లవంగాలతో హెల్దీ డ్రింకు..
లవంగాలు లేని ఇండియన్ రెసిపీలు ఉండవంటే అతిశయోక్తి కాదు. వైద్యపరమైన అవసరాలకు లవంగాలను ఉపయోగించిన ఎంతో ప్రాచీన చరిత్ర కూడా మనకు ఉంది. హాట్ రెసిపీల్లోనే కాదు స్వీట్ రెసిపీల్లో కూడా లవంగాలను వాడతారు. ఇక అవి చిందించే సువాసనలంటే పడిపోయేవారెందరో.
లవంగాల్లో బోలెడు పోషకాలు ఉన్నాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లవంగాల్లో ఉన్నాయి. వీటిల్లో యాంటీమైక్రోబియల్ సుగుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బ్లడ్ షుగర్ ప్రమాణాలను నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదు పంటి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. పంటినొప్పితో బాధపడుతుంటే ఒక
లవంగం నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు. లేదా లవంగ నూనె ఒక చుక్క నొప్పిగా ఉన్న ప్రాంతంలో వేసుకుంటే చాలు దాని ప్రభావం మీకు వెంటనే కనిపిస్తుంది. దంతాల జబ్బులు రాకుండా నిరోధించడంలో కూడా లవంగ నూనె ఎంతో ఉపయోగపడుతుంది. కారణం ఇందులో యాంటిసెప్టిక్ గుణాలు కూడా బాగా ఉండడమే.
అంతేకాదు లవంగాలు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఫ్రీరాడికల్స్ వల్ల గుండెజబ్బులు, కాన్సర్ వంటివి వస్తాయి. లవంగనూనెలో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. ప్రమాదకరమైన ఫ్రీరాడికల్స్ నుంచి
లవంగనూనెలోని యాంటాక్సిడెంట్లు మనల్ని రక్షిస్తాయి కూడా. లవంగ నూనె వెంట్రుకలను ఉంగరాల జుత్తులా మెరిపిస్తుంది కూడా. లవంగ నూనెను మాడుపై రాసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాదు జుట్టు రాలడం తగ్గడమే కాదు వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి.
లవంగాలతో చేసే హెల్దీ డ్రింకు కూడా మనకు ఉంది. ఈ డ్రింకు మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. ఇందుకోసం ఒకటి లేదా రెండు టీస్పూన్ల లవంగాలు, ఒక కప్పు వేడి నీళ్లు, సువాసనలు వెదజల్లాలంటే తేనె లేదా నిమ్మరసాన్ని లవంగాల నీళ్లల్లో కలిపేందుకు రెడీ పెట్టుకోవాలి. ఒక కప్పు నీళ్లను తీసుకుని బాగా మరిగించి వాటిని కాస్త చల్లారనివ్వాలి.
అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల లవంగాలను వేయాలి. అవి వేడి నీళ్లల్లో బాగా మునగాలి. లవంగాల డ్రింకు ఏమేర స్ట్రాంగ్ కావాలో ఆ మేర వరకు లవంగాలను వేడి నీళ్లల్లో ఐదు నుంచి పది నిమిషాలు దాకా నాననివ్వాలి. ఆతర్వాత ఆ నీటిని వొడగొట్టాలి. ఇష్టమైనవాళ్లు అందులో కొద్దిగా తేనె లేదా నిమ్మ రసం పిండుకోవచ్చు. ఈ లవంగాల హెల్దీ డ్రింకును మీరూ ఎంజాయ్ చేయండి.