సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యమంత్రులు చాలా శక్తిమంతులుగా ఉంటారు. జాతీయ పార్టీల ముఖ్యమంత్రులు అంతగా సొంత నిర్ణయాలు తీసుకోలేరు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు మాత్రం వేరే లెవెల్లో ఉంటోంది. సంధ్య థియేటర్ ఉదంతంలో ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్టు లాంటి పరిణామాలు రేవంత్ ఆదేశాలు లేకుండా జరిగేవి కావు. అయితే, ఇలాంటి విషయాల్లో టాలీవుడ్‌ను తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని రేవంత్‌కు చెప్పిందెవరు? ఆయన వెనకుండి ఇదంతా నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? ఒక జాతీయ పార్టీ, అందునా తరచు ముఖ్యమంత్రులను మారుస్తారన్న అపప్రథ ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం.. ఇంత సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్నారంటే ఆయనకు పైనుంచి ఎవరి అండదండలు ఉన్నాయి? ఇంకెవరో కాదు.. స్వయానా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. గతంలో కూడా హైడ్రా కూల్చివేతల సమయంలో కాకినాడ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజుకు చెందిన ఒక భవనాన్ని కూల్చేశారు. దానిపై ఆయన పంచాయితీ పెట్టి రాహుల్ గాంధీ వరకు తీసుకెళ్లారు. అప్పుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా.. పళ్లంరాజు గతంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఏవేం వ్యాపారాలు, వ్యవహారాలు చేస్తున్నారో కుండ బద్దలుకొట్టి మరీ చెప్పడంతో రాహుల్ గాంధీ తన ఓటును రేవంత్‌కే వేశారు. ఇకముందు ఇలాంటివి తన వద్దకు తేవొద్దని చెప్పారు. నిజానికి అప్పుడే కాదు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఆశీస్సులు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, సీనియర్ల నుంచి మాత్రం ఇబ్బందులు లేకుండా చూడాలని అప్పట్లో రాహుల్ గాంధీని రేవంత్ కోరారని.. అప్పట్నుంచే ఆయనకు రాహుల్ అండదండలు గట్టిగా అందడం మొదలైందని కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత వర్గాలు స్వయంగా జాతీయ స్థాయి జర్నలిస్టుల వద్ద ప్రస్తావిస్తున్న విషయం గమనార్హం. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లలో కొంతమంది గాంధీ కుటుంబానికి వీరవిధేయులుగా ముద్రపడినా కూడా.. వాళ్ల వల్ల పార్టీకి కలిగే ప్రయోజనం ఎంతనే విషయాన్ని రాహుల్ బేరీజు వేసుకున్నారని, అప్పటినుంచి క్రమంగా తనకంటూ రాష్ట్రాల్లో కొంతమంది నాయకులు విశ్వాసపాత్రులు ఉండాలన్న లెక్కతో రేవంత్ రెడ్డిని ప్రోత్సహించడం మొదలుపెట్టారని ఆ వర్గాలు అన్నాయి.
ఇక సంధ్య థియేటర్ వ్యవహారానికి వస్తే.. రేవంత్ రెడ్డి అంత తీవ్రంగా స్పందించడానికి, ముఖ్యంగా అసెంబ్లీలో సైతం దీని గురించి స్వయంగా ఆయనే మాట్లాడడంతో పాటు ఇతర మంత్రులు సైతం ఆ విషయం మీద కాస్త గట్టిగానే స్పందించడానికి చాలా కారణాలే ఉన్నాయి. కేవలం ఆ ఒక్క సంఘటన మాత్రమే కాదు, గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నారు. గతంలో ఖమ్మం జిల్లాలో భారీ స్థాయిలో వరదలు వచ్చినప్పుడు గానీ, ఇతరత్రా విపత్తుల సమయంలో గానీ టాలీవుడ్ పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు తీసుకుంటూ.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుతూ.. సినిమాలు తీసి, వాటితో లాభాలు పొందుతున్న చాలామంది పెద్దమనుషులు ఇప్పటికీ బీఆర్ఎస్ వైపే కాస్త మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. దానికితోడు పుష్ప సినిమా ఫంక్షన్లో హీరో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం, ఆ విషయం వీడియో రూపంలో విపరీతంగా వైరల్ అవుతున్న.. దానికి, అల్లు అర్జున్ మీద కేసు నమోదుకావడం, ఆయన అరెస్టు కావడం లాంటి పరిణామాలకు సంబంధం లేదని పరిశ్రమ నుంచి ఏ ఒక్కరూ ఖండించలేదు. అలా ఖండించకపోవడం రేవంత్‌రెడ్డిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకునే స్థాయి నుంచి ఎప్పుడో పైకి ఎదిగిన నాయకుడాయన. అయినా కూడా దాన్ని చిలవలు పలువలుగా ప్రచారం చేస్తుంటే.. అసలు సినీ ప్రపంచం నుంచి ఒక్కరు కూడా దాన్ని ఖండించిన పాపాన పోలేదు.
చివరకు బెనిఫిట్ షోలు, టికెట్ ఛార్జీల పెంపు లాంటివి ఉండబోవని గట్టిగా అసెంబ్లీలో చెప్పిన తర్వాత అప్పుడు సినీ ప్రముఖులంతా కట్టగట్టుకుని మరీ రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. అందులోనూ స్వయంగా కింగ్ నాగార్జున ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించారు. దగ్గుబాటి సురేష్‌బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, అల్లు అరవింద్ సహా పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు, ఇంకా ఎంతోమంది నటులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రభుత్వం వైపు నుంచి కానీ టాలీవుడ్ ప్రముఖుల వైపు నుంచి కానీ ఎటువంటి ఎజెండా లేకపోవటం ఒక విశేషం. సమావేశం మొదలైన కొన్ని క్షణాల్లోనే రేవంత్ సూటిగా ఇండస్ట్రీకి మా ప్రభుత్వం ఎంతో చేసింది. గతంలోనూ ఇండస్ట్రీకి మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. తాజాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టికెట్ ధరలు పెంచుకోవటానికి 8 జీవోలు ఇచ్చాం. ఈ జీవోల న్నీ లంచం తీసుకుని టికెట్ ధరలు పెంచారని వచ్చిన తప్పు డు వార్తల ప్రచారం ఇండస్ట్రీ ప్రముఖులతో సీఎం మాట్లాడి నట్టు తమ్మారెడ్డి భరద్వాజ మీడి యాకు వివరించారు. ఇలాంటి ప్రశ్నలు ఆ ప్రముఖులను ఆ నాలుగు గోడల మధ్య సీఎం రేవంత్ సూటిగా అడిగినట్టు సమాచారం. అందులో రేవంత్ రెడ్డి మాత్రం తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్లు వాళ్లకు చెప్పేశారు. పరిశ్రమకు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని, అయితే అదే సమయంలో అటు నుంచి కూడా ప్రతిస్పందన ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో తాము వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నామని, అలాంటప్పుడు పబ్లిసిటీ లేకపోతే ప్రజలు సినిమాకు అంతగా రారని మురళీ మోహన్ లాంటి పెద్ద మనిషి అనడం మాత్రం అంత సబబుగా అనిపించడం లేదు. పెద్ద సినిమా అని అనుకున్నప్పుడల్లా ఇలా పెద్ద పెద్ద ఈవెంట్లు పెడతామని చెప్పడం దేనికి సూచనో ఆయనో ఆలోచించుకోవాలి. నిజానికి దేవర సినిమా ప్రమోషన్ కోసం తలపెట్టిన పెద్ద కార్యక్రమానికి అనుకున్న దానికంటే చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని తెలిసి ఏకంగా ఆ కార్యక్రమాన్నే జూనియర్ ఎన్టీఆర్ రద్దు చేసుకున్నారు. అంతమంది వస్తే అదుపు చేయడం కష్టమని, ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే అందరూ బాధపడతారని ఆయన ఆ పనిచేశారు. సినిమా కలెక్షన్లు రావడం ముఖ్యమా.. ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యమా అన్న ప్రశ్న వస్తే దేనికి ఓటేస్తారో మురళీమోహన్ లాంటి పెద్దమనుషులు తామే నిర్ణయించుకోవాలి. అసలు సినిమాలు అంటేనే వక్రీకరణ చాలా తీవ్రంగా జరుగుతోంది. ఒకప్పటి దాన వీర శూర కర్ణతో మొదలుపెడితే, తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా వరకు అన్నింటిలోనూ పురాణాలను, చరిత్రను విపరీతంగా వక్రీకరిస్తున్నారు. అసలు వ్యాసుడు రాసిన మహాభారతానికి, దాన వీర శూర కర్ణలో కర్ణుడి పాత్రకు ఎక్కడా పోలిక లేదన్నది సుస్పష్టం. ఈ విషయం పురాణ పండితులను అడిగితే తెలుస్తుంది. అలాగే కల్కి సినిమాలోనూ ఇష్టం వచ్చినట్లు పురాణాలను వక్రీకరించి తమకు చేతికి వచ్చినట్లు భాష్యం రాసేసుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తే, ఒక మాదిరిగా చరిత్ర తెలిసినవారు ఎవరైనా కూడా.. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పోలీసు విభాగంలో పనిచేశారంటే నమ్ముతారా? అలాగే తెలంగాణ స్వాతంత్య్రపోరాట యోధుడు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒక కాలంలోని వాళ్లేనా? వాళ్లిద్దరూ అసలు కలిసే అవకాశం అన్నది ఉంటుందా? ఇలాంటి చరిత్ర వక్రీకరణలతో వందల కోట్లు పెట్టి సినిమాలు తీయడం, మళ్లీ వాటికి కలెక్షన్లు కావాలని మొదటి వారంలోనే విపరీతంగా టికెట్ ధరలు పెంచేసుకోవడం, దానికోసం ప్రభుత్వాలను ఆశ్రయించడం ఇప్పుడు మామూలైపోయింది. ఇలా ధరలు పెంచడం వల్ల మొదటి రెండు మూడు వారాల పాటు సామాన్యులు అన్నవాళ్లు థియేటర్ల వైపు వెళ్లడానికే భయపడాల్సిన పరిస్థితిని తెలుగు సినిమా పరిశ్రమ తీసుకొచ్చింది. పుష్ప2 సినిమానే తీసుకుంటే.. ఒక కుంటుంబంలో నలుగురు కలిసి మొదటి 15 రోజుల్లో సినిమాకు వెళ్లాలంటే దాదాపు రూ.5వేలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. అంత పెట్టి సినిమా చూసే పరిస్థితి ఎంతమందికి ఉంటుంది? అంతేకాదు, ఈ పుష్ప2 సినిమాలో హీరో మూత్రవిసర్జన చేసిన చెరువులో నీటిని ఒక ఐపీఎస్ అధికారి తాగినట్లు చూపిస్తారు. అసలు ఐపీఎస్ వ్యవస్థను ఇంతలా దిగజా ర్చాలని ఆ దర్శకుడికి, రచయితకు, నటులకు ఎలా అనిపించింది. ఇదే సినిమాను మళయాళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అక్కడ రూ.25 కోట్లు పెట్టి సినిమా కొంటే, దానికి రూ.5 కోట్లు కూడా రాలేదు. దాంతో చివరకు మళ్లీ ఆ దృశ్యాన్ని రీషూట్ చేసి అప్పుడు మళ్లీ అక్కడ విడుదల చేయాల్సి వచ్చింది. ఇలా ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామో కూడా చూడకుండా ఎడాపెడా సినిమాలు తీసిపారేస్తున్నారు.
చిరంజీవి ఎందుకు వెళ్లలేదు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలతో జరిగిన సమావేశానికి అగ్రనటుడు చిరంజీవి వెళ్లలేదు. దీనివెనుక ఆంతర్యం ఏంటని చాలామంది చర్చించుకుంటున్నారు. ఒకరిద్దరు నాతో కూడా ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎందుకంటే, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్దకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఇలాగే వెళ్లారు. అప్పుడు చిరంజీవి కూడా ఆ బృందంలో ఉన్నారు. అప్పుడు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందీ లేని చిరంజీవి.. ఇప్పుడు ఎందుకు రాలేదు? ముఖ్యమంత్రి వద్దకు ఎందుకు వెళ్లలేదు? ఈ ప్రశ్నకు చాలా సమాధానాలే వస్తున్నాయి. తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో ఈ మధ్యకాలంలో చిరంజీవి బాగా సన్నిహితంగానే ఉంటు న్నారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ నాయకుడే అని అందరూ అనుకుంటున్నా, ఆ పార్టీ కంటే జనసేనతోనే ఆయన రాసుకుపూసుకు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద తమ్ముడు నాగబాబుకు కూడా క్యాబినెట్ పదవి వస్తున్నందున ఈ బంధం మరింత బలోపేతం అవుతోంది. పవన్ కళ్యాణ్ బీజేపీకి బాగా దగ్గరగా ఉంటున్నారు. అందువల్ల చిరంజీవికి కూడా బీజేపీ మనోభావాలను, తద్వారా తన తమ్ముడి మనోభావాలను దెబ్బతీయకూడదన్న ఉద్దేశం ఉందో ఏమో.. అందుకనే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి వద్ద సమావేశానికి వెళ్లలేదేమో అని అంతా అనుకుంటున్నారు. ఫిల్మ్‍నగర్ టాక్ ప్రకారం తెలుగు పరిశ్ర మకు పెద్ద దిక్కు అవసరం ఉంది. గతంలో దాసరి నారాయణ రావు ఈ బాధ్యతను సమర్థవం తంగా నిర్వహి ంచారు. ఆయన స్థానంలో చిరంజీవి ఉంటారని అంతా ఆశిస్తున్నట్టుగా ఉంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం కొంత భిన్నంగానే కనిపిస్తు న్నది. తెలంగాణ సర్కారుకి టాలివుడ్‌కు మధ్య గ్యాప్ సమస్య తాత్కాలి కంగా సమసిపోయిందా ..? లేదా ..? అనేది సమీప భవిష్యత్‌లో చిరంజీవి మౌనం వీడటంపైనే ఉందనే వాదన ఒక వైపు ఉంది. ఇదంతా ఒక ఎతైతే ఇప్పటి వరకూ సీఎం రేవంత్ మాత్రం రేసుగుర్రంలా దూసుకునిపోతూ ఎక్కడిక్కడ చెక్ పెడుతున్నారు.
బాబుకు కోపం వచ్చింది
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కొంతమంది మంత్రుల వ్యవహారం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే కొందరిని తప్పించడానికి కూడా తాను వెనకాడబోనని స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రే వెల్లడించిన నేపథ్యంలో కొన్ని మార్పులు, చేర్పులు కూడా ఉంటాయని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉండే కొంతమంది పెద్దలతో నేను మాట్లాడినప్పుడు ప్రధానంగా కొన్ని వికెట్లు రాలిపోవడం ఖాయమన్న మాట వాళ్ల నుంచి వినిపించింది. అది మరీ అంత ఆశ్చర్యకరం ఏమీ కాదు. కొంతమంది మంత్రుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉంటోందని, అందుకు సంబంధించిన విషయాలన్నింటినీ తాను స్వయంగా మానిటర్ చేస్తున్నానని చంద్రబాబు అందరికీ ఓపెన్‌గానే చెప్పేశారు. ఆయన మనసులో మాటను గ్రహించడం అంత సులభం కాకపోయినా.. తరచు కొంతమంది విషయంలో వినిపిస్తున్న విషయాలను చూస్తుంటే కొన్ని పేర్లు ప్రస్తావించక తప్పడం లేదు. వీళ్లందరినీ తప్పిస్తారన్నది ఖాయం కాకపోయినా.. వీళ్లలో కొంతమంది మాత్రం ఉత్త ఎమ్మెల్యేలుగా మిగిలిపోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. వేటు పడే మంత్రుల జాబితాలో రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారథి లాంటి పేర్లు వినిపిస్తున్నాయి.
అందరికంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది రవాణాశాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించే. అత్యంత తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువగా అప్రదిష్ఠ మూటగట్టుకున్న మొట్టమొదటి మంత్రి ఈయనే అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈయన పేషీలో జరుగుతున్న వ్యవహారాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం కన్నేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ఉంటుందని ఈయన చేసినన్ని ప్రకటనలు ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఈ పథకం గురించి ఆయన అంత ఎక్కువగా మాట్లాడడం వల్ల పథకం ఇప్పట్లో అమలుకాదన్న విషయం గురించిన చర్చే ఎక్కువగా సాగింది, దాంతో వైసీపీ కూడా దీనిమీద విమర్శించడానికి అవకాశం ఏర్పడింది. ఆయన్ను తప్పిస్తే ఎవరిని పెడతారన్న చర్చలు వచ్చినప్పుడు అదే వర్గం నుంచి చాలా పేర్లే వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడు.. కేవలం రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి పేరు వచ్చినా అదే జిల్లా నుంచి ఆనం ఉన్నందున ఆయనకు చాన్సు తక్కువ. దాంతో కడప జిల్లా నాయకురాలు, కాస్త వాగ్ధాటి ఉన్న మాధవిరెడ్డి పేరు పరిశీలించొచ్చు.
విదేశాల్లో ఉండి వచ్చినందున కాస్త తెలివితేటలు ఉంటాయని, ఎన్నారై వ్యవహారాలు కూడా చక్కబెడతారని కొండపల్లి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇస్తే.. ఆయన చేసిన పనికి టీడీపీ అధిష్ఠానం ముక్కున వేలేసుకుంది. విశాఖపట్నం విమానాశ్రయంలో కొండపల్లి శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. బొత్సను ఓడించిన కిమిడి కళావెంకటరావు సీనియర్ నాయకుడైనా.. ఆయన్ను కాదని మరీ కొండపల్లికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఇలాంటి పని చేస్తారా అని అంతా తలపట్టుకున్నారు. అయితే, ఇంత మాత్రానికే మంత్రి పదవి పోతు ందా అంటే, ఏమో చెప్పలేం మరి.
సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సభకు వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ రావడం ఒక ఎత్తయితే.. ఆయన ఏకంగా వేదికమీదకే వచ్చి మంత్రి పార్థసారథి, ఇతర నాయకుల సరసన కూర్చోవడం పార్టీని చాలా ఇరుకున పెట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి కొలుసు పార్థసారథి బాగా దెబ్బతిన్నారు. సారథి వైసీపీ నుంచి వచ్చి ఇక్కడ పోటీచేసి గెలిచి మంత్రి కావడంతో.. తన మాజీ మిత్రుడు అని జోగి రమేష్‌కు అవకాశం ఇచ్చి ఉంటారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు, లోకేష్ కూడా కాస్త సీరియస్‌గానే స్పందించారు. దీన్ని బట్టి ఈసారి పార్థసారథి వికెట్ పడడం ఖాయమని వినిపిస్తోంది.
మరోవైపు చూసుకుంటే వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, లేకపోతే బీజేపీ ఇలా ఏదో ఒక పార్టీలోకి వలసలు వరదలా వెల్లువెత్తుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతాడో తెలియట్లేదు. ఒకవేళ టీడీపీలో చేరడానికి పార్టీ అధిష్ఠానం నుంచి అనుమతి రాకపోతే.. వెంటనే అయితే జనసేన, లేకపోతే బీజేపీలోకి చేరిపోతున్నారు. కూటమి పార్టీలలో సమన్వయలోపాన్ని ఇది చూపిస్తోంది. ఒకళ్లు వద్దనుకున్న తర్వాత మరొకరు తీసుకుంటే.. ఇక కూటమి ధర్మం ఎక్కడ ఉన్నట్లు? అంతేకాదు.. వైసీపీ నాయకుల్లో చాలామందికి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీ పెద్దలను, వాళ్ల కుటుంబాలను కూడా నానా మాటలు అనడంతో పాటు టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులను కేసులు పెట్టించి వేధించిన నేపథ్యం ఉంది. అలాంటివాళ్ల మీద ఇప్పుడు ఏవైనా చర్యలు తీసుకుందామంటే.. ఈలోపే వాళ్లొచ్చి ఏ బీజేపీలోనో చేరిపోతున్నారు. తాజాగా విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ తన సోదరితో కలిసి మరీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ డెయిరీ గురించి ఇప్పటికే సభాసంఘం ఏర్పాటుచేసి, అందులోని అవకతవకల గురించి విచారణ జరిపిస్తున్నారు. విచారణలో ఒకవేళ అక్రమాలు బయటపడితే, ఎవరిమీద చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు బీజేపీ నాయకుడిగా ఉన్న ఆనంద్ మీద చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? ఇలాంటి సమస్యలు వస్తున్నందున అసలు వైసీపీ నుంచి ఎవరొచ్చినా తీసేసుకోవడం అని కాకుండా.. కొంత అడ్డుకట్ట పడాలని, తగినంతగా ముందు, వెనక చూసుకున్న తర్వాతే చేరికలకు ఏ పార్టీలోనైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నాయకులు అంటున్నారు.
కరెంటు ఛార్జీల విషయంలో జగన్ మీద కాస్త గట్టిగానే విమర్శలు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాము పెంచిన ఛార్జీలకు కూడా జగనే కారణమని చెబుతున్నా.. ఆ విషయం ప్రజల్లోకి అంతగా వెళ్లలేదు. తాజాగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీల పెంపుపై నిరసన ప్రదర్శనలు చేశారు. ఎక్కడ చూసినా సగటున 50 శాతం వరకు ఇంతకుముందు కంటే కరెంటు బిల్లులు పెరిగిపోయాయన్న మాట వినిపిస్తోంది. గతంలో వెయ్యి రూపాయలు వచ్చేవారికి ఇప్పుడు 1400-1600 వస్తోంది. దీంతో ఈ విషయంలో మాత్రం వైసీపీ వాళ్లు చెబుతున్న మాట నిజమేనని ప్రజలు కూడా అంటున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలకు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరుకావడం చూస్తుంటే ఈ విషయం మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం జగన్ మీద నెపం నెట్టేయడం కుదరకపోవచ్చని స్పష్టం అవుతోంది. దానికితోడు.. వైసీపీకి ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలేనన్న ధీమాతో కూటమి నాయకులు కనిపిస్తున్నారు గానీ, నిజానికి ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కూడా 40 శాతం ఓటు బ్యాంకు సాధించిందన్న విషయాన్ని విస్మరించకూడదు.
మూడు పార్టీలూ కలిసి పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ లాంటి క్రౌడ్ పుల్లర్ వాళ్లవైపు ఉండడం, వాటన్నింటికీ తోడు వైసీపీ చేసుకున్న కొన్ని స్వయంకృతాపరాధాలు కలిసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చాయి. దాంతోపాటు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, పీఏసీ ఛైర్మన్ లాంటి పదవులు దక్కకపోవడం లాంటి తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. అయినా కూడా ఇప్పుడే.. అంటే ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ప్రతిపక్షం నిర్వహించిన ఒక నిరసనకు ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు హాజరవుతున్నారంటే ప్రభుత్వం మీద ఆ విషయంలో అసంతృప్తి ఉన్నట్లే అని అర్థం చేసుకోక తప్పదు. తమ అనుకూల మీడియా సాయంతో ఎలాగోలా నెట్టుకొద్దామని చంద్రబాబు అనుకున్నా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను పూర్తిగా పట్టించుకోకపోవడం కూడా సరికాదు. ఇప్పటినుంచే జాగ్రత్త పడకపోతే.. రాబోయే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు. కాబట్టి.. తస్మాత్ జాగ్రత్త బాబూ!!
మంత్రుల పనితీరు గురించిన చర్చ వచ్చినప్పుడు చంద్రబాబు బహిరంగంగా తిట్టినవారిలో మొట్టమొదటి వ్యక్తి కార్మికశాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్. కుర్రాడివి కదా, ఉత్సాహంగా చేస్తావని నీకు మంత్రి పదవి ఇస్తే.. కనీసం సభ్యత్వాలు కూడా చేయించకపోతే ఎలాగయ్యా? అంటూ చంద్రబాబు కాస్త గట్టిగానే వేసుకున్నారు. ఆయన పనితీరు గురించి పెద్దాయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. కానీ, ఉభయగోదావరి జిల్లాల్లో బలమైన శెట్టిబలిజలకు మంత్రివర్గంలో ఉన్న ఏకైక ప్రతినిధి వాసంశెట్టి సుభాష్. ఒకవేళ ఆయనను తప్పించాలంటే, అదే వర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు పితాని సత్యనారాయణను తీసుకోవాలి.
– 98858 09432