Wednesday, January 29, 2025
Homeఫీచర్స్Nobel to Mohammadi Narges: మొహ్మది ..ఇరాన్ మహిళల స్వేచ్ఛా గళం

Nobel to Mohammadi Narges: మొహ్మది ..ఇరాన్ మహిళల స్వేచ్ఛా గళం

సాహసం, తెగింపు, స్వేచ్ఛ, ఆధునికతను పుణికిపుచ్చుకున్న యోధురాలు

ఇరాన్ మహిళల హక్కుల సాధన ఆమె లక్ష్యం. ఇరాన్ లో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయాలన్నది ఆమె కోరిక. పౌరుల, స్త్రీల స్వేచ్ఛా సమానత్వాల సాధన ఆమె ఉద్యమ గీతం. వాటి సాధనకు యాక్టివిజాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. ఆ ప్రయాణంలో నిర్బంధాలు భయపెట్టలేదు ఆమెను. జైలు గోడలు ఆమె స్వేచ్ఛను  నిర్బంధించలేకపోయాయి. ఆమె మానవ హక్కుల పోరాటాన్ని నీరుగార్చలేకపోయాయి. ఇరాన్ మహిళలే కాదు ప్రపంచమంతా తన వెన్నుదన్నుగా ఉండడమే తన ఈ ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెడుతుందన్నారు.

- Advertisement -

ఏకాంతనిర్బంధంలో ఒంటరి ఖైదీగా, స్త్రీగా ఎంతో లైంగిక హింసను, వివక్షను ఎదుర్కొన్నారు. నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకోవడం తన పోరాటాన్ని మరింకెంతో బలంగా ముందుకు తీసుకెళ్లేలా తనకు స్ఫూర్తినిస్తుందని నినదించారు…

నార్గిస్ మొహమ్మది… ఎన్నో ఏళ్లుగా జైలులో నిర్భంధంలో ఉన్న ఇరాన్ మహిళా హక్కుల న్యాయవాది. ఈ ఏడాది శాంతి బహుమతి గ్రహీత. ఇరాన్ లో ఎంతో పేరున్న మానవ హక్కుల యాక్టివిస్టు. స్త్రీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న, మరణశిక్షను రద్దుచేయాలంటూ గళమెత్తిన, ప్రజాస్వామ్య స్థాపన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న యోధురాలు. ఆమెను ఇరాన్ పాలకులు ఎన్నిసార్లు అరెస్టు చేశారో లెక్క లేదు . కానీ  అవేమీ ఆమెలోని యాక్టివిజాన్ని నిస్తేజపరచలేదు. జైలులో ఆమె పన్నెండు సంవత్సరాలకు పైగా మగ్గుతున్నా ఆమె హక్కుల గళం మూగపోలేదు.

ఇరాన్ లో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా…ఉన్నతమైన అకడమిక్ స్థానాల్లో ఉంటున్నా…ప్రభుత్వ ఉద్యోగాల్లో పురుషులకు తీసిపోనివిధంగా ముందుంటున్నా…అక్కడి మహిళల జీవితాలు వారి చేతుల్లో లేవు. స్వేచ్ఛ అన్నది వారికి ఒక అందమైన కల అయింది.  స్త్రీలపై ఊపిరితిప్పుకోలేనంత నియంత్రణ, పురుషాధిక్యం కొనసాగుతోంది. వారిపై అణచివేత ఇంత అంత అని చెప్పలేం. ప్రతి స్త్రీ హిజాబ్ లేదా స్కార్ఫ్ తప్పనిసరిగా ధరించాలన్న చట్టాల కబంధహస్తాలు ఇరాన్ స్త్రీలను తీవ్ర అసహనానికి, ఆందోళనలకు గురిచేశాయి.

నార్గిస్ మొహ్మది చేబట్టిన మహిళా హక్కుల చైతన్య ఉద్యమం ఇరాన్ స్త్రీలలో లావాలా ఉప్పొంగింది. వారి నిరసనల వెల్లువ అక్కడి పాలకులను ఊపిరితిప్పుకోలేని విధంగా నిలబెట్టింది. అదే వారిని మొహ్మదీని టార్గెట్ చేసేలా చేసింది. కేవలం ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలోనే హిజాబ్ ను మ్యాన్డేట్ చేయడం చూస్తాం. నార్గిస్ మొహ్మది ప్రజాస్వామ్యం కోసం, సమానత్వం కోసం, మహిళా హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం వెన్నుచూపకుండా తన పోరును ముఫ్ఫై ఏళ్లకు పైగా అవిశ్రాంతంగా కొనసాగిస్తూనే వస్తున్నారు. తను కొనసాగిస్తున్న ఈ పోరు పథాన్ని మరింత ఉత్తేజితంగా, ధైర్యంగా ముందుకు సాగించేలా మరింత బలాన్ని,నిబద్ధతను, ఆశను నోబెల్ శాంతి బహుమతి తనలో నింపిందని మొహ్మది అంటారు.

ఇంజనీర్ అయిన 51 సంవత్సరాల మొహ్మది పదమూడుసార్లు జైల్లో నిర్బంధాన్ని చవిచూశారు. ఐదుసార్లు దోషిగా నిలబడ్డారు. 31 సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. టెహ్రాన్ లో ఎంతో అపఖ్యాతిపొందిన ఎవిన్ జైలులో ఎన్నో ఏళ్లుగా బంధీగా ఉన్నారు.  తన సోదరి మొహ్మదీకి నోబెల్ శాంతి బహుమతి రావడంపై స్పందిస్తూ ఈ అవార్డు ఇరాన్ లోని పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు అక్కడి పాలకుల్లో సైతం ఎలాంటి స్పందన ఉండదన్నారు. అక్కడ ప్రభుత్వం యాక్టివిస్టులపై అణచివేతను మరింత తీవ్రతరం చేస్తుందని వ్యాఖ్యానించారు.

అయితే మొహ్మది తరచూ ఒక మాటను అనేవారు. తనకు లభించిన ప్రతి అవార్డు తనను స్త్రీల హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం, మానవహక్కుల కోసం మరింత ఏకాగ్రతతో, పట్టుదలతో పనిచేసేలా ఉత్సాహాన్ని పెంచుతుందంటారు. అంతేకాదు మానవహక్కుల  సాధన, స్వేచ్ఛ, పౌర సమానత్వం, ప్రజాస్వామ్యం సాధన ప్రయత్నంలో తను మరింత ధైర్యంగా నిలబడేలా అవి చేస్తున్నాయంటారామె.  భర్త రహ్మానీ మొహ్మదీ చూసి పదకొండు సంవత్సరాలు దాటిపోయింది. ఆమె పిల్లలు తల్లిని ప్యత్యక్షంగా చూసి ఎన్నో ఏళ్లు అయింది. మొహ్మది కుమారుడు ఆలీ మాట్లాడుతూ ఈ అవార్డు తన తల్లికి మాత్రమే వచ్చింది కాదని, మొత్తం ఉద్యమానికి వచ్చిన బహుమతి అని వ్యాఖ్యానించారు. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న 19వ మహిళ మొహ్మది అయితే ప్రతిష్ఠాకరమైన ఈ అవార్డును కైవసం చేసుకున్న రెండవ ఇరాన్ మహిళగా మొహ్మది నిలిచారు.

ఈమెకు ముందు 2003లో నోబెల్ శాంతి బహుమతి మానవహక్కుల యాక్టివిస్టు షిరాన్ ఇబాదికి వచ్చింది. 122 సంవత్సరాల నోబెల్ శాంతి బహుమతి చరిత్రలో జైలు లేదా గృహ నిర్బంధంలో ఉన్న ఒక వ్యక్తికి ఈ అవార్డు రావడం ఇది ఐదవసారి. స్కార్ఫ్ సరిగా పెట్టుకోలేదని ఇరాన్ మొరాలిటీ పోలీసులు మొహసా అమిని అనే యంగ్ ఇరానియన్ కుర్ద్ ను అరెస్టు చేసి తీసుకువెళ్లడం, తర్వాత పోలీసు కస్టడీలో అమిని చనిపోవడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు అందరికీ గుర్తుండే ఉంటాయి.. 22 సంవత్సరాల అమిని మరణంతో ఇరాన్ అంతటా కల్లోలమైంది.  జనసముద్రం ప్రభుత్వంపై విరుచుకుపడింది. హక్కుల గళాలు అక్కడ మారుమోగాయి. ఆ సమయంలో నిరసనల ప్రదర్శనలు దేశమంతా వెల్లువెత్తాయి. అప్పుడు 500 మంది ప్రాణాలు కోల్పోతే, 22 వేల మందికి పైగా నిర్బంధించబడ్డారు. ఆ సందర్భంలో మొహ్మదీని ఇరాన్ పాలకులు నిర్బంధించారు. ఒక సందర్భంలో దీనిపై ప్రతిస్పందిస్తూ ప్రజలను ఎంతగా నిర్బంధిస్తే అంతగా తిరగబడతారని ప్రభుత్వం గ్రహించడం లేదని మొహ్మది వ్యాఖ్యానించారు కూడా.

జైలులో నిర్బంధానికి ముందు మొహ్మది నిషేధిత డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ ఉపాధ్యక్షురాలిగా ఉండేవారు. జర్నలిస్ట్, యాక్టివిస్టు, రైటర్ కూడా అయిన మొహ్మది గత  రెండు దశాబ్దాల కాలంలో ఎక్కువ కాలం జైలులో ఉన్నారు. హిజాబ్ ను తప్పనిసరి చేస్తూ అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలపై మొహ్మది తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది ఇరాన్ పాలకులకు మింగుడుపడలేదు. అంతర్జాతీయంగా మానవహక్కుల యాక్టివిస్టుగా మొహ్మదీకి ఎంతో పేరుంది. అది కూడా తన పోరాటాన్ని ఆపకుండా కొనసాగించేలా ఎంతో ధైర్యాన్ని ఇస్తోందంటారు మొహ్మది. 

మానవహక్కుల సాధన, స్వేచ్ఛల కోసం మొహ్మది చేస్తున్న అవిశ్రాంత కృషి, పోరాటాలు, అక్కడి మహిళలపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అణచివేత ధోరణులపై మొహ్మది నిబద్ధత, పోరాటమే ఆమెకు ఈ అత్యుత్తమ అవార్డు లభించడానికి కారణమని ఆమె అభిమానులు ఎందరో ఆనందంగా స్పందిస్తున్నారు.  స్త్రీలపై వ్యవస్థాగతంగా కొనసాగుతున్న అణచివేత, వివక్షతలపై మొహ్మది పోరాటం, ఆమె నెరిపిన ఉద్యమం ఎందరో మహిళల్లో స్వేచ్ఛాకాంక్ష పెల్లుబుకేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఇరాన్  స్త్రీలపై చూపుతున్న వివక్ష, అసమానతలను నిరశిస్తూ వారి పోరాటాన్ని గుర్తిస్తూ లభించిన శాంతి బహుమతి ఇదని సైతం ఎందరో అభిప్రాయపడుతున్నారు.

మానవహక్కుల సాధన కోసం మొహ్మది 1998-2020 ల మధ్యకాలంలో జైలులో ఒంటరి నిర్బంధాన్ని సైతం అనుభవించారు. 2020లలో విడుదలయినపుడు ఎవిన్, పలు ఇరాన్ జైళ్లల్లో తను ఒంటరి ఖైదీగా నిర్బంధంలో ఎదుర్కొన్న హింసను మొహ్మది ప్రపంచం ముందుంచారు. ప్రభుత్వానికి, దేశానికి వ్యతిరేకంగా మొహ్మది పనిచేస్తున్నారనే ఆరోపణలతో పాలకులు మొహ్మదీని సుదీర్ఘకాలంగా ఎవిన్ జైలులో నిర్బంధించారు.

ఆ రెండు కారణాలతోనే యాక్టివిజం వైపుకు…

మొహ్మది జాన్ జాన్ లో జన్మించారు. ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు.  మహిళా హక్కుల ప్రముఖ న్యాయవాదిగా ఇరాన్ లోనే కాదు అంతర్జాతీయంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది టెహ్రాన్ లో నెలకొల్పిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ తో కలిసిపనిచేశారు. నిషేధిత యాక్టివిస్టులకు సహాయపడ్డారనే ఆరోపణలతో 2011 సంవత్సరంలో మొదటిసారి జైలు నిర్బంధాన్ని మొహ్మది చవిచూశారు. 2013లో బెయిల్ పై విడుదలయ్యారు. అప్పుడు మొహ్మది మరణశిక్షను ఎత్తివేయాలని ప్రచారాన్ని చేపట్టారు. 2015లో తిరిగి అరెస్టయి జైల్లో నిర్బంధం అయ్యారు. దీంతో నిరుత్సాహపడని మొహ్మది తన హక్కుల గళాన్ని జైలులోని నాలుగు గోడల నుంచి గ్లోబల్ గా వ్యాపించేలా చేసి ఇరాన్ పాలకులకు చెమటలు పట్టించారు. ఫిజిక్స్ విద్యార్థిగా ఉన్నప్పుడు మొహ్మది యాక్టివిజం బాట పట్టారు. అలా స్త్రీల హక్కుల కోసం, మానవహక్కుల కోసం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛల కోసం మొదలైన మొహ్మదీ ప్రయాణంలో ఎన్నిమార్లు జైలు గోడలు లెక్కపెట్టారో. రాజకీయ ఖైదీలపై, మరీ ముఖ్యంగా మహిళా ఖైదీలపై పాలకులు కొనసాగిస్తున్న లైంగిక హింసను ప్రపంచం ముందు బయటపెట్టారు.

మొహ్మదీ యాక్టివిజం బాట పట్టడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. అవే ఆమెను మానవహక్కుల యాక్టివిస్టుగా, స్త్రీల హక్కుల కార్యకర్తగా, నాయకురాలిగా మలిచాయని ఆమె తరచూ చెప్పేవారు. మొహ్మది పసితనంలో ఆమె తల్లి జైలులో ఉన్న తన సోదరుడి దగ్గరకు తరచూ వెడుతుండేవారు. ఆమె వెంట మొహ్మదీ కూడా వెళ్లేవారట. ఇంకొక ముఖ్య కారణం ఏమిటంటే నిత్యం ఉరివేసే ఖైదీల గురించిన ప్రకటనలు టివిలో ప్రసారం చేసేవారట.  వాటిని మొహ్మది చూసేవారట. ఇవి రెండూ ఆమె మనసులో అలాగే నాటుకుపోయాయట. చదువుకునే రోజుల్లో రాజకీయ యాక్టివిస్టు అయిన తఘి రహ్మానీని ప్రేమించి వివాహమాడారు. ఆయనా తీవ్ర జైలు శిక్షను అనుభవించారు. ప్రస్తుతం తమ ఇద్దరి బిడ్డలతో ఆయన ఫ్రాన్స్ లో ప్రవాసంలో ఉన్నారు. హక్కుల పోరాటంలో మొహ్మదీ నిబద్ధత ఆమెను ఎంతో హింసకు, శిక్షలకు, నిర్బంధాలకు గురిచేసింది.  అయినా చెలించకుండా తన యాక్టివిజాన్ని ఎంతో ధైర్యంగా కొనసాగిస్తూ అంతర్జాతీయ మానవహక్కుల యాక్టివిస్టుగా ప్రఖ్యాతి పొందారు. 2022లో మొహ్మది రాసిన ‘వైట్ టార్చర్ ’ పుస్తకం పెద్ద సంచలనాన్ని సృష్టించింది. జైళ్లల్లో ఒంటరి ఖైదీగా తన అనుభవాలను ఆ పుస్తకంలో రాసారు. బిబిసి 100 మంది స్ఫూర్తిదాయక మహిళల్లో మొహ్మది కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News