కళింగాంధ్రకు చెందిన అభ్యుదయ కవిగా ప్రఖ్యాతిగాంచిన ‘సీరపాణి’ ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం మండలం, కామందొరవలస గ్రామంలో అప్పలనాయుడు, పార్వతమ్మ దంపతులకు ఆరవ సంతానంగా 1949 అక్టోబర్ 1వ తేదీ విజయదశమి నాడు జన్మించారు. అసలు పేరు బుడితి బలరామునాయుడు. సీరపాణి అనేది కలం పేరు. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబం. వీరి తాతగారు పరమ పౌరాణికులు. ‘చదువుల రామినాయుడు’ గా ఆ కాలంలో ప్రసిద్ధి పొందారు. వీరి పెద్దన్నయ్య కీ:శే బుడితి రామినాయుడు కవి, రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత.
సీరపాణి మూడు నాలుగు నెలల వయస్సులోనే తల్లిని కోల్పోయారు. విజయనగరం జిల్లా, వంగర మండలం, కొప్పర కొత్తవలస గ్రామంలో తన పెద్దమ్మ గారి ఇంట పదేండ్ల పాటు పెరిగారు. పెదనాన్న పొదిలాపు ముగతయ్య ఉపాధ్యాయుడు. అక్కడ 1955-60 సంవత్సరాల్లో పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక విద్యనభ్యసించారు.1960-63 వరకు విశాఖపట్నం మిసెస్ ఎ.వి.ఎన్ కాలేజీ హైస్కూల్లో మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. అదే కాలంలో ఎ.వి.ఎన్ కళాశాలకు శతజయంతి జరిగినట్లు, శ్రీశ్రీ ఆ కళాశాల పూర్వ విద్యార్థి కావడంవల్ల ఆ ఉత్సవంలో పాల్గొన్నట్లు, అప్పుడే తాను మొదటిసారి శ్రీశ్రీ గారిని చూసినట్లు ఆయన చెబుతున్నారు.1963-66 వరకు మన్యం జిల్లా పాలకొండ పరిషత్ హైస్కూల్లో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసారు.1967-73 మధ్య కాలంలో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల, విజయనగరంలో భాషాప్రవీణ చదివారు.1975 లో ప్రభుత్వ కాంప్రెహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రాజమండ్రిలో పండిత శిక్షణ పూర్తిచేసారు. సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ విద్యార్థిగా ఉన్నప్పుడే కవిత్వ రచన ప్రారంభించారు. పద్యం, గేయం, వచన కవిత్వాల్లో రచన చేయగల సమర్ధుడీయన.
‘ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం’ తాపీ ధర్మారావు గారి అధ్యక్షతన 1943 ఫిబ్రవరి 13,14 తేదీల్లో తెనాలిలో ప్రారంభమైనట్లు సాహితీవేత్తలకు తెలుసు. ఆ సంఘం 1944, 45-46, 47, 55 సంవత్సరాలలో వరుసగా విజయవాడ, రాజమండ్రి, మద్రాసు, విజయవాడ నగరాల్లో మహాసభలు జరుపుకొని తన కార్యకలాపాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఆ తరువాత 1970 వరకు సుమారు 16 యేళ్ళు సంఘం పూర్తిగా స్తంభించిపోయింది. అప్పుడే కె.వి.రమణారెడ్డి మరికొంతమంది ప్రముఖులు శ్రీశ్రీ ని విప్లవ రచయితల సంఘం వైపు మళ్ళించారు. ఆరుద్ర, అనిసెట్టి, దాశరథి అలాగే మరికొందరు ‘అరసం’ పునర్నిర్మాణం కోసం మాతృసంస్థతో సంప్రదించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అనిసెట్టి, ఆరుద్ర మొదలైన కొందరు ప్రముఖ రచయితలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని అ.ర.సం నిర్మించడానికి పిలుపునిచ్చారు. అప్పటి చాలామంది రచయితులు ఈ విజ్ఞప్తికి రాష్ట్రంలో తమ ఆమోదం తెలిపారు. చాగంటి సోమయాజులు గారు మొదలైన పెద్దల ప్రోద్బలంతో విజయనగరంలో అరసం మొదటి శాఖ స్థాపించబడింది. అప్పటికి సీరపాణి విద్యార్థి ఐనప్పటికీ కవిత్వ రచనలో ముందుండడం వల్ల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు.1972 లో చా.సో అధ్యక్షతన విజయనగరం శాఖ ఏర్పడి 1975 వరకు అనేక సాహిత్యసభలు, గోష్ఠులు నిర్వహించి యువరచయితలకు మార్గదర్శకంగా నిలిచింది.
సీరపాణి తన విద్యార్థి దశలో సామ్యవాద దృక్పథంతో కూడిన అభ్యుదయ కవితల్ని రచించారు. వచనకవితలే కాక గేయరచనలో పరిణితి సాధించారు. శ్రీశ్రీ మహాప్రస్థానం చదివిన తరువాత ఈతని కవితలు తత్సమానమైన అనుభూతినిస్తాయనేది సాహితీవేత్తల ప్రశంస. ఈతని రచనలన్నీ ఆనాటి ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భారతి, స్రవంతి లాంటి దిన, వార, మాసపత్రికల్లోనూ, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికల్లోనూ ప్రచురించబడ్డాయి. వీరు ఆనాడు మూడు రాష్ట్రస్థాయి కవిత్వపు పోటీలలో ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. బొబ్బిలి జూనియర్ ఛాంబర్ 1971 ఆగష్టులో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ‘బంగ్లాదేశ్ గేయ రచన’ పోటీలో ‘వీరబంగ్లా’ కు; బరంపురం వికాస సాహితి 1974 సెప్టెంబర్ లో నిర్వహించిన వచన కవితల పోటీలో ఇతని ‘కన్నీటి లేఖ’ కు; హైదరాబాద్ వంశీ ఆర్ట్స్ 1975 లో నిర్వహించిన కవితల పోటీలో ‘జీవనవసంతం’ కు ప్రథమ బహుమతులు లభించాయి. ఈ పోటీలకు వరుసగా కె.వి.రమణారెడ్డి, ఉప్పల లక్ష్మణరావు, డా: సి. నారాయణరెడ్డి గార్లు న్యాయనిర్ణీతలు. చదువు పూర్తయ్యాక 1975 లో బొమ్మరిల్లు, మద్రాసు పత్రికలకు కొంతకాలం సహాయ సంపాదకుడిగా పనిచేశారు.
1976 నుండి శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎం. సీతారాంపురంలో ద్వితీయ శ్రేణి తెలుగు పండితునిగా 3 యేండ్లు,1979 నుండి 2007 వరకు సుమారు మూడు దశాబ్దాలు ప్రథమశ్రేణి తెలుగు పండితునిగా వీరఘట్టాం, తలవరం, పాలకొండ (బాలికలు), నీలానగరంలలో పనిచేశారు.1996 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2005 లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు స్వీకరించారు.
1974 మార్చిలో మద్రాసు ‘ఉగాది సాహిత్యసభ’ లో ప్రధానవక్తగా పాల్గొన్నారు.1995 నుండి 1998 వరకు పాలకొండ ‘సాహితీ సమితి’ అధ్యక్షులుగా ఉన్నారు. జిల్లాలోని వివిధ సాహిత్యసంస్థలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన సభలలో ప్రాచీన ఆధునిక సాహిత్యాల గురించి ఉపన్యాసించారు. 1991లో శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించిన ‘అక్షరక్రాంతి’ అక్షరాస్యతా కార్యక్రమానికి విశిష్టసేవలు అందించారు. సెంట్రల్ రిసోర్స్ పర్సన్ గా, కీ రిసోర్స్ పర్సన్ గా, డివిజనల్ స్థాయిలో అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన అక్షరాస్యుల కోసం ప్రారంభించిన ‘అక్షరక్రాంతి’ పత్రిక (వీక్లీ బ్రాడ్ షీట్) కు ప్రారంభం నుండి కొంతకాలం పాటు వర్కింగ్ ఎడిటర్ గా పనిచేశారు.
సీరపాణి 1979 లో తన వచన, గేయరచనలలో 27 కవితలను ‘డమరుధ్వని’ పేరుతో ఒక కవితా సంపుటిగా ప్రచురించారు. ఈ కవితలన్నీ విద్యార్థి దశలో రచించినవే. ఈ డమరుధ్వనిలోని కవితలు ఆనాటి సాహితీవేత్తలకు సుపరిచితాలే. అవి అప్పట్లో ఎంతోమంది యువరచయితలకు స్ఫూర్తినిచ్చాయి. డమరుధ్వని సంపుటి ప్రచురించి 46 సంవత్సరాలయ్యింది. కవితలు ప్రచురించబడి 54 యేళ్ళయ్యింది. అంటే ఒక అర్థశతాబ్దం తరువాత మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఈ డమరుధ్వని కవితా సంపుటిని ఈ వ్యాస రచయిత ప్రతి కవితకు ఒక విశ్లేషణ వ్యాసం చొప్పున రాసి, వివిధ పత్రికలకు పంపి ప్రతిధ్వనింపజేసారు. ఆ వ్యాసాలన్నింటినీ గుదిగుచ్చి పుస్తకంగా అచ్చువేయించి ఇటీవల ‘డమరుధ్వని-ప్రతిధ్వని’ పేరిట విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో ప్రముఖ కథా నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు డా: చింతకింది శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా చింతకింది మాట్లాడుతూ సీరపాణి గురించి నేను ఇదివరలోనే విన్నాను. అప్పట్లో ఆయన రచనలు చదివాను. కానీ ఈరోజు నాకు ఆయనను ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది. సీరపాణిని కళిగాంధ్రకు చెందిన ‘ఓ మహాకవి’ అని ఎటువంటి సందేహం లేకుండా పిలుస్తాను. “కవితా సౌరభాలను నిత్యమూ వెదజల్లుతూ అరిగిపోయిన గంధపుచెక్కలా కనబడుతున్నారు” డెబ్బైఐదు యేండ్ల వయసులో ఉన్న అతన్ని మొట్టమొదటిసారి చూసిన క్షణంలో ఇలా అనిపించిందని ఆత్మీయంగా అంటారు చింతకింది.
డమరుధ్వని ఉత్తమమైన సాహిత్య విలువలు కలిగిన కవితా సంపుటనేది నిర్వివాదాంశమైన విషయం. సహృదయతతో చదివితే ప్రతి ఒక్కరూ నా భావనతో ఏకీభవిస్తారు. కొన్ని తావుల్లో భాషా కాఠిన్యం కనిపించినా, చదువరులకు కొంత ఇబ్బంది కలిగించినా, ఆయా రసపోషణ చేస్తున్నప్పుడు సందర్భానుసారంగా ఆయా పద ప్రయోగాలు కవికి అనివార్యం. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా కవితలోని ప్రతి చరణం, చరణంలోని ప్రతి వాక్యం సుబోధకమయ్యేటట్లు ఈ వ్యాసరచయిత శక్తి కొలది వివరించారు. ఐతే డమరుధ్వని గేయాలలోని వివిధ మాత్రాచ్ఛందోరీతుల్ని, శబ్దార్థ అలంకారాలనూ, కవితాశిల్పాన్ని వివరించే ప్రయత్నం చెయ్యవలసి వుంది. అప్పుడే ఈ కావ్యానికి సరైన న్యాయం జరుగుతుంది. ఈ కవితా సంపుటికి ప్రఖ్యాత కవి ఆరుద్ర నమ్మకం అనే పేరుతో ముందుమాట రాయగా, అనిసెట్టి సుబ్బారావు కవి పరిచయం చేశారు. ఈ కవి పరిచయ వాక్యాల్లో అనిసెట్టి గారు సీరపాణి వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ “ఎంత సౌమ్యుడో అంత శక్తిమంతుడు. ఎంత సౌజన్యమూర్తో అంత గంభీర వ్యక్తి. ఎంత ప్రేమాస్పదుడో అంత కఠోర దీక్షాదక్షుడు. ఈ కవిత్వం చదివితే ఈ సత్యం మీకే రుజువౌతుంది” అని ప్రశంసించారు. ఈ కవితా సంపుటిని సీరపాణి తన సోదరులు రామినాయుడు, గోపాలనాయుడు, నారాయణనాయుడులకు అంకితమిచ్చారు. ఈ కవిత్వానికి చివరి అనుబంధంగా చేర్చిన వందేమాతరం కవిత 1997లో భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా రచించినది.
సీరపాణి అభ్యుదయ కవిగానే కాక కొన్ని ఆధ్యాత్మిక రచనలు కూడా చేశారు. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతానికి అనితరసాధ్యమైన గేయానువాదం చేశారు. భగవద్గీత 700 శ్లోకాలనూ 700 గేయాలుగా సరళంగా గేయభగవద్గీత అనే పేరుతో సుభోదకంగా అనువదించారు. ఇది చాలా క్లేశంతో కూడుకున్న పని. ఈ రచనలను అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య గారు ప్రశంసిస్తూ పరిచయం చేసారు. ఇంకా జగద్గురు శంకరాచార్యుల వారి భజగోవిందం, శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలను గేయానువాదం చేశారు. కులశేఖర ఆళ్వారు రచించిన ముకుందమాలకు కూడా గేయానువాదం చేసారు. ఇది ప్రత్యేకించి పరిశోధించవలసిన సీరపాణి మరో రచనా కోణం.
విజయనగరం సాహిత్య చరిత్రలో మహాకవి గురజాడ అప్పారావు ముత్యాలసరాలు, శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతి తరువాత స్థానంలో నిలబడగలిగిన సత్తాగలిగిన అభ్యుదయ కావ్యం సీరపాణి డమరుధ్వనియే.
ఒక అర్థశతాబ్దం పాటు సాహితీలోకంలో
విస్మృతికి లోనైన తెలుగు గేయకవితను మరలా పునరుద్ధరించాలనే సత్సంకల్పంతో 2017 లో ‘గేయకవితా ప్రస్థానం’ అనే పేరుతో ఒక సాహిత్య ఉద్యమాన్ని విజయనగరంలో ప్రారంభించి, విశాఖపట్నంలో కూడా ఒక సదస్సును నిర్వహించారు. 2018 లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది కవుల గేయాలతో ‘పాటసారులు’ పేరిట ఒక సంకలనాన్ని వెలువరించారు. సీరపాణి గారు ఎంతగా విన్నవించుకున్నా ప్రభుత్వసంస్థలుగాని, సాహిత్యసంస్థలుగాని, విద్యాసంస్థలుగాని, సాహిత్యాభిలాషులుగాని, రచయితలు గాని తన ఆదర్శాన్ని అర్థం చేసుకొని తగిన ప్రోత్సాహం కనబరచకపోవడం దురదృష్టకరం. ఈలోగా కరోనా మహమ్మారి విజృభించడంతో అతని ఉద్యమం కొంత మందగించినా తన ప్రయత్నం మాత్రం మానలేదు. 75 ఏళ్ల వయసులో సాహిత్యసేవకు తన జీవితాన్ని అంకితం చేస్తున్న సీరపాణి ఒంటరి పోరాటాన్ని ఇప్పటికైనా గుర్తించి సాహిత్య జగత్తు తగిన సహాయ సహకారాలనందించి, గేయసాహిత్య ప్రక్రియను పునః ప్రతిష్ఠచేసి తన్మూలంగా తెలుగు కవిత్వపు పూర్వవైభవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను.
(అక్టోబర్ 1వ తేదీన ‘సీరపాణి’ గారు 75 యేటలోకి అడుగుపెడుతున్న సందర్బంగా)
పిల్లా తిరుపతిరావు
7095184846