Tuesday, May 21, 2024
Homeఫీచర్స్Rana Ayub: ఆమె అక్షరం ఆయుధం

Rana Ayub: ఆమె అక్షరం ఆయుధం

సంచలనాత్మక పరిశోధనాత్మక కథనం ‘గుజరాత్ ఫైల్స్: అనాటమీ ఆఫ్ ఎ కవరప్’ పుస్తక రచయిత,

- Advertisement -

ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టు రానా అయ్యూబ్ ఇటీవల ‘నేషనల్ ప్రెస్ క్లబ్’ నెలకొల్పిన జాన్

అబుషాన్ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలో 115 సంవత్సరాల నుంచి నడుస్తున్న జర్నలిస్టుల సంస్థ ఇది. ఆ సంస్థ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ జర్నలిస్టు రానా అయ్యూబ్. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు.

పరిచయం అక్కరలేని సంచలనాత్మక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు రానా అయ్యూబ్. రిపోర్టరుగా, ఎడిటర్ గా, కాలమిస్టుగా పలు ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ వార్తాపత్రికలకు పనిచేశారామె. రానా పరిశోధనాత్మక కథనాలకు ప్రపంచమంతటా అభిమానులు ఎలా ఉన్నారో అలాగే ఆమెకి శత్రువులు సైతం ఎక్కువగానే ఉన్నారు. కశ్మీర్ లో చెలరేగిన తిరుగుబాట్లు, మతపరమైన హింస, రాజ్యం (స్టేట్) చేస్తున్నహత్యలపై , అలాగే శ్రీలంకలో తమిళ టైగర్ల తీవ్రవాద కార్యకలాపాలపై నిర్భయంగా రిపోర్టు చేశారామె. ఎన్కౌంటర్ హత్యలపై సంచలనాత్మక కథనాలు వెలువరించారు. ప్రాణాలకు తెగించి ఆమె చేసిన గుజరాత్ ఫైల్స్ వంటి రహస్య పరిశోధనాత్మక కథనాలను పరిశోధనాత్మక మ్యాగజైన్ తెహల్కా

మొదలు దేశంలోని పలు వార్తాపత్రికలు ప్రచురించడానికి నిరాకరించడంతో ఆమెనే దాన్ని పుస్తక రూపంలో ఎంతో ధైర్యంగా బయటకు తెచ్చారు. ఆ పుస్తకం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘అమెరికన్ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ కన్సర్వేటరీ’ ఫిలిం విద్యార్థినిగా రానా అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టింది. మైథిలి త్యాగి అనే పేరుతో పది నెలలు రహస్య పరిశోధన చేసి 2002లో గుజరాత్ లో జరిగిన మారణ హోమం వెనుక గుజరాత్ లోని అప్పటి మోదీ ప్రభుత్వ పాత్రను బట్టబయలు చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, అతని మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలో పాల్పడిన ముస్లిం వ్యతిరేక మారణహోమాన్ని ఆమె చేసిన ఈ కథనాలు బయటపెట్టాయి. దేశ ప్రధాని అయిన మోదీని, మోదీ ప్రభుత్వ హిందూత్వ, ముస్లిం వ్యతిరేక విధానాలను రానా ఎప్పుడూ నిర్భయంగా ప్రశ్నిస్తూనే వస్తోంది. మోదీకి కొరకరాని కొయ్యగా నిలిచిన జర్నలిస్టు ఆమేనంటే అతిశయోక్తి కాదు.

అంతర్జాతీయంగా తీవ్ర ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్న పదిమంది జర్నలిస్టుల్లో రానా కూడా ఒకరు అంటే ఆమె చేసిన పరిశోధనాత్మక కథనాలు ఎంతటి సంచలనాన్ని రేపాయో అర్థం చేసుకోవచ్చు. పరిశోధనాత్మక కథనాలు చేయడంలో ఎంతో ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన జర్నలిస్టుగా 2020 సంవత్సరంలో మెక్ గిల్ అవార్డును కూడా రానా గెలుచుకున్నారు. ఇవి కాక పరిశోధనాత్మక

జర్నలిజంలో ఆమె చేసిన సాహసాలకు వచ్చిన అవార్డులు, రివార్డులకు లెక్కే లేదు. ఆమె ప్రాణాల

రక్షణకుగాను ఐక్యరాజ్యసమితి సైతం భారత ప్రభుత్వానికి కొంతమందిని కేటాయించడం

ఇండియాలోనే మొట్టమొదటిసారి జరిగిందని చెప్పాలి. రానా చేస్తున్న పరిశోధనాత్మ కథనాలకు ప్రతీకారంగా ఆమెపై ఎలాంటి దాడులు జరగకుండా ఆమె ప్రాణాలకు రక్షణగా తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ఏడాది రెండవసారి భారత ప్రభుత్వాన్నిఐక్యరాజ్యసమితి కోరింది.

ఒకప్పుడు లౌకిక, ప్రజాస్వామిక విలువలకు అద్దంలా ఉన్న మనదేశంలో ఆధిపత్య, నియంత్రుత్వ,ఫాసిస్టు

ధోరణులు, హిందూ మతోన్మాదం పెరిగిపోతుండడాన్ని రానా పలు కథనాల్లో ప్రశ్నించారు. పాలకుల

జాత్యాహంకార పోకడలను ధైర్యంగా ఎత్తిచూపారు. నిజాన్ని నిర్బయంగా చెప్పే జర్నలిస్టుల ప్రాణాలకు

రక్షణ లేని పరిస్థితులు నేడు దేశంలో ఎక్కువ కావడం పట్ల తీవ్ర ఆందోళనను సైతం ఆమె వ్యక్తంచేశారు.

మోదీ ప్రభుత్వం, యంత్రాంగం సైతం అన్ని రకాలుగా తనని టార్గెట్ చేసిందని, నైతికంగా, మానసికంగా

దెబ్బతీయాలని చూసిందని రానా అంటారు.

మోదీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తనపై చేసిన విమర్శలు, తప్పుడు వార్తలు, మానసిక దాడులు, తనపై అశ్లీల చిత్రాలు పోస్టు చేయడం కూడా రానా పలు సందర్భాలలో ప్రస్తావించారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ పటంలో భారతదేశం 150వ స్థానంలో ఉండడం పత్రికా స్వేచ్ఛలో మనదేశ దుస్థితిని తెలుపుతోందంటారు ఆమె. సత్యాలు చెప్పిన, వాస్తవాలు రాసిన జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్నారని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో స్వేచ్చగా ట్వీట్లు చేసే పరిస్థితి లేదంటారు. దేశంలో లౌకిక స్ఫూర్తి లోపించే పరిస్థితులు, హిందూత్వ పోకడలను ఆమె ప్రశ్నించడం హిందూత్వ పార్టీలకు, నాయకులకు మింగుడుపడలేదు. ‘ఒక ముస్లింగా నా దేశభక్తిని ప్రతి రోజూ నిరూపించుకోవాల్సిన స్థితిని నా దేశంలో నేడు నేను అనుభవిస్తున్నాను’ అని ఆమె ఒక చోట ప్రసంగిస్తూ ఆవేదన వ్యక్తంచేయడం మరిచిపోలేము. ముస్లిం మహిళలు తమకు నచ్చిన విధంగా బతకాలనుకోవడం తప్పు కాదని, ఈ రకమైన అభిప్రాయాలు పలు ముస్లిందేశాల్లో సైతం నేడు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయని ఈ మార్పును దేశంలోని హిందూత్వ శక్తులు అడ్డుకోవాలని చూస్తున్నాయంటారామె. దేశంలో హిందూ జాతీయవాదం, రాజకీయాలు పెచ్చరిల్లడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో భారత ముస్లిం మైనారిటీ ప్రజానీకం ఎదుర్కొంటున్న పలు సమస్యలను, అభద్రతా భావాన్ని తన కథనాలలో సందర్భం వచ్చినపుడల్లా రానా విస్పష్టంగా పేర్కొన్నారు. ఎందరో ముస్లిం పౌరులు భారతదేశంలో నేడు రెండవ తరగతి పౌరులమనే భావనతో, ఒంటరితనంతో జీవిస్తున్నారంటారు ఆమె.

కోవిడ్ సమయంలో సహాయపడేందుకు చేపట్టిన నిధుల సేకరణ విషయంలో తనపై ప్రభుత్వం అక్రమ డబ్బు లావాదేవీల కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు. ఆ సమయంలో మీడియా వ్యవహరించిన తీరు, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వైనం గుర్తుచేసుకుంటూ ఆ సమయంలో తాను ఎంతో ఒంటరితనానికి గురయ్యానంటారామె. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం తనకు వ్యతిరేకంగా దాడికి దిగిందని రానా అంటారు. పన్నుల పేరుతో కూడా ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేయడాన్ని రానా ప్రశ్నించారు. అంతేకాదు హిజాబ్ ధరించడానికి సంబంధించి ఒక చానల్ కి రానా అయ్యూబ్ ఇచ్చిన ఇంటర్వ్యూపై కూడా హిందూత్వవాదులు పలు కేసులు పెట్టడాన్ని రానా గుర్తుచేసుకున్నారు. నన్ను ఎవరు ఎన్నిరకాలుగా భయపెట్టినా, బెదిరించినా బెదరనని, జర్నలిజాన్ని వదలనని, అందులోనే కొనసాగుతానని రానా పలుమార్లు స్పష్టంచేశారు. సత్యాన్నిబయటపెట్టడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని

తెలిపారు. బతికున్నంత కాలం సత్యాన్ని బయటపెడుతూనే ఉంటానని, అవినీతి, అన్యాయాలపై,

అసత్యాలపై భయపడకుండా బహిరంగంగా మాట్లాడుతూనే ఉంటానన్నారు. సోషల్ మీడియాలో

తనపై అత్యాచారం చేస్తానని, చంపుతానని వచ్చిన బెదరింపులైతే లెక్కేలేవని రానా పలు సందర్భాలలో

చెప్పారు. అనుక్షణం ప్రాణాపాయం వెన్నాడడం రానాని తీవ్ర మానసిక అలసటకు, ఆందోళనకు గురిచేసిన

సందర్భాలు సైతం ఉన్నాయి. ఒక పత్రికతో మాట్లాడుతూ ‘ఇలా బతకడం చాలా అలసటను

కలిగిస్తోంది నాకు’ అని రానా అనడం మరవలేం. తన కూతురు పడుతున్న ఒత్తిడి చూడలేక రానా తండ్రి

దేశం విడిచి వెళ్లిపోవడం మంచిదని కూతురితో అన్నారు.దానికి రానా అంగీకరించలేదు. ‘నేను నా

దేశాన్ని మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తా. అందుకే నా మాత్రుభూమిని వీడే ప్రసక్తి లేదు. నా దేశాన్ని

అసహ్యించుకునేదాన్నయితే ఎప్పుడో ఈ దేశాన్నివిడిచి వెళ్లిపోయేదాన్ని’ అని ఒక ఇంటర్వ్యూలో

చెప్పారు. భావి తరాలకు స్వతంత్ర భారతాన్ని ఇవ్వడానికి మా ముత్తాతలు, మరెందరో స్వాతంత్ర

పోరాట యోధలు బ్రిటిష్ పాలకులతో పోరాడారు. ప్రజాస్వామ్య సాధనకోసం క్రుషిచేశారు . అంత గొప్ప

ఆదర్శం కోసమే నేను కూడా పోరాడతాను. దాని పరిరక్షణ కోసం ఎలుగెత్తి ప్రశ్నిస్తూనే ఉంటాను అని

రానా అంటారు. రానా జీవితమే కాదు ఆమె రాసే ప్రతి మాట రెండంచుల పదును గల కత్తి లాంటిదనడంలో సందేహంలేదు. ఆమె స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఎంతో స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. జర్నలిస్టులు కావాలనుకునే యువతకు ఆమె ఒక నిప్పురవ్వ.

నాగసుందరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News