Wednesday, September 18, 2024
Homeఓపన్ పేజ్Sitaram Yechury: ఏచూరిది ఒకే మాట, ఒకే బాట!

Sitaram Yechury: ఏచూరిది ఒకే మాట, ఒకే బాట!

ప్రతి విషయంలోనూ లోతైన విజ్ఞానం ఆయన సొంతం

మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త విని చలించని వారుండరు. కన్నీరు పెట్టని వారుండరు. ఆయన పార్టీలకు అతీతమైన నాయకుడు. కుల, మత ప్రసక్తి లేని అజాత శత్రువు. “ఆయన మార్క్సిస్టు పార్టీ కాకుండా ఏ ఇతర పార్టీలో ఉన్నా దేశానికి ప్రధాన మంత్రి కాగలిగి ఉండేవారు. అంతటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి” అని కాంగ్రెస్‌ నాయకులు సైతం ఆయనను అభినందించిన, అభిమానించిన సందర్బాలున్నాయి. ఆయన సలహాలు కోరని పార్టీ లేదు. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించ లేదు. ఆయన ఏనాడూ భోగభాగ్యాలు కోరుకోలేదు. అసలు సిసలు కమ్యూనిస్టు భావజాలాన్ని ఒంటబట్టించుకున్న నిరాడంబర జీవి ఆయన. అంచెలంచెలుగా పైకి వ్యక్తి వచ్చిన నాయకుడే కానీ, అడ్డదోవల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఉపకారం చేయడం తప్ప అపకారం తలపెట్టని నాయకుడు ఆయన అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా ఆయనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. పేరుకు తగ్గట్టుగానే ఆయనది ఒకే మాట ఒకే బాట. ఏనాడూ దారి తప్పలేదు. పదవీ లాలసతను పెంచుకోలేదు.
హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు సీతారాం ఏచూరి ఆయనకు అత్యంత సన్ని హితంగా ఉండేవారు. సూర్జిత్‌ ను ఆయన తన గురువుగా భావించేవారు. ఆయన దగ్గరే యేచూరి రాజకీయ మెళకువలను నేర్చుకున్నారు. సంకీర్ణ రాజకీయాల యుగంలో సూర్జిత్‌ నాయకత్వంలోని మార్క్సిస్టు పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి, ఆ తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతునివ్వడం జరిగింది. మొదటి యు.పి.ఏ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏచూరి తన రాజకీయ శక్తి సామర్థ్యాలను మరింతగా మెరుగుపరచుకున్నారు. ఆ ప్రభుత్వ విధానాల రూపకల్పనపై ఒత్తిడి తీసుకురావడంలో ఏచూరి కృతకృత్యులయ్యారు. భారత, అమెరికా అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నప్పుడు ఆయన అందులో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ప్రకాశ్‌ కారత్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. చివరికి ఈ ఒప్పందానికి నిరసనగానే యు.పి.ఏ ప్రభుత్వానికి మార్క్సిస్టు పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది.
అంచెలంచెలుగా అందలాలు
సుమారు 1974 ప్రాంతంలో భారతీయ విద్యార్థి సమాఖ్య (ఎస్‌.ఎఫ్‌.ఐ)లో చేరిన ఏచూరి ఆ తర్వాత సంవత్సరమే మార్క్సిస్టు పార్టీలో చేరి అందులో పూర్తికాల సభ్యుడయ్యారు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఎమర్జెన్సీ సందర్భంగా అరెస్టు కావలసి వచ్చింది. 1952 ఆగస్టు 12వ తేదీన సీతారాం ఏచూరి మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల యేచూరి, తల్లి కల్పకం కాకినాడకు చెందినవారు. ఆయన తండ్రి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేవారు. తల్లి కూడా ప్రభుత్వ అధికారి.
కాకినాడ నుంచి హైదరాబాద్‌ వచ్చేసిన ఏచూరి ఇక్కడ ఆల్‌ సెయింట్స్‌ స్కూల్‌లో పదవ తరగతి వరకూ చదివారు. 1969 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఆయన ఢిల్లీ వచ్చేశారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌ స్కూల్లో చేరిన యేచూరి హయ్యర్‌ సెకండరీ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సంపాదించారు. ఢిల్లీలోనే సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో ఎకనామిక్స్‌ లో బి.ఏ ఆనర్స్‌ పూర్తి చేసి, ఆ తర్వాత జవహర్లాల్‌ యూనివర్సిటీలో ఎం.ఏ చేశారు. ఎకనామిక్స్‌ లోనే డాక్టరేట్‌ కూడా చేద్దామనుకున్నారు కానీ, ఎమర్జెన్సీలో అరెస్టు కావడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన కొంత కాలం పాటు అజ్ఞాతంలో ఉండి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించారు కానీ, ఆ తర్వాత అరెస్టు కాక తప్పలేదు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన జవహర్‌ లాల్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి అధ్యక్షుడయ్యారు. అక్కడ ఆయన ప్రకాశ్‌ కారత్‌తో కలిసి విద్యార్థి సంఘాన్ని పటిష్ట పరిచారు. 1984లో ఆయన మార్క్సిస్టు పార్టీ కేంద్ర సమితిలో సభ్యుడయ్యారు. 1992లో ఆయన పార్టీ పాలిట్‌ బ్యూరోకు ఎన్నికయ్యారు. 2015 ఏప్రిల్‌ 15న విశాఖపట్నంలో జరిగిన పార్టీ 21వ కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
విశిష్టమైన వ్యక్తిత్వం
సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడంలో ఆయన నిర్వహించిన కీలక పాత్ర చరిత్రాత్మకమైంది. ఆయన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి. చిదంబరంతో కలిసి 1996లో యు.పి.ఏ సంకీర్ణానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఆ తర్వాత 2004లో కూడా ఆయన ఇటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి దేశంలో లౌకికవాద ప్రజాస్వామ్య విధానాలు పటిష్టం కావడానికి గట్టిగా కృషి చేస్తూ వచ్చారు. ప్రజాస్వామ్య వ్యతిరేక లేదా ప్రజా వ్యతిరేక విధానాలను ఏమాత్రం సహించేవారు కాదు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడం కోసం అవసరమైతే ప్రాణాలకు కూడా తెగించేవారు. ఆయనకు భిన్నత్వంలో ఏకత్వం మీద అపారమైన నమ్మకం ఉండేది. ఆయన హింసా విధ్వంస కాండలను ఏనాడూ సమర్థించలేదు. అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్నందువల్ల, ప్రతి విషయంలోనూ లోతైన విజ్ఞానం ఆయన సొంతం అయినందువల్ల, అంతర్జాతీయంగా అనేక అంశాల్లో తిరుగులేని పట్టు ఉన్నందువల్ల ఆయననే పార్టీ అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు తమ ప్రతినిధిగా పంపించేది. ఆయన మంచి వక్తే కాకుండా మంచి రచయిత కూడా. అనేక గ్రంథాలను రాశారు. హిందుస్థాన్‌ టైమ్స్‌ దినపత్రికలో ఆయన లెఫ్ట్‌ హ్యాండ్ డ్రైవ్‌ శీర్షికతో రెగ్యులర్‌ గా వ్యాసాలు రాసేవారు. పార్టీకి చెందిన పీపుల్స్‌ డెమొక్రసీ అనే పక్షపత్రికకు ఆయన 20 ఏళ్ల పాటు సంపాదకుడుగా వ్యవహరించారు.
ఇక 2005లో ఆయన పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న కాలంలో ఆయన ఎక్కువగా ప్రజా సమస్యలను మాత్రమే లేవనెత్తేవారు. రాజ్యసభ చర్చల్లో ఆయన క్రియాశీలంగా పాల్గొనేవారు. ఆయన భార్య సీమా చిస్తి ‘ది వైర్‌’ ఎడిటర్‌ గా పని చేస్తున్నారు. ఇంతకు ముందు ఆమె బి.బి.సి హిందీ విభాగానికి ఎడిటర్‌ గా పనిచేయడం జరిగింది. తన భార్యే తనను పోషిస్తున్నట్టు యేచూరి చెప్పేవారు. ఆమెకన్నా ముందు ఆయనకు వీణా మజుందార్‌ కుమార్తె ఇంద్రాణీ మజుందార్‌ తో వివాహం జరిగింది. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె కలిగారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా ఆయనకు స్వయానా మేనమామ. ఆయన కుమార్తె అఖిల ఎడిన్‌ బర్గ్‌ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగానికి అధిపతి. కాగా, ఆయన కుమారుడు ఆశిష్‌ 2021లో 34 ఏళ్ల వయసులో కోవిడ్‌ కారణంగా మరణించారు. న్యుమోనియా కారణం గా ఆగస్టు 19న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో చేరిన సీతారాం ఏచూరి అప్పటి నుంచి శ్వాసకోశ సంబంధమైన వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రోజున కన్నుమూసిన యేచూరికి కుమార్తె అఖిల, కుమారుడు డానిష్‌ ఉన్నారు. ఆయన మరణం దేశానికేకాక, జాతీయ రాజకీయాలకు తీరని నష్టం కలిగించాయనడంలో సందేహం లేదు.
జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News