Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్UCC in Parliament: గోవాలో చక్కగా అమలవుతున్న ఉమ్మడి పౌర స్మృతి

UCC in Parliament: గోవాలో చక్కగా అమలవుతున్న ఉమ్మడి పౌర స్మృతి

రాజస్థాన్‌ కు చెందిన బీజేపీ ఎం.పి కిరోడీ లాల్‌ మీనా రాజ్యసభలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి)కి సంబంధించిన ప్రైవేట్‌ బిల్లును ప్రవేశపెట్టారో లేదో, అల్పసంఖ్యాక వర్గాలు, లౌకికవాదులు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఆ బిల్లును, ఆ బిల్లును ప్రవేశపెట్టిన వారిని గట్టిగా తెగనాడారు. ఆ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకోవాలన్నదే వారి లక్ష్యం. దేశంలోని కొన్ని పత్రికలు కూడా అందుకు త గ్గట్టుగానే వ్యవహరించాయి. ఉమ్మడి పౌర స్మృతి బిల్లుపై రాజ్యసభలో గందరగోళం, మీనా తీరుపై ప్రతి పక్షాల నిరసన అంటూ పతాక శీర్షికలతో వార్తలు రాశాయి. ఈ బిల్లును ఏదో విధంగా మూడు సార్లు నిరోధించగలిగారు కానీ, నాలుగవసారి 63-23 ఓట్ల తేడాతో విజయవంతంగా ఈ బిల్లును ప్రవేశపెట్ట గలిగారు. ఈ బిల్లు మీద ఎందుకింత గందరగోళం అని ఎవరైనా అడిగితే అడగవచ్చు. ఇక్కడ మొట్ట మొదటగా గమనించాల్సిందేమిటంటే, బ్రిటిష్‌ పాలకులు తమ ‘విభజించి పాలించు’ సిద్ధాంతంలో భాగ౦గా భారతదేశంలో అనేక ప్రత్యేక వ్యక్తిగత చట్టాలను రూపొందించి అమలులో పెట్టారు. ఈ ఉమ్మడి పౌర స్మృతి కూడా అందులో ఒకటి. విచిత్రమేమిటంటే, 1947 ఆగస్టులో కాకుండా 1961 డిసెంబర్లో పోర్చుగీసు వారి నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన గోవాలో మాత్రం ఈ ఉమ్మడి పౌర స్మృతి చక్కగా అమలు జరుగుతోంది. అక్కడ 1867 నుంచే ఈ చట్టం అమలు జరుగుతోంది.

- Advertisement -


కుల, మత వివక్ష లేకుండా దేశంలోని ప్రతి వ్యక్తికీ వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకు రావాల ని స్వతంత్ర భారతదేశంలో మొదట్లోనే ప్రయత్నం జరిగింది. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ, దేశ మొదటి న్యాయశాఖ మంత్రి బి.ఆర్‌. అంబేద్కర్‌ ఈ ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశ పెట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు. అయితే, ఇటువంటి చట్టం స్థానంలో ఉమ్మడి హిందూ చట్టం ఒకటి రూపుదిద్దుకుంది. ఆ బిల్లు హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు వర్తిస్తుందే తప్ప ముస్లింలు, క్రై స్తవులు, పార్శీలకు వర్తించదు. ఈ చట్టాన్ని ఆ విధంగా రూపొందించడం జరిగింది. ఇలా చేయడం వల్ల ముస్లిం మతంలోని మహిళలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతోంది. ఇందుకు షాబానో కేసు ఒక ప్రబల ఉదాహరణ. ‘త్రిపుల్‌ తలాక్‌’ను నిషేధిస్తూ ఆ తర్వాత వచ్చిన చట్టం ఇందులో కొంత నష్టాన్ని భర్తీ చేసింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ ఉమ్మడి పౌర స్మృతి కోసం ఒక రకమైన ఆరాటం ప్రారంభమైంది. పాలక పక్షం, ప్రభుత్వ వర్గాలతో పాటు, మరికొన్ని పలుకుబడి కలిగిన, ప్రభావితం చేయగల వర్గాల నుంచి కూడా ఈ బిల్లు గురించి ఒత్తిడి వస్తోంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఈ అంశంపైన చర్చ కూడా ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్ లు, చివరికి కేరళ కూడా ఈ బిల్లు కోసం ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. అయితే, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ బోర్డు (ఏ.ఐ.ఎం.పి. ఎల్‌.బి) వంటి అల్పసంఖ్యాక వర్గాల సంస్థల నుంచి దీనికి మొదటి నుంచీ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును తీసుకు రావడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకమని ఆ సంస్థ విమర్శిస్తోంది. కొందరు లౌకికవాదులు కూడా ఇదే రకమైన విమర్శలు చేయడం జరుగుతోంది. ఇక విదేశీ పత్రికలు, విదేశీ మేధావులు కూడా దీన్ని ‘హిందుత్వను రుద్దే ప్రయత్నం’గా అభివర్ణిస్తున్నారు.


బిల్లు పూర్వాపరాలు
ఇక బిల్లు విషయానికి వస్తే, ఇది ప్రైవేట్‌ బిల్లే తప్ప దీనికి అధికారిక మద్దతు, అధికారిక ప్రోత్సాహం ఉందో లేదో ఇదమిత్థంగా తెలియలేదు. ఏతావతా, ప్రస్తుతానికి ఇది అధికారిక బిల్లు కాదు. ఇంతకూ ఈ కిరోడీ లాల్‌ మీనా ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఆయన వైద్య పట్టభద్రుడు. తన ఊర్లో వైద్యం చేస్తూ ఉంటాడు. అందులోనూ పేదలకు ఉచితంగా వైద్యం చేస్తుంటాడు. అందువల్ల ఆయనను అందరూ ’బాబా’ అనే సంబోధిస్తుంటారు. ఆయన మొదటిసారి 2020 మార్చిలో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు. అయితే, ఇదే విధంగా కొందరు ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అది

సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం ఆయన తన ప్రయత్నంలో విజయం సాధించారు. పాలక బీజేపీకి చెందిన కిరోడీ లాల్‌ మీనా రాజస్థాన్లో అత్యంత పట్టు పలుకుబడి ఉన్న ‘మీనా’ అనే ఆదివాసీ కులానికి చెందిన వ్యక్తి. ఆదివాసీ కులాలంటే సహజంగానే అల్పసంఖ్యాక వర్గాలనీ, వారికి హిందూ మతం అంటే ఏమంత ఆసక్తి ఉండదనీ, వారికి ఉమ్మడి పౌర స్మృతి అంటే గిట్టదనీ ఒక భావన ఉంది. అయితే, అందుకు విరుద్ధంగా ఆయన హిందుత్వవాది. ఆయన మీనా కులంతో మమేకం అవుతూనే, హిందుత్వ కోసం పాటుపడుతుంటాడు.


రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వసుంధరా రాజే అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రబల అసమ్మతి నాయకుడు. ఓ పదేళ్ల పాటు ఆయన బీజేపీకి దూరంగానే ఉన్నారు. ఆమె బీజేపీ నాయ కురాలైనప్పటికీ, మీనాను అనేక విధాలుగా అప్రదిష్టపాలు చేయడానికి ప్రయత్నించారు. ఆయన బీజేపీ టికెట్‌ మీద కాకుండా, దౌసా నియోజకవర్గం నుంచి శాసనసభకే కాక, లోక్సభకు కూడా ఎన్నిక కావడాన్ని బట్టి, రాష్ట్రంలో ఆయనకు ఉన్న మంచి పేరు ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన తన మీనా కులానికే కాక, అనేక వర్గాల ప్రజలకు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి అనేక విధాలుగా సేవ చేశారు. ఆయన మత వివక్ష లేకుండా ఇతర మతాల వారికి కూడా ఆర్థికంగా, సామాజికంగా, రా జకీయంగా సహాయపడ్డారు. అయితే, ప్రతిపక్షాలకు మాత్రం ఆయన అంటే కంటగింపు. రాజ్యసభలో ఆయన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు డి.ఎం.కె సభ్యుడు తిరుచ్చి శివ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, లౌకిక విలువలకు వ్యతిరేకమని విమర్శించారు. అయితే, ఆయనకు ఒక విషయం తెలియకపోవచ్చు. ”రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 కింద, ఆదేశ సూత్రాల ప్రకారం ఈ ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశ ప్రజలందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది” అని అందులోనే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే రాజ్యాంగం ప్రకారం, ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లౌకికవాదానికి రాజ్యాంగం వ్యతిరేకం కాదు కదా!

ఈ బిల్లు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, వివిధ వర్గాల మధ్య చిచ్చుపెడుతుందని, వైవిధ్యంతో కూడిన భారతీయ సంస్కృతికి ఇది గొడ్డలిపెట్టని కొందరు సభ్యులు వాదించారు. ‘బ్రిటిషు వారు ప్రత్యేక వ్యక్తిగత బిల్లులు ప్రవేశపెట్టడమే దేశాన్ని విభజించి పాలించడానికి. దీన్ని చక్కదిద్దడానికే, అంటే దేశాన్ని సం ఘటితంగా ఉంచడానికే ఉమ్మడి పౌర స్మృతిని ఉద్దేశించడం జరిగింది. అల్పసంఖ్యాక వర్గాలను ప్రత్యే కంగా చూడడం ఏవిధంగా దేశ ఐక్యతకు తోడ్పడుతుంది’ అని పాలక పక్ష సభ్యులు వాదించారు. ‘వైవి ధ్యమంటే వివిధ వర్గాలను వివిధ రకాలుగా పరిగణించడమా? ఇలా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధం కాదా’ అని కూడా వారు ప్రశ్నించారు. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వగైరా విషయాల్లో అందరికీ ఒకే విధమైన చట్టాలుంటే అందులో తప్పేమిటి? ఉమ్మడి పౌర స్మృతి బిల్లు అంటే, మతాచా రాల్లో, మత సంప్రదాయాల్లో కల్పించుకోవడం కాదు. ఏ వర్గానికి చెందిన వ్యక్తికయినా, ఎక్కడైనా, ఎప్పు డైనా న్యాయం కావాల్సి వచ్చినప్పుడు మత సూత్రాల కారణంగా అణచివేతకు గురి కాకుండా, కోర్టులను ఆశ్రయించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. అన్ని మతాల వారికి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించ డానికి ఈ బిల్లు అవకాశం ఇస్తుంది.


సాధారణంగా ప్రైవేట్‌ బిల్లులు ఫైళ్లలో దుమ్ముకొట్టుకుపోతుంటాయి. వీటిని అధికారికంగా చర్చకు, ఆమోదానికి చేపట్టాలంటే ప్రత్యేకంగా బ్యాలెట్‌ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, ఉమ్మడి పౌర స్మృతి బిల్లు కోసం దేశవ్యాప్తంగా ఆరాటం పెరుగుతోంది. సమయం వచ్చినప్పుడు ఎవరూ దేనినీ ఆపలేరు. బహుశా ఈ బిల్లుకు కూడా సమయం వచ్చి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News