తెలుగు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కుల వర్గ దృక్పథంతో వెలువడిన అభ్యుదయ నవల ‘మాలపల్లి’. ప్రముఖ సంఘ సంస్కర్త, అభ్యుదయవాది, సాహిత్య విమర్శకుడు, తెలుగు భాషా పరిశోధకుడు అయిన ఉన్నవ లక్ష్మీనారాయణ 1922లో రచించిన ఈ నవల అప్పట్లో కుల వివక్షకు సంబంధించి అనేక ప్రశ్నలను సమాజం మీదకు సంధించింది. అయితే, ఈ నవల రాసి వందేళ్లు పూర్తయినప్పటికీ ఆ ప్రశ్నలకు, విమర్శలకు ఇంతవరకూ సమాధానాలు మాత్రం దొరకలేదు. జాతీయోద్యమంలో భాగంగా పల్నాటి సీమలో సత్యాగ్రహంలో పాల్గొని రాయవెల్లూరు జైలులో ఉన్న సందర్భంలో ఆయన రాసిన నవల ఈ మాలపల్లి. దేశభక్తి పూరితంగా, సంస్కర ణాభిలాషతో ఆయన ఈ నవలను రాయడం జరిగింది. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక తిరుగులేని ప్రగతిశీలక నవల. ప్రపంచ సాహిత్యంలో ఒక మైలురాయి. సామాజిక దృక్పథానికి సంబంధించినంత వరకు ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పాల్సి ఉంటుంది. సంఘ సంస్కరణ సాహిత్యంలో ఇదొక ప్రామాణిక నవలగా కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది.
కాగా, ఇది పూర్తిగా వామపక్ష భావజాలంతో నిండిపోయి ఉంటుంది. ఇందులో జాతీయోద్యమ స్ఫూర్తి అడుగడుగునా కనిపిస్తుంది. సమున్నత మానవీయ విలువలకు అద్దం పడుతూ, అస్పృశ్యుల జీవితాలకు హృద్యంగా కళ్లకు కట్టిస్తుంది. స్వాతంత్య్రోద్యమ కాలం నాటి తెలుగువారి సామాజిక జీవన పరిస్థితులను పాఠకుల ముందుంచిన ఈ నవల అప్పటి చారిత్రక, సామాజిక, ఆర్థిక ఉద్యమాల సందర్భాలలో చోటు చేసుకున్న పరిణామాలను వాస్తవిక దృక్పథంతో సృజనాత్మకంగా తెలియజేసింది. అస్పృశ్యుల పట్ల ఉండాల్సింది సానుభూతి కాదని, అభ్యుదయ భావనలని, ఆదర్శాలు వల్లించడం కాదని, ఆచరణ ప్రధానమని ఈ నవలలోని పాత్రలు అడుగడుగునా సమాజానికి గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇది లియో టాల్‌స్టాయ్ రాసిన ‘వార్ అండ్ పీస్’కు సరిసమానమైనదని ఒకప్పుడు ఆచార్య రంగా పోల్చడం జరిగింది.
సుమారు 1877 ప్రాంతంలో గుంటూరు జిల్లాలో జన్మించిన ఉన్నవ లక్ష్మీ నారాయణ ఇంగ్లండ్లోని డబ్లిన్ యూనివర్సిటీలో బారిష్టర్ చదువుతుండగా అక్కడ ఐరిష్ హెూయ్‌రూల్ జాతీయోద్యమ నాయకుడైన డీవాలేరాతో పరిచయం ఏర్పడింది. ఆయన నుంచే లక్ష్మీనారాయణ ఆధునిక భావాలను, అభ్యుదయ భావాలను పుణికిపుచ్చుకోవడం జరిగింది. ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత మద్రాసులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ వృత్తిని వదిలిపెట్టి జాతీయోద్యమంలో చేరారు. క్రమంగా గాంధేయవాదిగా మారడం జరిగింది. అయితే, గాంధీజీ అభిమాని, కాంగ్రెస్వేది అయినప్పటికీ, ఆయన మత ప్రాతిపదిక మీద జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని గట్టిగా వ్యతిరేకించి సంచలనం సృష్టించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా పల్నాడులో అటవీ నిబంధనలకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా పుల్లరిలో జరుగుతున్న ఉద్యమంలోనూ, తర్వాత ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్కిట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలు శిక్షలు అనుభవించారు. ఇక 1917లో బోల్ష్‌విక్ ఉద్యమం వల్ల ప్రభావితమైన తెలుగు సాహిత్యవేత్తలలో ఉన్నవ కూడా ఒకరు.
ఉద్యమాల ప్రభావం
ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నప్పటికీ, మొదటి నుంచి ఆయన మనసంతా సంఘ సంస్కరణల చుట్టూనే తిరుగుతుండేది. వితంతువులు, అనాథలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి కొనసాగుతూనే ఉండేది. సామాజికంగా తనకు ఎదురవుతున్న ఆటంకాలను, ప్రతికూలతలను, అవరోధాలను లెక్క చేయకుండా ఆయన 32 మంది వితంతువులకు పునర్వివాహం జరిపించారు. 1902లో గుంటూరులో వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేసిన ఉన్నవ ఆ తర్వాత శారదా నికేతన్ అనే పేరుతో ఒక మహిళా సంక్షేమ సంస్థను ఏర్పాటు చేసి, స్త్రీలకు వృత్తి విద్యలలో శిక్షణనిప్పించేవారు. దళితుల అభ్యున్నతి కోసం నడుం బిగించిన ఉన్నవ ఆలయ ప్రవేశాలు, సంహపంక్తి భోజనాలకే తన దళితుల అభ్యున్నతి దీక్షను పరిమితం చేయకుండా, వారి సమగ్ర అభివృద్ధి కోసం అనేక మార్గాలు చేపట్టారు. ముఖ్యంగా సాహిత్యపరంగా కూడా ఆయన రచనలు ప్రారంభించారు. ఎంతో సామాజిక స్పృహతో ఆయన దళితుల సమస్యలను సామాజిక, ఆర్థిక దృక్కోణాల నుంచి పరి శీలించి, రచనలు చేయడం ప్రారంభించారు. అయితే, ఈలోగా స్వాతంత్యానికి సంబంధించిన ఉద్యమాలలో పాల్గొంటున్న కారణంగా ఆయనను రాయవెల్లూరు జైలులో పెట్టడం జరిగింది. అక్కడ ఆయన 762 పేజీల ‘మాలపల్లి’ నవలను రాయడం పూర్తి చేశారు.
నవలా సారాంశం ఏమిటంటే, దళితులలో కూడా అట్టడుగున ఉన్న మాల దాసరి కులస్థుడైన రామదాసు కుటుంబానికి సంబంధించిన కథ ఇది. ఆయన తన భార్యాపిల్లలతో కలిసి రొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతని కుమారుడు 800 ఎకరాల ఆసామీ అయిన చౌదరయ్య దగ్గర పని చేస్తుంటాడు. రామదాసు కుమారుడు సంగదాసుకు, చౌదరయ్య కుమారుడు రామానాయుడుకు మధ్య స్నేహం ఏర్పడుతుంది. రామానాయుడు అభ్యుదయ భావాలు కలిగిన యువకుడు. అయితే, వీరి స్నేహం, వీరి కార్యకలాపాలు గిట్టని చౌదరయ్య రామదాసు కుటుంబానికి అనేక సమస్యలు సృష్టిస్తాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో జరిగే అనర్థాలు, అఘాయిత్యాల కారణంగా నిమ్న కులాలు, అగ్ర కులాల మధ్య ఏర్పడిన వైషమ్యాలను ఉన్నవ ఈ నవలలో అద్భుతంగా, మానవీయంగా చిత్రీకరించారు. అట్టడుగు వర్గాలలో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తిని, తిరుగుబాటు ధోరణిని కళ్లకు కట్టించారు. ఈ నవలలో ఆయన కొన్ని ప్రభోదాత్మక గేయాలను కూడా పొందు పరచడం విశేషం. ఈ నవల ఆద్యంతం చదివిస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. స్పూర్తిని కూడా ఇస్తుంది.
– జి. రాజశుక