Monday, May 20, 2024
Homeఓపన్ పేజ్Rising poverty in India: పేదలను పెంచుతున్న సంపద వృద్ధి

Rising poverty in India: పేదలను పెంచుతున్న సంపద వృద్ధి

బ్రిటీష్ కాలంలో కంటే ఇప్పుడే ఎక్కువట

ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ప్రభుత్వాలు అత్యుత్తమ ఆర్థిక పథకాలను ప్రవేశపెడుతున్నా పేదల స్థితిగతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల సర్వేలు, అధ్యయనాల ప్రకా రం, దేశంలో సంపద పెరుగుతున్న మాట నిజమే కానీ, అసమానతలు కూడా దారుణంగా పెరిగిపోతున్నాయి. గత కొన్నేళ్లలో భారతదేశం సంపద సృష్టిలో అన్ని దేశాలకన్నా ముందుంటోంది. ఇది ప్రపంచ దేశాలను మెప్పించడమే కాక, దేశ ప్రజల్లో కూడా ఒక విధమైన ఆత్మవిశ్వాసాన్ని, సంతృప్తిని నింపింది. అంతేకాదు, ప్రపంచంలో అయిదవ ఆర్థిక శక్తిగా గుర్తింపు తెచ్చుకోగలిగింది. అయితే, ఇన్ని సానుకూలతల్లో ఒక ప్రమాదకరమైన ప్రతికూలత కూడా ఉంది. అది దేశానికి తప్పకుండా ఆందోళన కలిగిస్తుంది. దేశంలో అభివృద్ధి అనేది సరిసమానంగా చోటు చేసుకోవడం లేదు. అసమానతల విషయంలో భారత్‌ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. సంపద, ఆదాయం దేశంలో కొందరి చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంది. అంటే, దేశంలోని ఒక్క శాతం జనాభా చేతుల్లో 41 శాతం సంపద కేంద్రీకృతమై ఉన్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. వరల్డ్‌ ఇనీక్వాలిటీ క్లబ్‌ కు చెందిన నలుగురు ప్రసిద్ధ ఆర్థికవేత్తలు రాసిన “వెల్త్‌ అండ్‌ ఇనీక్వాలిటీ ఇన్‌ ఇండియా: 2022-23’, ‘ది రైజ్‌ ఆఫ్‌ బిలియనైర్‌ రాజ్‌’ అనే గ్రంథాలను బట్టి ప్రపంచంలోని ఇతర దేశాలన్నిటికంటే భారత దేశంలోనే అసమానతలు మరీ ఎక్కువగా ఉన్నాయి.
బ్రిటిష్‌ పాలకుల హయాంలో కూడా ఇంతటి అసమానతలు లేవని ఈ గ్రంథాల్లో రచయితలు వ్యాఖ్యానించారు. చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ప్రస్తుతం దేశంలో అసమానతలు నెలకొని ఉన్నాయని వారు దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వివరాలు, వ్యాఖ్యలు దేశ ఆర్థిక వ్యూహాలను, పథకాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నిజానికి ఈ అంశాన్ని రాజకీయ కోణం నుంచి కూడా పరిశీలించాల్సి ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, సామాజికంగా, ఆర్థికంగా ప్రజలనందరినీ క్రమంగా సమానుల్ని చేయడమే ప్రజాస్వామ్యం ప్రధాన ఉద్దేశమనీ అందరికీ తెలిసిన విషయమే. అయితే, దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా అసమానతలు పెరిగిపోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి ఈ అసమానతలు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి మరింతగా హద్దులు దాటాయి.
ముఖ్యంగా, 2014-15, 2022-23 గణాంకాలను పరిశీలించినప్పుడు ఈ ఆర్థిక అసమానతలు మరింతగా కొత్త పుంతలు తొక్కడం ప్రారంభించాయి. ఇంతకు మున్నెన్నడూ లేనంతగా సంపన్నులు అపర కుబేరులుగా మారడం ప్రారంభమైంది. దేశంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా, చివరికి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని తలపెట్టినా అవి సంపన్నులను మాత్రమే వృద్ధి చేస్తున్నాయి. లక్షలాది మంది నిరుపేదలను దారిద్య్ర రేఖ దిగువ నుంచి పైకి తీసుకు వచ్చినట్టు ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి కానీ, వాస్తవమేమిటంటే, సంపన్నులు మాత్రమే అత్యధిక సంపన్నులుగా మారడం జరుగుతోంది. అసమానతలు పెరుగుతున్న కొద్దీ సామాజిక సంక్షోభాలు, ఘర్షణలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా, రాజకీయంగా ఉద్యమాలు, పోరాటాలు చెలరేగుతూ ఉంటాయి. అసమ్మతులు, అసంతృప్తులు రకరకాల రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటాయి. వీటిని అదుపు చేయడానికి ప్రభుత్వాలు మరింత నిరంకుశంగా వ్యవహరిస్తుంటాయి. వీటి మూల కారణాలను పరిశీలించి, పరిష్కరించే ప్రయత్నం మాత్రం చేయవు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇటువంటివే చోటు చేసుకుంటున్నాయి.
ఈ నలుగురు అసమానతల గురించి చెప్పడం, వాటివల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి వివరించడంతో పాటు వీటికి పరిష్కారాలు కూడా తెలియజేయడం జరిగింది. దేశంలో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల ద్వారా సృష్టి అవుతున్న సంపదను, ఆదాయాన్ని సరిసమానంగా పంపిణీ చేయగలిగిన విధంగా పన్ను వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. దేశంలోని 167 అపర కుబేర కుటుంబాల మీద రెండు శాతం పన్నును అదనంగా వేయడం ద్వారా అదనంగా 0.5 శాతం జాతీయా దాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని అసమానతలు తగ్గించ డానికి పెట్టుబడిగా పెట్టవచ్చు. ఆరోగ్యం, విద్య, పౌష్టికాహార రంగాలపై భారీగా పెట్టుబడులు పెంచడం ద్వారా సాధారణ ప్రజానీకానికి లబ్ధి చేకూర్చడానికి అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి అనేది ఉద్యోగాల సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన వంటి సామాజిక అంశాలతో ముడిపడి ఉండడమనేది అన్నిటికన్నా ముఖ్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News