Thursday, September 19, 2024
Homeహెల్త్Garlic: వెల్లుల్లి నూనా..మజాకా!

Garlic: వెల్లుల్లి నూనా..మజాకా!

వెల్లుల్లి లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ నూనెను వాడని వంటకం కూడా లేదు. సూప్ దగ్గర నుంచి సాస్, స్ట్యూస్, కూరల్లో, డ్రెస్సింగ్ కు ఇలా అన్నింట్లో సువాసనలు చిందించడమే కాదు రుచుల రారాణిగా కూడా దీన్ని వాడతారు. ఇవే కాకుండా వెల్లుల్లితో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

- Advertisement -

చర్మంపై తలెత్తే యాక్నే దగ్గరి నుంచి పంటి పోటు వంటి నిత్యం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు వెల్లుల్లి వంటింటి వైద్యంగా బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. నిత్యం శిరోజాలు, చర్మానికి సంబంధించి తలెత్తే రకరకాల సమస్యలకు సైతం వెల్లుల్లి మంచి పరిష్కారాలను చూబిస్తుంది. వెల్లుల్లిని ఆయిల్ రూపంలో కూడా వాడొచ్చు. వెల్లుల్లి నూనెని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఎలా అంటారా ఒక సాస్ ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పు ఆలివ్ ఆయిల్ పోసి అందులో ఒకటి లేదా రెండు వెల్ల్లుల్లి రెబ్బలను వేసి మంట మీద పెట్టి రంగు మారే వరకూ దాన్ని మరగనివ్వాలి. చల్లారిన తర్వాత దానిని గాలి చొరబడని సీసాలో పోసి భద్రంగా ఉంచి అవసరమైనపుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు.

యాక్నే రిస్కు ఉన్న చర్మం వారికి వెల్లుల్లి ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి, కాపర్, జింకు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూడూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో తోడ్పడతాయి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే . ముల్తానీ మట్టిలో కొన్ని చుక్కల వెల్లుల్లి ఆయిల్ వేసి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం శుభ్రంగా కడిగేసుకోవాలి. పంటినొప్పికి కూడా వెల్లుల్లి నూనె ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.

పంటి నొప్పిని ఇది వెంటనే తగ్గిస్తుంది. కాటన్ బాల్ మీద కొన్ని చుక్కల వెల్లుల్లి నూనె వేసి దానితో నొప్పి పెడుతున్న పన్నుపై సున్నితంగా రాసి పదిహేను ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. జుట్టు రాలడాన్ని కూడా వెల్లుల్లి నూనె తగ్గిస్తుంది. కారణం ఇందులో విటమిన్ ఇ, విటమిన్ సి, బి6 పుష్కలంగా ఉండడమే. ఇవి జుట్టు రాలిపోకుండా పరిరక్షిస్తాయి. అంతేకాదు జుట్టు కుదుళ్లను పటిష్టం చేస్తాయి. వెల్లుల్లి నూనె వెంట్రుకలకు రాసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది కూడా. నెలకు రెండుసార్లు ఈ వెల్లుల్లి నూనెను తలకు రాసుకుంటే మంచిది. ఈ నూనెను రాత్రి పడుకోబోయే ముందు వెంట్రుకలకు పట్టించి పొద్దున్న వరకూ అలాగే ఉంచుకోవాలి. పొద్దున్న లేచిన వెంటనే తేలికపాటి షాంపుతో తలను రుద్దుకోవాలి.

దోమ కాటు నుంచి కూడా వెల్లుల్లి నూనె మనల్ని సంరక్షిస్తుంది. దోమలను తరిమికొట్టడానికి ఇంట్లో తయారుచేసుకునే హోమ్ మేడ్ రెపలెంట్ ఇది. మీరు చేయాల్సిందల్లా వెల్లుల్లి నూనెలో కాటన్ బాల్ ని ముంచి శరీరాన్నంతటినీ దానితో రాసుకోవాలి. ఇలా చేస్తే దోమలు మీ చర్మాన్ని కుట్టవు. చెవిలో తలెత్తే ఇన్ఫెక్షన్ల నివారణకు కూడా వెల్లుల్లి నూనెను ఉపయోగించడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న చికిత్సా విధానం. ఆవ నూనెలో కొన్ని చుక్కల వెల్లుల్లి నూనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి చెవిలో నొప్పి ఉన్న చోట ఇయర్ బట్స్ నుపయోగించి దీన్ని మెల్లగా రాసుకోవాలి.

చాలాకాలంగా జలుబుతో బాధపడుతున్న వాళ్లు అప్పుడప్పుడు వెల్లుల్లి నూనెను వాడుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మీరు చేయాల్సిందల్లా స్నానం చేసే ముందు శరీరానికంతటికీ వెల్లుల్లి నూనెను బాగా పట్టించుకోవాలి. ఇలా చేస్తే జలుబు తగ్గుముఖం పట్టడమే కాదు మీ చర్మానికి తేమ అంది అది ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి నూనె ఎంతో మంచిదట. రకరకాల వంటకాలు వండడానికి వెల్లుల్లి నూనెను ఉపయోగిస్తారు కూడా. వెల్లుల్లితో వండిన వంటకాలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందిట. కొలెస్ట్రాల్ ప్రమాణాలను కూడా ఇది సమతులం చేస్తుందిట. వెల్లుల్లి నూనెను మీ డైట్ లో భాగం చేసుకోవడానికి ముందు ఒకసారి వైద్యుని మర్చిపోకుండా సంప్రదించాలి. అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్లు నిరోధించడానికి వెల్లుల్లి నూనెను ఉపయోగించే ముందు దాన్ని చేతిమీద ఒకసారి ప్యాచ్ టెస్టు చేసుకుని వాడితే మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News