ఈలోగా మళ్లీ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రాభవం పెరుగుతుండడం గమనించి షరీఫ్‌ కూడా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక మంచి కార్యదక్షుడుగా, పాలకుడుగా పేరున్న షరీఫ్‌ ప్రస్తుతం అచేతనంగా, నిష్క్రియగా ఉండిపోవాల్సి వస్తోంది. పైగా, కొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఆయనలో ఇమ్రాన్‌ అంటే భయం పట్టుకుంది.
పూర్తి బాధ్యత సైన్యానిదే
ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు సైన్యం కూడా ఆయనతో సమానంగా అధికారం చెలాయించింది. అప్పట్లో దీన్ని సంకర ప్రభుత్వంగా అభివర్ణించేవారు. ఇమ్రాన్‌ అసమర్థ పాలనను గమనించిన సైన్యం మధ్య మధ్య ఆయనను మించి కూడా అధికారం చెలాయించడం జరిగేది. ఆ తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ఆయన తప్పులను, పొరపాట్లను ఆయనకే వదిలిపెట్టి, ఒప్పులకు మాత్రం బాధ్యతను తీసుకుంది. ప్రధాన సైనికాధికారి జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వా ఇప్పటికీ తెర వెనుక నుంచి చక్రం తిప్పుతూనే ఉన్నారు. ఒక పక్క ఆర్థిక సమస్యలు, సంక్షోభాలతో దేశం అతలాకుతలం అవుతుండగా మరో పక్క పాకిస్థాన్‌ సైన్యం దేశంలోని ఉగ్రవాదులకు శిక్షణను, ఆర్థిక సహాయాన్ని గౌరవ మర్యాదలను కొనసాగిస్తూనే ఉంది. సుశిక్షితులైన ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించడానికి అది మార్గాలు వెతుకుతూనే ఉంది. నిజానికి షరీఫ్‌ ప్రభుత్వం ఇటీవలే భారత్‌ నుంచి సహాయ సహకారాలు కోరింది. భారత్‌ సహాయంతో ఆర్థిక పరిస్థితిని కొంతవరకైనా చక్యబెట్టుకోవాలని షరీఫ్‌ ప్రభుత్వం చాలా వరకు దిగివచ్చింది.
ఇక మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టు, ఇటీవల పాకిస్థాన్లోని తహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పెషావర్‌లోని ఒక మసీదు మీద బాంబుల వర్షం కురిపించడంతో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం షరీఫ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠను మరింతగా దిగజార్చింది. నిజానికి, ఈ సంఘటనకు పాక్‌ సైన్యం కూడా కొంత వరకూ బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ, ఎప్పటి మాదిరిగానే సైన్యం ఇందుకు షరీఫ్‌ ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేసింది. ఈ ఒక్క సంఘటన విషయంలోనే కాదు, దేశం ఈ విధంగా దిగజారిపో వడానికి పూర్తిగా పాక్‌ సైన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాకిస్థాన్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆర్థికాభివృద్ధి మీద కాకుండా, ఉగ్రవాద పోషణ మీద దృష్టి పెట్టేటట్టు చేసింది సైన్యమేనన్న విషయం అందరికీ తెలిసిందే. భారత్ తో స్నేహ సంబంధాలు వృద్ధి చెంది ఉంటే పాక్‌ ఇంత అధ్వాన స్థితిలో ఉండేది కాదని ఇమ్రాన్‌ ఖాన్‌, షరీఫ్ లు స్వయంగా అంగీకరించడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News