8th Pay Commission Salary Hike: 8వ వేతన సంఘం అమలు కోసం దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం సిఫార్సులతో దాదాపు కోటి మందికిపైగా లబ్ధి చేకూరుతుందని అంబిట్ క్యాపిటల్ బ్రోకరేజీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది.
ఈ కంపెనీ నివేదిక ప్రకారం వేతనాలు 30 నుంచి 34 శాతం మేర పెరుతాయని తెలుస్తోంది. దీని వల్ల మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్థికవ్యవస్థకు లాభం చేకూరుతుందని అంచనా వేసింది. గత పదేళ్ల వ్యవధి కోసం 2016లో ఏర్పాటైన 7వ వేతన సంఘంలో 14 శాతం పెరుగుదలే ఉంది. 1970 నుంచి ఇదే అత్యంత తక్కువ పెరుగుదలగా నమోదైంది.
ఈ ఏడాది జనవరిలో కేంద్రప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయినా కానీ ఇంతవరకు కమిషన్ చైర్మన్, సభ్యులుగా ఇప్పటికీ ఎవరినీ నియమించలేదు. వాస్తవానికి 2026 జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి రావాలి.
కానీ ఇంతవరకు కమిషన్ ఏర్పాటు కాకపోవడంతో 2027లో 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉద్యోగులు, పింఛనుదార్లు భారీగా ఆశలు పెంచుకున్నారు.
ఈ నేపథ్యంలో 2.86శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం వేతనాలు, పింఛన్లు 30 నుంచి 34 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని అంబిట్ క్యాపిటల్ సంస్థ అంచనా వేసింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచటానికి పదేళ్లకోసారి వేతన సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తుంది.
కాగా 7వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం 2014 ఫిబ్రవరిలో ప్రకటన చేయగా.. కమిషన్ విధివిధానాలు, కేబినెట్ ఆమోదం, తదితర అంశాలకు రెండేళ్లు పట్టింది. చివరగా 2016 జనవరి నుంచి 7వ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు కూడా 2027 నుంచి 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.