మనం తీసుకునే ఆహారంలో మార్పు వలనో.. శరీరానికి తగిన మోతాదులో కావలసిన పోషకాలు లేకపోవడం వల్ల, రక్తహీనత తదితర కారణాల వల్ల మహిళల్లో చాలా మంది నీటిబుడగలు (water bubbles in stomach) సమస్యను ఎదుర్కొంటున్నారు. వాటి నుండి బయటపడేందుకు అక్కడ, ఇక్కడ అంటూ తెలిసినవారు చెప్పే ప్రతి డాక్టర్ వద్దకు వెళ్తున్నారు. కానీ సమస్య మాత్రం తగ్గని వారు ఎందరో ఉన్నారు. థైరాయిడ్, ఊబకాయం ఉన్నవారికే నీటిబుడగలు వస్తాయన్నది కేవలం పుకార్లు మాత్రమే. శరీరం సన్నగా ఉన్న యువతులు, మహిళల్లోనూ ఈ సమస్యలు వెలుగుచూస్తున్నాయి.
పెళ్లైన వారితో పాటు.. పెళ్లికాని యువతుల్లో, యుక్తవయసు వారిలోనూ నీటిబుడగల సమస్య అధికంగా కనిపిస్తుంది. వీటి వల్ల నెలసరి అదే రుతుక్రమం సరిగా ఉండదు. PCOD సమస్య పెరుగుతుంది. శరీరంలో మార్పులు వస్తుంటాయి. ముఖంలో కళ తగ్గుతుంటుంది. మరి ఈ సమస్యకు జీవితాంతం మందులు వాడాల్సిందేనా అంటే.. అక్కర్లేదు. అందుకు తగిన వైద్యం మన చేతుల్లోనే ఉంటుంది.
నీటిబుడగల సమస్యను అధిగమించడానికి ముందు చేయాల్సిన పని.. నీరు ఎక్కువగా తాగడం. సాధారణంగా ఒక మనిషి రోజుకి 3-4 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతారు. కానీ.. మనం కాలానికి అనుగుణంగా.. నీటిని తీసుకుంటాం. నీటి బుడగలు ఉన్నవారు రోజులో కనీసం 3-5 లీటర్ల నీరు తీసుకునేలా చూడాలి. కేవలం మంచినీరే తాగలేకుంటే.. కొబ్బరి నీళ్లు, పలుచని మజ్జిగ తీసుకోవచ్చు.
అలాగే.. వాకింగ్ చేయాలి. రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ అలవాటు చేసుకోవాలి. ఇలా వాకింగ్ చేయడం వల్ల గర్భసంచి వద్ద కదలిక ఏర్పడి నీటిబుడగలు వాటంతట అవే కరిగే అవకాశం ఉంది. మీరు ఏ వైద్యుడిని సంప్రదించినా ముందు ఇదే చెబుతారు. అలాగే రుతుక్రమం వచ్చిన 6వ రోజు నుండి వారం లేదా 10 రోజులపాటు ప్రతిరోజూ ఉదయం ఇంట్లో బెల్లం-నువ్వులతో కలిపి చేసుకున్న లడ్డూ తినాలి. దీనివల్ల శరీరానికి ఐరన్ అందడంతో పాటు రుతుక్రమం కూడా రెగ్యులర్ అవుతుంది. బరువు కూడా తగ్గుతారు.
ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవడంతో పాటు.. శరీరంలో పనికిరాని కొలస్ట్రాల్ కరిగించి.. శరీర బరువు తగ్గుతుంది. అలాగే గర్భసంచి చుట్టూ పేరుకున్న నీటి బుడగలు నెమ్మదిగా తొలగుతాయి. ఆహారం తీసుకునే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారంలో అన్నం కంటే పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇంట్లోనే మనం చేసుకోగలిగే, పాటించగలిగే చిన్న చిన్న వాటిని అశ్రద్ధ చేయకుండా పాటిస్తే.. నీటిబుడగల సమస్యను అధిగమించవచ్చు.