Sunday, November 16, 2025
Homeహెల్త్Children's Fever: ఆహారమే ఔషధం... జ్వరంలో ఉన్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..?

Children’s Fever: ఆహారమే ఔషధం… జ్వరంలో ఉన్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..?

fever diet for kids :  చిన్నారికి జ్వరం వచ్చిందంటే చాలు.. ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. గుండె చెరువవుతుంది. నీరసంగా పడుకున్న బిడ్డను చూసి, ఏమైనా తింటే చాలనిపిస్తుంది. కానీ, ఈ సమయంలో మనం పెట్టే ఆహారమే వారిని కోలుకునేలా చేస్తుందని, అదే సమయంలో తప్పుడు ఆహారం వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని మీకు తెలుసా? అసలు జ్వరంలో ఉన్న పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..? చాలామంది తల్లిదండ్రులు తెలియక చేసే పొరపాటు ఏమిటి..? 

- Advertisement -

వాతావరణ మార్పులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా పిల్లలు తరచుగా జ్వరం, జలుబు బారిన పడుతుంటారు. ఈ సమయంలో వారిలో ఆకలి మందగించి, తినడానికి మారాం చేస్తారు. దీంతో మరింత నీరసించిపోతారు. సరైన పోషకాహారం అందిస్తేనే, శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడి త్వరగా కోలుకుంటుంది.

ఇవి పెట్టండి.. బలాన్నివ్వండి..
జీవశక్తినిచ్చే ద్రవాహారాలు: జ్వరం వచ్చినప్పుడు శరీరం త్వరగా నీటిశాతాన్ని కోల్పోతుంది (నిర్జలీకరణ). కాబట్టి, ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. కూరగాయలతో చేసిన వేడివేడి సూప్‌లు, రాగి అంబలి వంటివి విటమిన్లు, ఖనిజాలను అందించి తక్షణ శక్తినిస్తాయి. ఇవి తేలికగా జీర్ణం కూడా అవుతాయి. వీటికి తోడు, తరచూ గోరువెచ్చని నీరు, కొబ్బరి నీళ్లు తాగిస్తూ ఉండాలి.

తేలికగా జీర్ణమయ్యే పండ్లు: జ్వరంతో పోరాడటానికి శరీరానికి విటమిన్లు, శక్తి అధికంగా అవసరం.
అరటిపండు: పొటాషియం పుష్కలంగా ఉండి, త్వరగా జీర్ణమవుతుంది.
యాపిల్, బేరి: కడుపుకు తేలికగా ఉండి, శక్తిని అందిస్తాయి.
బొప్పాయి, నారింజ: విటమిన్-సి అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పుచ్చకాయ: నీటిశాతం అధికంగా ఉండటం వల్ల, శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
రోగనిరోధక శక్తికి.. పెరుగు: పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

వీటికి కచ్చితంగా దూరంగా.. చాలామంది చేసే పొరపాటు ఇదే : పిల్లలు తినడం లేదని, వారికి ఇష్టమైనవి పెడితే తింటారనే ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. జ్వరం ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. కాబట్టి, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి… నూనెలో వేయించిన పదార్థాలు, కారంగా ఉండే ఆహారాలు. చాక్లెట్లు, బిస్కెట్లు, ఇతర తీపి పదార్థాలు. ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్. చల్లని పానీయాలు, ఐస్‌క్రీమ్‌ల వంటివి ఇన్ఫెక్షన్‌ను పెంచే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉంచడం శ్రేయస్కరం.

ఈ పదార్థాలు జీర్ణం కావడానికి కష్టంగా ఉండటమే కాకుండా, శరీరంలోని ఇన్ఫెక్షన్‌ను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. కాబట్టి, జ్వరం తగ్గే వరకు తేలికైన, పోషకాలుగల ఆహారాన్ని అందించడమే ఉత్తమ మార్గం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad