Monday, November 17, 2025
Homeహెల్త్Heart attack : ఆకస్మిక మరణాలు అరుదే... గుండెపోటుకు ముందే శరీరం హెచ్చరిస్తుంది!

Heart attack : ఆకస్మిక మరణాలు అరుదే… గుండెపోటుకు ముందే శరీరం హెచ్చరిస్తుంది!

Recognizing early heart attack signs : ఇటీవలి కాలంలో గుండెపోటుతో ఆకస్మిక మరణాలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. యువతలోనూ ఈ ముప్పు అధికమవుతుండటం కలవరపెడుతోంది. అయితే, గుండెకు సంబంధించిన ఆకస్మిక మరణాలు ఉన్నట్టుండి రావడం అరుదని, హృదయ రక్తనాళాల్లో పూడికలు ప్రమాద దశకు చేరుకుంటున్నప్పుడు అత్యధిక సందర్భాల్లో 4-7 రోజుల ముందు నుంచే శరీరం సంకేతాలనిస్తుందని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి స్పష్టం చేస్తున్నారు. వాటిని మనం గుర్తిస్తామా, లేదా అనేదే ముఖ్యమని ఆయన తెలిపారు. మరి, ఆ కీలక సంకేతాలేమిటి? వాటిని ఎలా గుర్తించాలి? గుండెపోటును నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి, వివరంగా తెలుసుకుందాం!

- Advertisement -

గుండెపోటు అతి ముఖ్య లక్షణం: ఛాతీలో పట్టేసినట్లు ఉండటం : డాక్టర్ ప్రమోద్ కుమార్ వివరించిన ప్రకారం, గుండెపోటు అతి ముఖ్యమైన లక్షణం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం. చాలామంది దీన్ని నొప్పిగా భావిస్తుంటారు.

ఎలా ఉంటుంది : గొంతులో ఏదో నొక్కేసినట్లు, గుండెపై అదిమేస్తున్నట్లుగా ఉందని, బరువుగా అనిపిస్తోందని పేషెంట్లు చెబుతుంటారని ప్రమోద్​ వివరించారు.

గ్యాస్ట్రిక్ సమస్యగా పొరపాటు: ఛాతీ మధ్య ఎముక వెనుక భాగంలో మంటలాగా అనిపిస్తే ఎక్కువ మంది గ్యాస్ట్రిక్ సమస్యగా భావిస్తారని డాక్టర్​ ప్రమోద్​ కుమార్ అన్నారు.

కీలక సూచన: నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఆయాసంగా అనిపిస్తే దాంతోపాటు ఛాతీలో పట్టేసినట్లుగా ఉంటే అది గుండెపోటు అతి ముఖ్యమైన లక్షణమని, హృదయ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడ్డాయనీ భావించాలని ఆయన సూచించారు. కొన్నిసార్లు ఎసిడిటీ, ఇతర కారణాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చని ప్రమోద్​ అన్నారు.

నివారణ మార్గం: “గుండె విషయంలో వీలైనంత అప్రమత్తంగా ఉండాలి. శరీరమిచ్చే సంకేతాలను తీవ్రమైన అంశంగానే పరిగణించాలి. గుండెపోటుగా అనుమానించి సాధ్యమైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి” అని ఆయన సూచించారు.

డాక్టర్​ ప్రమోద్​ అధ్యయనం: మధుమేహం, హైబీపీ – గుండె ముప్పు : డాక్టర్ ప్రమోద్​ 2000 నుంచి 2024 వరకూ 24 ఏళ్ల కాలంలో తాను యాంజియోప్లాస్టీ చేసిన 3,070 మంది పేషెంట్లపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయన పత్రం ఇటీవల ‘వరల్డ్‌ జర్నల్‌ ఆఫ్‌ కార్డియోవ్యాస్క్యులర్‌ డిసీజెస్‌’ వైద్య పత్రికలో ప్రచురితమైంది. ఆయన అధ్యయనంలో తేలిన అంశాలు.

ప్రమాద కారకాలు: మధుమేహం, హైబీపీ రెండూ ఉన్నవారిలో గుండె రక్తనాళాల జబ్బుల ముప్పు అధికమని ఆయన గుర్తించారు. యాంజియోప్లాస్టీ చేయించుకున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్), సగం మందికిపైగా షుగర్ ఉందని కనుగొన్నారు.

చికిత్సా పద్ధతులు: రెండు దశాబ్దాల ‘పర్క్యూటేనియస్‌ ట్రాన్స్‌లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ (పీటీసీఏ)’ విధానాల్లో ‘మందుపూత స్టెంట్ (డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్-డీఈఎస్)’తో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లుగా గుర్తించారు.

యాంజియోప్లాస్టీ – ఎంత త్వరగా చేస్తే అంత మేలు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం భారత్‌లో ఏటా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో అత్యధికంగా 27% గుండెపోటు వల్లనే జరుగుతున్నాయి. 2021లో దేశంలో గుండె రక్తనాళాల సంబంధిత జబ్బులతో 28.73 లక్షల మరణాలు సంభవించాయి. భారత్‌లో ప్రతి లక్ష మందిలో 905 మంది గుండెపోటు బాధితులున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

ముందస్తు చికిత్స కీలకం: అప్పటివరకు మామూలుగానే ఉండి ఉన్నట్టుండి ఒక్కసారిగా హార్ట్​ అటాక్​తో చనిపోయే ఘటనలు అరుదే అని డాక్టర్​ ప్రమోద్​ చెబుతున్నారు. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు అందిస్తున్న చికిత్సల్లో అత్యంత ప్రధానమైనది యాంజియోప్లాస్టీ.

ఆలస్యం చేయవద్దు: గుండెపోటు వచ్చిన రోగికి ఎంత త్వరగా యాంజియోప్లాస్టీ చేస్తే అంత బాగా గుండె ఆరోగ్యం మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆలస్యం చేసిన కొద్దీ పేషెంట్ గుండె కండరం బలహీనపడుతుంది.

యాంజియోప్లాస్టీ చికిత్స పొందినవారి స్థితి: డాక్టర్ ప్రమోద్ అధ్యయనంలో యాంజియోప్లాస్టీ చేయించుకున్న వారిలో ఈ క్రింది విధంగా విభజన కనిపించింది: హార్ట్​ అటాక్ వచ్చిన తొలి గంట నుంచి ఆరు గంటల్లోపు స్టెంట్ వేయించుకున్నవారు: 9.2% మంది గుండెపోటు వచ్చిన 24 గంటలు దాటిన తర్వాత చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు: 22.8% మంది గుండెపోటు రాకపోయినా ఆ లక్షణాలు కనిపించి చికిత్స పొందినవారు: 41.1% మంది నడక, వ్యాయామం లాంటివి ఎక్కువగా చేస్తున్నప్పుడు మాత్రమే లక్షణాలు కనిపించి ముందస్తుగా యాంజియోప్లాస్టీ చేయించుకున్నవారు 26.9% మంది.

దీర్ఘకాల ఆరోగ్యం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: డాక్టర్ ప్రమోద్ వివరించిన ప్రకారం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
నియంత్రణ: హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి.
వ్యాయామం: వాకింగ్, యోగా, ఇతర వ్యాయామాలు తప్పకుండా చేయాలి.
ఆహారం: ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించాలి.
వైద్య పరీక్షలు: క్రమం తప్పకుండా మెడికల్ చెకప్​లను చేయించుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్, ఈసీజీ, 2డీ ఎకో, టీఎంటీ లాంటి పరీక్షలు చేయించుకోవాలి.

బెలూన్ యాంజియోప్లాస్టీ, డ్రగ్ కోటెడ్ బెలూన్: ఈ చికిత్సా విధానాల్లో 1.08% మంది చికిత్స పొందగా, బెలూన్‌ యాంజియోప్లాస్టీ మాత్రమే చేసినవారిలో 12%, డ్రగ్‌ కోటెడ్‌/ఎల్యూటింగ్‌ బెలూన్‌లో 9% సమస్యలు పునరావృతమవుతున్నట్లుగా నిపుణులు గుర్తించారు.

యువతలోనూ గుండెపోటు ముప్పు – కారణాలు: ఇటీవల 30 ఏళ్లలోపు యువతలోనూ గుండెపోటు ముప్పు కనిపిస్తోంది. వీరిలో అధికశాతం మంది కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం.

జీవనశైలి: తీరికలేని జీవితం, ఎక్కువ సమయం ఏసీ రూములకే పరిమితమవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం.
ఆహారపు అలవాట్లు: ఆహారపు అలవాట్లు గతి తప్పడం, అధిక కొవ్వు పదార్థాలు తీసుకోవడం.
ఇతర కారణాలు: ఒత్తిడి, ధూమపానం, నిద్రలేమి తదితరాలు యువత గుండెపోటు బారిన పడడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు గుర్తించారు.

మహిళల్లో గుండెపోటు: గతంలో మహిళల్లో మెనోపాజ్‌ దశలో హృద్రోగ కేసులు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇటీవల మెనోపాజ్‌ ముందు దశలో 40-45 ఏళ్ల వయసులోనూ స్త్రీలు గుండెపోటు బారిన పడుతున్నారు. గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం, శరీరం ఇచ్చే సంకేతాలను గుర్తించడం, సకాలంలో వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా గుండెపోటు ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad