రింగుల జుట్టు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ దీని సంరక్షణ అందులోనూ వేసవికాలంలో మరింత కష్టమని చెప్పాలి. ముఖ్యంగా వెంట్రుకలు చిట్లిపోయి, పొడారినట్టు అయితే రింగుల జుట్టు తొందరగా దెబ్బతింటుంది. అందుకే అందమైన రింగుల జుట్టు ఉన్న వారు వాటి సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సహజంగా చాలామంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు వెంట్రుకలను లూజుగా వదిలేసి పడుకుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. అందులోనూ రింగుల శిరోజాలు ఉన్నవాళ్లు ఇలా అస్సలు చేయకూడదు. జుట్టు అలా విప్పుకుని పడుకోవడం వల్ల వెంట్రుకలు బాగా చిక్కుబడే అవకాశం ఉంది. జుట్టు చిట్లుతుంది కూడా. అందుకే నిద్రపోయేటప్పుడు రింగుల జుట్టు ఉన్న వారు జుట్టును తప్పనిసరిగా రిబ్బనుతో గట్టిగా కట్టుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి రింగుల వెంట్రుకలు చిట్లవు. అలా ఇష్టం లేని వాళ్లు వెంట్రుకలను పోనీటయల్ లాగ వేసుకుని కూడా రాత్రిపూట పడుకోవచ్చు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రింగుల జుత్తు ఉన్నవాళ్లు తరచూ వెంట్రుకలను శుభ్రం చేసుకోవడం వల్ల మాడుపై ఉండే నూనెగుణాలు తగ్గి మాడు డ్రైగా తయారవుతుంది. దీంతో జుట్టు పీచులా, అందవిహీనంగా తయారవుతుంది. వెంట్రుకలు జీవం లేనట్లయి చిట్లుతాయి. అందుకే ఇలాంటి సమస్యలున్న వాళ్లు వారానికి ఒకసారి మాత్రమే వెంట్రుకలకు షాంపు పెట్టుకొని తలస్నానం చేయాలి. ఇందుకోసం కావాలంటే వెంట్రుకలకు మాయిశ్చరైజింగ్ షాంపు అప్లై చేయొచ్చు. ఈ మాయిశ్చరైజింగ్ షాంపులు మార్కెట్ లో, ఆన్ లైన్ లో కూడా లభ్యమవుతాయి. రింగుల జుట్టు చిక్కును సాధారణ దువ్వెన్నతో, లేదా హెయిర్ బ్రష్ ఉపయోగించి తీయడానికి ప్రయత్నించవద్దు. అలా చేస్తే జుట్టు చిట్లిపోతుంది. బ్రష్ లో పాయలు చిక్కుకోవడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది. అందుకే చిక్కుబడిన రింగుల జుత్తును సాఫీగా చేయడానికి దూరం పళ్లు ఉన్న దువ్వెన్నను మాత్రమే వాడాలి.
రింగుల జుత్తు సంరక్షణ కోసం వారానికి ఒకసారి హెయిర్ మాస్కు పెట్టుకోవాలి. ఇలా మాస్కును పెట్టుకోవడం వల్ల మాడు బలంగా తయారవడంతోపాటు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. పైగా హెయిర్ మాస్కు పెట్టుకోవడం వల్ల కాలుష్యం, హీట్ స్టైలింగ్ ల ప్రభావం వెంట్రుకల టెక్స్చెర్ పై పడదు. అవకెడో, ఆలివ్ ఆయిల్ తో చేసిన హెయిర్ మాస్కును వెంట్రుకలపై అప్లై చేస్తే శిరోజాలు అందంగా తయారవుతాయి. నల్లదనంతో వెంట్రుకలు నిగ నిగలాడడానికి పెరుగు, తేనె కలిపి తయారుచేసిన మాస్కును జుట్టుకు పట్టిస్తే చాలు రింగుల జుట్టు మరింత మెరుస్తుంది. అయితే మాస్కును వెంట్రుకలకు అప్లై చేసే ముందర షాంపుతో మొదట తలస్నానం చేయాలి. అలాగే రసాయనాలు లేని హెయిర్ ప్రోడక్టులను జుట్టుకు వాడితే మంచిది. సహజ హెయిర్ మాస్కులు వాడితే వెంట్రుకలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే వంటింట్లో ఉండే పదార్థాలతో తయారుచేసిన హెయిర్ మాస్కును వెంట్రుకలకు పెట్టుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మరి ఈ వేసవిలో మీ రింగుల జుట్టును మీరూ ఇలా కాపాడుకోండి…ఏమంటారు?