మహిళల భద్రత కోసం, రక్షణ కోసం రూపొందించిన చట్టాల కారణంగా కావొచ్చు. హక్కుల కోసం మహిళలు సాగిస్తున్న పోరాటాల వల్ల కావొచ్చు. మహిళలకు తగ్గట్టుగా పురుషుల ఆలోచనా దృక్పథంలో వస్తున్న మార్పులు కావొచ్చు. ఇతరత్రా మరేవైనా కారణాలు కావొచ్చు. మొత్తం మీద మహిళలు మందకొడిగానైనా పురోగతి చెందుతున్నారు. తిరోగమనం చెందనందుకు సంతోషిం చాలి. నిజానికి దేశంలో మహిళల పరిస్థితి చాలావరకు అధ్వానంగానే కాకుండా కొద్దిగా విచిత్రంగా కూడా ఉంటోంది. ఒకపక్క కుటుంబంలో ఆడపిల్ల అల్లారు ముద్దుగా పెరుగుతుంది. ఇంట్లో ఆడపిల్ల పుట్టడాన్ని సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టినట్టుగా కూడా పరిగణిస్తారు. మరోపక్క తనను ఎవరు ఎంత అల్లారుముద్దుగా పెంచినా కుటుంబంలోని మగపిల్లలకు ఉన్న అవకాశాలు తనకు లేవనే సంగతిఆమెకు అతి తక్కువ కాలంలోనే తెలిసి వస్తుంది. ఇంట్లోని ఆడపిల్లను తెలివైనదని, ఏ పనైనా చేసుకుపోగలదని, సమర్థురాలని, ఇంట్లో అందరికీ ఎంతో సహాయకారిగా ఉంటుం దని పొగడ్తలతో ముంచేస్తుంటారు. కానీ, కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణ యాల్లో మాత్రం ఆమెను సంప్రదించేవారుండరు. చివరికి ఆమెకు సంబంధించిన నిర్ణయాలలో కూడా ఆమెకు పాత్రేమీ ఉండదు.
ఇటువంటి చిత్రవిచిత్రమైన స్వభావాలు, ధోరణులు ఎవరికైనా విడ్డూరంగా కనిపిస్తాయి. దేవుడి సృష్టిలో స్త్రీపురుషులిరువురూ సమానమేనని అందరికీ తెలుసు. సామాజికంగా కూడా ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని ప్రతివారూ చెబుతారు. కానీ, సమష్టి వ్యవహారంలో మాత్రం ప్రతి వారూ ఆడపిల్లలపై ఆంక్షలు, పరిమితులు విధిస్తుంటారు. సమానత్వం గురించి ఆణిముత్యాల్లాంటి మాటలతో ప్రసంగాలు చేస్తుంటారు. అయితే, సామాజిక స్థాయిలో ఆచార, సంప్రదాయాల ముసుగులో స్త్రీపురుషుల మధ్య అసమానతలను పెంచి పోషిస్తుంటారు. ఇది ఒక్క మన దేశంలోనో, మన రాష్ట్రంలోనో జరుగుతున్న వ్యవహారం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సర్వాంతర్యామి. ఆడపిల్ల జీవితమే అనేక ఆటంకాలు, అవరోధాలతో ప్రారంభం అవుతుంది. సమగ్ర, సంపూర్ణ పురోగతి సాధించామని చెప్పుకుంటున్న దేశాలలో సైతం మహిళలు అధ్యక్షులుగా, అధినేతలుగా ఎన్నిక కావడం కష్ట సాధ్య మైన విషయం. విచిత్రంగా కొన్ని దేశాలలో అయితే, మగ పిల్లల కంటే ఆడపిల్లలు అన్ని విధాలా తక్కువవారే. వారికి స్కూలుకు వెళ్లడం కూడా జీవన్మరణ సమస్యే.
వాస్తవానికి ఇటువంటివి భారతదేశంలో జరిగే అవకాశం లేదు. దేశ చరిత్రలో మహిళా యోధులకు కొదువ లేదు. మహిళా పండితులకు, పాలకులకు చరిత్రలో పెద్ద స్థానమే కల్పించడం జరిగింది. ఇప్పుడు కూడా దేశ నిర్మాణంలో మహిళ పాత్ర పెరు గుతూ పోతోంది తప్ప ఎక్కడా ఏ విషయంలోనూ తగ్గడం లేదు. కార్పొరేట్ సంస్థల అధినేతలుగానే కాక, సాయుధ దళాలలో సైతం రాణిస్తున్నారు. అయితే, ఇంటా బయటా రెండు చోట్ల తమ శక్తియుక్తులను నిరూపించుకోవాల్సి వస్తోంది. ఇందుకు వారేమీ బాధపడడం లేదు. తమపై నమ్మకం ఉంచాలని మాత్రమే వారు సమాజాన్ని కోరుతున్నారు. అట్టడుగు స్థాయిలో మహిళలు ఓ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నారు కానీ, ఉన్నత స్థాయిలో వీరి సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో, ఆశించిన విధంగా కనిపించడం లేదు. రాజకీయ రంగం, పాలనా యంత్రాంగం, అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ, కార్పొరేట్ సంస్థల్లో మహిళల సంఖ్య అత్యల్పమనే చెప్పాలి.
అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఈ రకమైన వివక్ష కొనసాగుతోంది. కేవలం విద్యతో మాత్రమే మహిళలకు రాజకీయ, ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదేమోననే అనుమానం కలుగుతోంది. సమాజంలో వ్యక్తుల దృక్పథంలోనే సమూలంగా మార్పు రావాల్సి ఉంది. లింగ వివక్ష అనేది సమాజంలో బాగా లోతుగా పాదుకుపోయింది. వ్యక్తి దృక్పథంలో దురభిప్రాయాలు, దురా చారాలు వేళ్లు పాదుకు పోయాయి. ఎవరికి వారు వీటిని గుర్తించి సమూలంగా తొలగిస్తే తప్ప, సమాజం శాంతియుతంగా, సామరస్యంగా పురోగతి చెందడం సాధ్యం కాదు. సామాజిక న్యాయం, సమానత్వం పెంపొందడానికి ప్రభుత్వపరంగా, సామాజికపరంగా కృషి జరుగుతున్న మాట నిజమే కానీ, ఈ కృషి వేగంగా, చిత్తశుద్ధిగా జరగడం లేదు. మహిళా ప్రాతినిధ్యం పెరిగేంతగా ఈ కృషి జరగాల్సిన అవసరం ఉంది. సామాజిక ఆంక్షలు, పరిమితులు, దురభిప్రాయాల కారణంగా విద్య, ఉద్యోగ రంగాలలో పురుషుల కంటే స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారన్నది వాస్తవం. విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలకు సంబంధించి పురుషులకంటే స్త్రీలు ఎంతో ప్రతిభను, నైపుణ్యాన్ని, దక్షతను ప్రదర్శిస్తున్నప్పటికీ, ఈ రంగాలలో వీరి ప్రాధాన్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే, మహిళలు పట్టుద లగా, పోరాటాల ద్వారా ముందుకు వెళ్లడాన్ని మాత్రం విరమించుకోలేదు. భారత దేశం భవిష్యత్తులో లింగ సమానత్వం విషయంలో ప్రపంచానికే ఆదర్శవంతం, స్ఫూర్తిదాయకం కాగలదని ఈపట్టుదలను గమనించినవారికి ఇట్టే అర్థమవుతుంది. దేశ పురోగతిలో మహిళలు ప్రధాన భాగమైతే, దేశం మరింత శాంతియుతంగా, సౌభాత్యవంతంగా ఉంటుందనడంలో సందేహం లేదు.