Tuesday, May 21, 2024
Homeఓపన్ పేజ్Nitish Kumar: నితీశ్ కుమార్ అడుగులు ఎటువైపు ?

Nitish Kumar: నితీశ్ కుమార్ అడుగులు ఎటువైపు ?

రాజకీయాలకు గుండెకాయలాంటి హిందీ బెల్ట్‌లో పట్టు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఢీకొట్టేంతటి సామర్థ్యం లేదని నితీశ్ కు తెలుసు

ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగించాయి భాగస్వామ్యపక్షాలు. ఈ పరిణామం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మింగుడపడక పోవచ్చు. ఇప్పుడు నితీశ్ కుమార్ ఏం చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నితీశ్, ఒక్క రాజకీయ పార్టీకి కట్టుబడి ఉండే మనిషి కాదు. గతంలో అనేకసార్లు ఆయన కమలం పార్టీతో కలిసి ప్రయాణించారు, దూరం జరిగారు. ఈ మొత్తం ఎపిసోడ్ గమనిస్తుంటే లోక్‌సభ ఎన్నికలలోగా నితీశ్ కుమార్, ఇండియా అలయన్స్‌ కు గుడ్‌బై కొట్టి ఎన్డీయే కూటమిలోకి ఎంట్రీ ఇస్తారన్న అనుమానాలు వస్తున్నాయి.

- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో దళిత కార్డు ప్రయోగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇండియా కూటమి సారథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. ఇండియా కూటమిలో అతి పెద్ద పార్టీ కాంగ్రెస్సే. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు అప్పగించడం ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇండియా కూటమి సారథి అవడం అంటే పరోక్షంగా ప్రధాని అభ్యర్థి అని తేల్చి చెప్పడమే. లోక్‌సభ ఎన్నికల రంగంలోకి ఒకవైపు అయోధ్య రామమందిర అంశంతో భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగుతుంటే మరోవైపు దళిత కార్డుతో ఇండియా కూటమి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రజాకర్షణ మరే ఇతర నాయకుడికి లేదన్నది వాస్తవం. ఛరిష్మా విషయంలో రాహుల్‌,సోనియా గాంధీ, నితీశ్ కుమార్ వీరందరూ నరేంద్ర మోడీకి చాలా దూరాన ఉంటారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి, ఇండియా అలయన్స్ భాగస్వామ్యపక్షాలకు తెలియనిది కాదు. అయినప్పటికీ ప్రతిపక్షాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఆశ నెలకొంది. మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి సారథిగా ఎంపిక కావడంతో దేశవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాలన్నీ తమకు మద్దతుగా ఉంటాయన్నది దింపుడు కళ్లెం ఆశ. కన్వీనర్ అనేది ఇండియా కూటమికి సంబంధించిన మరో కీలక పదవి. ఈ పదవికి ఇండియా కూటమి ఏర్పాటుకు చొరవ చూపిన బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్‌ యునైటెడ్ అధినేత నితీశ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. చాలా మంది నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించారు. అయితే కన్వీనర్ పదవి తీసుకోవడానికి నితీశ్ కుమార్ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. అయితే నితీశ్ కుమార్ స్వతహాగా చిన్నచిన్న పదవులతో సంతృప్తిపడే బాపతు కాదు. ఒకదశలో ఏకంగా ఇండియా కూటమి నాయకత్వాన్నే నితీశ్ కుమార్ ఆశించారు. ఇండియా అలయన్స్ చీఫ్‌గా ప్రధాని పదవి అభ్యర్థి కావాలన్నది నితీశ్ కుమార్ ఆశ. అయితే అలయన్స్‌లో అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ కావడంతో మిగతా భాగస్వామ్యపక్షాలు వెనక్కి తగ్గాయి. దీంతో కాంగ్రెస్ నాయకుడికే ఇండియా కూటమి అధ్యక్ష పదవి లభించింది.ఈ ఆశాభంగంతోనే కన్వీనర్ పదవిని కూడా నితీశ్ కుమార్ వద్దని చెప్పి ఉండొచ్చు.

గతంలో అనేకసార్లు బీజేపీతో చెట్టాపట్టాల్ !
ఇండియా కూటమి అధ్యక్ష పదవి దక్కకపోయిన నేపథ్యంలో నితీశ్ కుమార్ ఇప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరిగేంతవరకు నితీశ్ కుమార్ స్వంత పార్టీ జేడీ (యు), ఇండియా కూటమిలో కొనసాగుతుందా ? అనే సందేహం కలుగుతోంది. పైపెచ్చు జేడీ (యు)కు నితీశ్ కుమార్ ఇటీవల రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో 2016 నుంచి 2020 వరకు జేడీ (యు) అధ్యక్షుడిగా నితీశ్ కుమారే వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో జేడీ (యు) కొనసాగుతుందా ? లేదా ? అనేది పూర్తిగా నితీశ్ కుమార్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. వాస్త‌వానికి నితీశ్ కుమార్ సోష‌లిస్టు ఐడియాల‌జీతో ప్ర‌భావితుడైన నేత‌. జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఆయ‌న రాజ‌కీయ గురువు. సెక్యుల‌ర్ వాదిగా పేరున్న నితీశ్ కుమార్ చాలా కాలం పాటు బీజేపీకి దూరంగా ఉన్నారు. అయితే బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్‌ ( ఆర్జేడీ) ని దెబ్బ‌తీయ‌డానికి ఒక దశలో క‌మ‌లం పార్టీతో చేతులు క‌లిపారు. 2014 లోక్‌సభ ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌రేంద్ర మోడీని ఎన్డీయే కూటమి తరఫున ప్ర‌ధాని అభ్యర్థిగా ప్ర‌క‌టించ‌డాన్ని నితీశ్ కుమార్ వ్య‌తిరేకించారు. అంతటితో ఆగలేదు. ఎన్డీయే కూట‌మి నుంచి నితీశ్‌ బ‌య‌ట‌కు వెళ్లారు. అదే సమయంలో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుటుంబ పార్టీగా పేరు పడిన ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని నితీశ్ కుమార్ అధికారంలోకి వచ్చారు. అయితే న‌రేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత నితీశ్ మళ్లీ ఎన్డీయే కూట‌మిలో చేరారు. కొంతకాలం బీహార్‌లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్‌ కుమార్ ముఖ్య‌మంత్రిగా వ్యవహరించారు. దీంతో పార్టీలు మారడంలో ఘనాపాఠిగా జాతీయ రాజకీయాల్లో నితీశ్ పేరుతెచ్చుకున్నారు.అందుకనే నితీశ్‌ కుమార్‌ను ఏ రాజకీయ పార్టీ అంత త్వరగా నమ్మదు. ఫాల్తురామ్‌గా హిందీ బెల్ట్‌లో నితీశ్ కుమార్ అపప్రథ మూటగట్టుకున్నారు. పార్టీలు మారే సంగతిని పక్కన పెడితే ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ సమర్థత చాటుకున్నారు.వికాస్ పురుష్ అంటూ బీహార్ ప్రజలు ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. దేశ రాజ‌కీయాల్లో ఒక ద‌శ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి దీటైన ప్ర‌త్య‌ర్థి నితీశ్ కుమారే అనే ప్ర‌చారం కూడా న‌డిచింది. వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో ఆధునికుడిగా నితీశ్ కుమార్‌కు పేరుంది.

ఎన్డీయే కూటమిలోకి మళ్లీ జేడీ ( యు ) ?
లోక్‌సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమిలో అనేక మార్పులు సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల చత్తీస్‌గఢ్‌,రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తరువాత నితీశ్ కుమార్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇండియా కూటమి వ్యవహారాల్లో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం పెట్టిన శ్రద్ధ, ఇండియా కూటమి వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ పెట్టడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు దేశ రాజకీయాలకు గుండెకాయలాంటి హిందీ బెల్ట్‌లో పట్టు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఢీకొట్టేంతటి సామర్థ్యం లేదని నితీశ్ కుమార్ ఒక అంచనాకు వచ్చి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి వైపుగా నితీశ్ కుమార్ అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడో విషయం ఉంది. నరేంద్ర మోడీ -అమిత్ షా ద్వయానికి నితీశ్ కుమార్ అంటే పెద్దగా పడదంటారు రాజకీయ పరిశీలకులు . అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ. పైపెచ్చు బీహార్‌లోని బలమైన సామాజికవర్గమైన కుర్మీల్లో నితీశ్ కుమార్‌కు పట్టుంది. దీంతో 400 సీట్ల లక్ష్య సాధనలో భాగంగా నితీశ్ కుమార్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం స్వాగతం పలికినా, ఎవరూ ఆశ్చర్యపోనక్కర లేదు.

            - ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్‌, 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News