సాధారణంగా విరేచనాలు ఒక రోజుకు మించి ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఎక్కువ రోజుల పాటు అసౌకర్యానికి గురిచేస్తాయి. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మోషన్స్‌ను తగ్గించుకోవచ్చు.
బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ అవడం, పలు రకాల మందులను వాడడం, కృత్రిమ తీపి పదార్థాలను అధికంగా ఉపయోగించడం, తీవ్రమైన వ్యాధులను కలిగి ఉన్న వారు తరచూ విరేచనాలతో ఇబ్బంది పడుతుంటారు.
విరేచనాలు అవుతున్న వారు నీటిని తాగడం వల్ల అవి సులభంగా తగ్గే అవకాశం ఉంది. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోవడం ద్వారా జీర్ణవ్యవస్థ శుభ్రం అవుతుంది. నీరసం రాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలి.
హెవీ మోషన్స్‌తో ఇబ్బంది పడుతుంటే కొబ్బరి నీళ్లను తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ మనకు సహజసిద్ధంగా లభిస్తాయి. వెజిటబుల్ సూప్‌ను తాగితే కూడా మేలు జరుగుతుంది.
అన్నంతోపాటు ప్లెయిన్ పాస్తా, ఉడకబెట్టిన ఆలుగడ్డలు, క్యారెట్లు, పెరుగు, మజ్జిగ వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. ఇంకా శరీరానికి శక్తి లభిస్తుంది.
విరేచనాలు అధికంగా ఉంటే ఫైబర్ ఉన్న ఆహారంతో పాటు తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలకు దూరంగా ఉంటే మంచిది. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు, మాంసం, బటర్, సాస్, కారం, హెవీ మసాలా ఫుడ్, షుగర్ పానీయాలు, టీ, కాఫీ, మద్యంను అవాయిడ్ చేయాలి.
సాధారణ విరేచనాలకు ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. కానీ ఎక్కువ రోజులు డయేరియాతో బాధపడుతూ చిట్కాలు పాటించినా తగ్గకపోతే డాక్టర్‌ను కలవడం ఉత్తమం.