తెలుగు బాలసాహిత్యానికి నేటి తరం బ్రహ్మ, అనేకమంది రచయితలకు ఆయువు పోసిన ప్రముఖ బాలసాహితీ సంపాదకులు. రచయిత, టి. వేదాంత సూరి గారి స్వీయ అనుభవ అనుభూతుల మేళవింపుగా ఆవిష్కరించబడిన పిల్లల నవల “ఆ” ఇద్దరు.
తనకు ఎదురైన ప్రతి అనుభవాన్ని అనుభూతి చెంది దానిని అక్షరీకరించడం ఉత్తమ రచయితల సాధారణ లక్షణం. అందులో భాగంగానే రచయిత వేదాంత సూరి తన పిల్లల నివాస ప్రాంతమైన న్యూజిలాండ్ వెళ్ళగా అక్కడి తన ఇద్దరి మనవరాళ్లు ఆధ్య, ఆరియలతో రెండు సంవత్సరాల పాటు కరోనా దయవల్ల దగ్గరగా గడిపే సమయం కలిసి వచ్చింది.
ఈ రెండేళ్లలో వేదాంత సూరి గారు, పరాయి దేశంలో ఉన్న వేళ కూడా, అక్కడి స్థితిగతులు, ఆచారాలు,, ముఖ్యంగా భావితరం వారసులైన పిల్లల స్థితిగతులు ఆకళింపు చేసుకుని తన ఇద్దరి మనవరాళ్ల మానసిక స్థితిగతులు అబ్బురపరిచే సంఘటనలతో చక్కని పిల్లల నవల వ్రాసి వాళ్ళ మనవరాళ్లకు అక్షర కానుకగా అందించారు, ఇది రచయితలు అందరికీ ఆదర్శం.
అన్య భాషా దేశంలో పరాయి బాష పఠిస్తున్న ఆధ్య, ఆరియల, అల్లరి – పోట్లాటలు వారి ఆలోచనలు ఇందులో ఆసక్తికరంగా సాగుతాయి. వాళ్లు కేవలం అల్లరి పిల్లలే కాదు మంచి సృజన కార్లు కూడా…
సెలవులు వస్తే చాలు న్యూ ఇయర్, క్రిస్మస్ పండుగలకు స్నేహితులకు టీచర్లకు ఇవ్వడం కోసం సొంతగా తనదైన సృజనాత్మకతతో ఆధ్య గంటలు తరబడి గ్రీటింగ్ కార్డులు తయారు చేస్తుంది. తనకు పజిల్స్ చేయడం, బొమ్మలు వేయడం, చాలా చాలా ఇష్టం, ఇంతకీ ఆద్య వయసు నాలుగేళ్లు తన చెల్లి ఆరియ రెండేళ్ల పిల్ల.
ఆద్య గ్రీటింగ్ కార్డులు తయారు చేయడంలోని అంతరార్థం కూడా మనం గమనించాలి, అక్కడ ఆ వయసు నుంచే, ఒకరికొకరు అభినందించుకోవడం, ధన్యవాదాలు చెప్పుకోవడం, అలవాటు చేస్తారు. అలాగే ఆ దేశంలో పిల్లలకు చిన్న వయసు నుంచే ప్రకృతిని పరిచయం చేస్తారు, పెద్దవారు వాకింగ్ కి వెళుతూ పిల్లలను తీసుకువెళ్లి అక్కడి పచ్చిక బయళ్లలో పిల్లలను ఆటలకు వదిలేస్తారు, ఆద్య, ఆరియ కూడా పెద్దవాళ్లతో కలిసి ఫోటోల పార్కుకి వెళ్లడం అలవాటు. అక్కడి ప్రకృతితో పాటు అక్కడ దొరికే ఆహార పదార్థాలతో కూడా వాళ్ళు సరదా చేస్తారు.
ఇక్కడ ఒక విశేషం గమనించాలి, ప్రపంచమంతా క్రిస్టమస్, న్యూ ఇయర్, పండుగలు శీతాకాలంలో జరుపుకుంటారు. కానీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అది వేసవికాలం. మరో విశేషం ఏమిటంటే మనదేశంలోలా చర్చిలలో
ఏ హంగామా ఉండదు. ఎవరి ఇంటి వద్ద వారు పండగ జరుపుకుంటారు. దుకాణాలకు కార్యాలయాలకు సెలవులు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి, పిల్లలకు వారి వారి కేర్ సెంటర్లలో ముందుగానే పండగ జరిపి పిల్లలకు పుస్తకాలు బహుమతులుగా పంచుతారు, ఆద్యకు పుస్తకం బహుమతిగా వచ్చింది.
ఈ పండుగలు తర్వాత వీరికి వేసవి సెలవులు, సెలవుల్లో విధిగా అక్కడివారు పిల్లలను టూర్లకు తీసుకువెళతారు. ఆద్య ఆరియల అమ్మానాన్నలు టూర్ రెడీ చేశారు, ఇంక వారికి ఆనందమే ఆనందం. వాళ్ల అత్తయ్య వారికి టూర్ గిఫ్ట్ గా రెండు సూట్ కేసులు పంపింది.
న్యూజిలాండ్ రాజధాని విల్లింగ్టన్ కు కారు ప్రయాణం మొదలైంది, అక్కడి రహదారి ప్రయాణంలో కూడా చాలా విశేషాలే వుంటాయి.
పిల్లలను ఎప్పుడు పాఠశాల ప్రైవేటు తరగతులకే పరిమితం చేయకుండా, అవకాశం దొరికిన ప్రతిసారి ప్రకృతితో, సమాజంతో, కొత్త ప్రాంతాలతో, పరిచయం చేయాలన్న విషయం మనం ఇక్కడ ఆచరణాత్మకంగా అవగాహన చేసుకోవాలి.
విల్లింగ్ టన్, లో వాటర్ ఫాల్స్ బీచ్ లు, కిడ్స్ పార్కులు, వంటి బోలెడు ప్రాంతాలు అమ్మానాన్నలతో కలిసి చూసి తెగ ఆనంద పడిపోతారుపిల్లలు. కొన్నిచోట్ల భయపడిన సంతోషమే ఎక్కువ పొందుతారు. అక్కడి “జూ”లో రాబిట్స్, జింకలు, చేపలను ప్రత్యక్షంగా చూసిన ఆద్య, ఆరియ,లు ఎంతో సంబరపడిపోతారు. అంతకముందు వాటిని కేవలం బొమ్మల్లో మాత్రమే చూశారు, ఇలాంటి పర్యటన వల్ల పిల్లలకు చిన్నతనం నుంచి జీవకారుణ్యం అవడుతుంది. జంతువులు అంటే భయం పోయి వాటిని ప్రేమగా చూస్తే అవి కూడా ఎలాంటి హాని చేయవనే నిజం పిల్లలకు అర్థమవుతుంది, ఈ ఇద్దరు పిల్లలు ఈ టూర్ లో ఇదే నేర్చుకున్నారు.
ఆద్య, మాటల్లో ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తాయి ఇది ప్రతి పిల్లలకు మనం అలవాటు చేయాల్సిన లక్షణం. పిల్లలకు టూర్ లే కాదు, బంధువుల ఇళ్లకు తీసుకు వెళుతూ బంధుత్వంలోని మంచితనం, లాభాలు, సంతోషాలు, పిల్లలకు చిన్న వయసు నుంచే అలవాటు చేస్తూ ఉండాలి. ఆద్య, ఆరియా లు. తరచూ వాళ్ల మేనత్త మామయ్యల ఇంటికి వెళుతూ ఉంటారు. అంతేకాదు అమ్మ నాన్నల ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు వీరు వెళుతూ ఉంటారు. అంత చిన్న వయసులోనే ఆరియ వచ్చిన వాళ్ళందరికీ “టి” అందిస్తుంది. అతిధి మర్యాదలు చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పాలి అనే విషయం రచయిత ఇక్కడ ఆవిష్కరిస్తారు..
ఆద్య , ఆరియల చదువులు కూడా భలే సరదాగా సాగుతాయి. అక్కడ పిల్లలు ఇష్టాలకు అనుగుణంగా చదువుకునే వీలుంటుంది, పెద్దవారి కోరికలు పిల్లల మీద బలవంతంగా రుద్దరు. ఈ పిల్లల చదువుల్లో బట్టి పట్టడాలు, పరీక్షలు కాపీ కొట్టడాలు, కఠినమైన శిక్షలు, కనిపించవు అక్కడి పిల్లల చదువుల్లో సృజనాత్మకత దాగి ఉంటుంది. వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి ఈ చదువులు బాగా ఉపకరిస్తాయి.
ఇక పిల్లలకు చేసే పుట్టినరోజు పండుగలే కాక తెలుగు పండుగలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, గుళ్ళు తదితర ప్రాంతాలను ఆధ్య, ఆరియలకు వాళ్ళ అమ్మానాన్నలు తరచూ పరిచయం చేస్తూ ఉంటారు. ఇక అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు సరేసరి.
ఈ బుల్లి నవల కేవలం ఆద్య, ఆరియ, అనే ఇద్దరు అమ్మాయిల కేంద్రంగా సాగినా. అనేక విషయాలను విశేషాలను మనకు అందిస్తుంది. ఈ నవలలో ఎలాంటి సస్పెన్స్ లు, మలుపులు, లేకపోయిన, సాధారణంగా మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనల సమాహారంగా నడిపించడం, పఠనా శక్తి లోపించకుండా జాగ్రత్త పడటంలో నవలా రచయిత “వేదాంత సూరి” గారు శతశాతం విజయం సాధించారు.
విదేశాలలో బాల్యానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి అక్కడి వాతావరణ పరిస్థితులు సంస్కృతి సాంప్రదాయాల గురించి కూలంకషంగా తెలుసుకోవాలనుకునే పిల్లలతో పాటు పెద్దలంతా విధిగా చదవాల్సిన పిల్లల నవల ఇది.
“ఆ” ఇద్దరు (నవల) , పేజీలు:72, వెల:100/- రూ,రచన: టి. వేదాంత సూరి, సెల్: 984899 2841.
సమీక్షకుడు: డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్:7729883223.