Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Rahul Jodo yatra: 'సెలబ్రేటెడ్' భారత్ జోడో యాత్ర

Rahul Jodo yatra: ‘సెలబ్రేటెడ్’ భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర్ ‘మోస్ట్ సెలబ్రేటెడ్ యాత్ర’, ‘సెలబ్రిటీ యాత్ర’గా మారిపోయింది. పాదయాత్రలో భాగంగా కామన్ మ్యాన్ చేతులు పట్టుకుని రాహుల్ నడుస్తున్న ఫోటోలు తెగ వైరల్ కాగా, సోషల్ మీడియా అంతా రాహుల్ నామ జపం విజయవంతంగా సాగింది. విమర్శలు, ప్రశంసలు, సెటైర్లు, మీమ్స్, కార్టూన్లు, ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, న్యూస్ అప్డేట్స్, న్యూస్ మేకర్స్.. ఇలా అన్నింటికీ అన్నీ రాహుల్ నామాన్ని స్మరించటంతోనే పాదయాత్ర విజయంతంగా సాగుతోంది. ఆఖరుకి భారత్ జోడో యాత్రలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిందేనంటూ కేంద్రం ప్రకటించే స్థాయిలో ఈ యాత్ర భారీగా సాగుతోంది.

- Advertisement -

నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే గతంలో రాహుల్ కు రాని ఇమేజ్ ఈ యాత్ర తెచ్చిపెట్టిందని ప్రత్యర్థులు సైతం విశ్వసిస్తున్నారు. భారత్ జోడో యాత్రకు మునుపు రాహుల్, భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్ అనేలా ఆయన ప్రజల్లో మమేకం అయ్యే విధానం బాగుందని రాజకీయ పండితుల మెప్పుపొందింది. రాహుల్ కష్టం ఊరికే పోదని ఊళ్లలో సామాన్యులంతా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఆయనకు మంచి పొలిటికిల్ మైలేజ్ వచ్చేలా చేసిందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పాదయాత్రను విజయవంతం అయ్యేలా అంటే రాహుల్ స్టేట్మెంట్స్, షెడ్యూల్, పిక్స్, వీడియోలు వైరల్ అయ్యేలా చాలా శ్రమించింది. కాబట్టి పాదయాత్ర పబ్లిసిటీపై పెట్టిన ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యింది. ఇక సోషల్ మీడియా సెల్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినంత పనిచేసింది. అంతలా రాహుల్ పాదయాత్ర మైక్రో బ్లాగింగ్ సైట్సు, వాట్సప్ ల్లో తిరుగుతున్నాయి.

“నఫ్రత్ కా బాజార్ మే.. మొహబ్బత్ కి దుకాన్” అంటూ రాహుల్ యాత్ర సాగింది. విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, అసహనం దేశంలో పెచ్చరిల్లిపోతున్న సమయంలో తాను ప్రేమ పంచుతానంటూ రాహుల్ చెప్పిన మాటలు కూడా బాగా వైరల్ అయి, సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు శరవేగంగా చేరాయి. ఇక ఎలాంటి భేషజాలు లేకుండా రాహుల్ అందరిలో కలిసిమెలిసి నడుస్తున్న తీరు చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్లింది. అంతేకాదు ఓ టీ షర్ట్ వేసుకుని, సీజన్లు మారుతున్నా ఆయన అకుంఠిత దీక్షతో, చాలా సింపుల్ గా యాత్రను కొనసాగిస్తుండటం హైలైట్.

యాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచి నేటి వరకు ఆయన అడిగినవారందరికీ ఆటోగ్రాఫులు, ఫోటో గ్రాఫులు, సెల్ఫీలు ఇలా ఇస్తూపోతున్నారు. నడుస్తూ మధ్యలోనే పరిగెత్తటం, ఫిట్నెస్ ఫ్రీక్ గా అందరూ ఉండాలని, ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటూ సడన్ గా పరుగు లంకించుకోవటం, ఆయనతోపాటు మిగతావారూ ఇలాగే పరిగెత్తటం చూస్తుంటే రాహుల్ పాదయాత్రలో ఇలాంటి చిన్నాచితకా హైలైట్స్ చాలానే ఉన్నాయి. డ్యాన్సులు, ఎక్కడికక్కడ చిరుతిండ్లు.. అబ్బో ఇలాంటి సైడ్ లైట్స్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి. స్వెట్టర్, జాకెట్స్ వేసుకోకుండా రాహుల్ నడక కొనసాగిస్తుండటంపై అందరూ ..” మీకు చలి పెట్టడం లేదా జస్ట్ టీ షర్ట్ వేసుకుని ఎలా నడుస్తున్నారం”టూ ఢిల్లీలో ఒకటే ప్రశ్నలు ఎదురవుతున్నాయి రాహుల్ కు.

తన కుటుంబ సభ్యులు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వచ్చి, రాహుల్ తో కలిసి నడవటం మరో ఘట్టంగా ఆవిష్కృతమైంది. ముఖ్యంగా ప్రియాంక ఇద్దరు పిల్లలు లైమ్ లైట్ లోకి వచ్చారు. రాహుల్ యాత్ర హిట్ అయిందని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాల్లో కూడా పాదయాత్రలు ప్రారంభించాలని ఎప్పుడో చెప్పింది హై కమాండ్. ఈమేరకు అన్ని పీసీసీలు అప్పుడే పని ప్రారంభించగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అప్పుడే కొన్ని రౌండ్ల పాదయాత్ర కూడా పూర్తయింది. పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లటం, జనం ఘోష వినటం, మీకు నేనున్నాని అభయహస్తం ఇవ్వటం ద్వారాప్రజాభిమానాన్ని సంపాదించుకోవచ్చనేది ప్రతిపక్షాలన్నీ కచ్ఛితంగా నమ్మే సక్సెస్ ఫార్ములా. అందుకే పార్టీలు ఏవైనా, లీడర్ల వయసు ఎంతున్నా బస్సు యాత్ర, రైలు యాత్ర, సైకిల్ యాత్ర, పాదయాత్ర అంటూ ఏదో ఒక యాత్ర ద్వారా ప్రతిపక్ష నేతలు ప్రజల ఓట్లు కొల్లగొడుతుంటారు.

కాంగ్రెస్ ‘బ్యాండ్ వ్యాగన్’ లోకి ‘లైక్ మైండెడ్’ ప్యూపుల్ పెద్ద ఎత్తున వచ్చారు. ఇంకా చాలా మంది రాహుల్ ను వ్యక్తిగతంగా కలిసేందుకు బాలీవుడ్ లో తహతహలాడుతున్నారు. ప్రకాష్ రాజ్ వంటివారు సోషల్ మీడియా ద్వారా రాహుల్ కు మద్దతు ప్రకటించారు. ఇక టీవీ, సినిమా నటులైన ..పూనం కౌర్, పూజా భట్, రియా సేన్, రష్మి దేశాయ్, సుషాంత్ సింగ్, ఆకాంక్షా పూరి, స్వరా భాస్కర్, అణోలా పాలేకర్, కమల్ హాసన్ రాహుల్ వెంట నడిచి సందడి చేశారు. ఎంకే స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించిన పాదయాత్రకి ఇతర పార్టీల నేతలు కూడా వచ్చి సంఘీభావంగా రాహుల్ తో కలిసి నడిచారు. ఒలింపిక్ మెడలిస్ట్, బాక్సర్, కాంగ్రెస్ నేత కూడా అయిన విజయిందర్ సింగ్ పాదయాత్రకు వచ్చారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, కనిమొళి, ఆదిత్యా ఠాక్రే వంటి వారు రాహుల్ కు మద్దతుగా నిలిచారు.

ఇదంతా కాంగ్రెస్ పార్టీ ‘మీడియా మేనేజ్మెంట్’ అంటూ బీజేపీ గట్టిగానే కామెంట్ చేస్తోంది. ‘స్టేజ్ మేనేజ్డ్’ అంటూ ఇలాంటి సెలబ్రిటీల్లో చాలామందికి డబ్బు ఇచ్చి మరీ పిలిపించారని, ఇదంతా ‘షెడ్యూల్డ్ షో’ అంటూ బీజేపీ విమర్శించింది. నారాయణ్ రాణే కుమారుడు ఏకంగా.. “ యే పప్పు పాస్ నహీ హోగా” అంటూ “సబ్ గోల్ మాల్ హై భాయి” అని దెప్పిపొడుస్తూ స్టేజ్ మేనేజ్ చేసినట్టు ప్రూప్ గా ఫోన్ కాన్వర్జేషన్ ను ఓ స్క్రీన్ షాట్ గా ఆయన పెట్టారు. ఇవి కూడా వైరల్ అయ్యాయి. బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇంఛార్జ్ అయిన అమిత్ మాలవీయ అయితే ఇదంతా ‘పెయిడ్ పీఆర్’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసేశారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే మనదేశంలో సెలబ్రిటీలు, బిజినెస్ మెన్ అంతా అడ్డంగా చీలిపోయారని మాత్రం స్పష్టమవుతుంది. ప్రో కాంగ్రెస్, యాంటీ కాంగ్రెస్ అనటంకంటే దీన్ని ప్రో మోడీ, యాంటీ మోడీ అనక తప్పదు. దీన్నే కమలనాథులు చాలా మంది తమ భాషలో సూడో సెక్యూలర్, యాంటీ నేషనల్ అంటున్నారు.

ఇక పనిలో పనిగా రాహుల్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చి హిందూవాదులను సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. ”జై సియారామ్ అనకుండా జై శ్రీరాం అంటారేంటి, సీతామాత వల్లే రాముడు దేవుడయ్యాడం”టూ తనదైన ధోరణిలో చెప్పుకుంటూ రావటం, శ్రీ అంటేనే లక్ష్మి అంటే సీతాదేవి అని హిందూవాదులు సమర్థించుకోవటం కూడా యాత్రలో హైలైట్ గా నిలిచింది.

‘కనెక్ట్ విత్ ప్యూపుల్’ అంటూ రాహుల్ చేస్తున్న ఈ పాదయాత్రలో మాటల మంటలు పుట్టాయి. ప్రధాని మోడీ తన గొంతు వినిపించేందుకు ‘మన్ కి బాత్’ ప్రోగ్రాం నిర్వహిస్తుంటే రాహుల్ మాత్రం ప్రజావాణిని వినేందుకే ఈ పాదయాత్ర చేపట్టారని కాంగ్రెస్ వివరించింది. ఇది ‘రాహుల్ మన్ కి బాత్’ కాదని, ‘ప్రజల మన్ కీ బాత్’ అంటూ జైరాం రమేష్ చెప్పుకురావటం మరో హైలైట్. భారత్ జోడో యాత్ర అనేది కాంగ్రెస్ నేతృత్వంలో సాగుతున్న అతిపెద్ద ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ అంటూ బీజేపీ ఆరోపించింది. ఇలా మాటకు మాట ఇస్తూ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం రాజకీయ వేడిని రగిలిస్తోంది.

భారత్ జోడో యాత్ర హిట్ అయినందున ఈ టెంపోను 2024 ఎన్నికల వరకూ అలాగే రగిలించేందుకు ”హాత్ సే హాత్ జోడో అభియాన్” పేరుతో జనవరి 26 నుంచి మరో యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతోంది. తమను తాము ఇలాంటి యాత్రల ద్వారా రీడిస్కవర్ చేసుకుంటామని కాంగ్రెస్ పదేపదే ప్రజలకు భరోసా ఇచ్చేలా వివరిస్తుండటం విశేషం. రాహుల్ భారత్ జోడో యాత్రకు సీక్వెల్ ఉంటుంది, అదే భారత్ జోడో యాత్ర 2.0 ఇది కూడా అతిత్వరలో రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకుని ఈస్ట్ నుంచి వెస్ట్ వరకూ సాగనుంది. అంటే ఇప్పటివరకూ సౌత్ టు నార్త్ యాత్ర సాగుతుండగా నెక్ట్స్ ప్రారంభమయ్యే యాత్ర వేరే దిశలో ఇండియాను కవర్ చేయనుందన్నమాట.

ఏదేమైనా రాహుల్ యాత్ర కాంగ్రెస్ పార్టీలో కాస్త కదలిక తెప్పించింది. కార్యకర్తలు కాస్తంతైనా హుషారు తెప్పించారు రాహుల్. మొట్టమొదటిసారి సీరియస్ పొలిటీషియన్ లా, పట్టువదలని విక్రమార్కుడిలా రాహుల్ కనిపిస్తున్నారని చాలామంది కాంగ్రెస్ నేతలే ఆఫ్ ది రికార్డ్ చెబుతుండటం చూస్తుంటే రాహుల్ యాత్ర ద్వారా పార్టీలో ఉత్సాహం వచ్చిందని చెప్పక తప్పదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News