ఆకుకూరల పచ్చదనం పోకుండా ఉండాలంటే..
ఆకుకూరల్లో, కూరగాయల్లో ఆకుపచ్చదనం పోకుండా ఉండాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? నిజమే సాధారణంగా వీటిని వండేటప్పుడు వాటి ఆకుపచ్చదనం పోతుంటుంది. అవి పోకుండా కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే కాయగూరల రంగే కాదు వాటిల్లో ఉండే పోషకాలు కూడా పోవు.
ఆకుకూరలను నీటిలో ముంచి బాగా కడిగితే వాటిపై ఏర్పడ్డ మట్టి, పురుగు మందులు లాంటివన్నీ పోయి ఆ ఆకులు పచ్చదనంతో మెరుస్తూ కనిపిస్తాయి. ఆకుకూరలను తరగకకుండా అలాగే వాటిని కడగాలి. అలాగే ఆకుకూరలను వండడానికి ముందు బేకింగ్ సోడా వేసిన నీటిలో ఉడికించాలి. బేకింగ్ సోడా ఆకుకూరల రంగు పోకుండా నిరోధిస్తుంది. అయితే ఇందుకు చిటికెడు బేకింగ్ సోడాను మాత్రమే నీటిలో వేయాలి. గ్రీన్ వెజిటబుల్స్ ను వెనిగర్ లేదా నిమ్మరసంలో ఉడికిస్తే కూడా కూరగాయల రంగు పోదు. పైన పేర్కొన్న నిమ్మరసం లేదా వెనిగర్ ఏదో ఒకదానిని కేవలం కొన్నిచుక్కలు మాత్రమే ఉడికే నీటిలో వేసి ఆతర్వాత కూరగాయ ముక్కలను ఆ నీటిలో పడేయాలి.
కూరగాయలు ఉడికినట్టు అనిపించిన వెంటనే వేడినీళ్లల్లోంచి వాటిని తీసి చల్లటి నీళ్లల్లో వేయాలి. ఇలా చేస్తే తొందరగా వాటి వేడి తగ్గి చల్లబడతాయి. అలాగే ఆకుకూరలు గాని, కూరగాయలను గానీ కుక్కర్ లో ఎక్కువసేపు పెట్టినా, విడిగా ఎక్కువ సమయం ఉడకబెట్టినా వాటి రంగు పోతాయి. ముఖ్యంగా సలాడ్ లాంటి వాటిని తాజా ఆకుకూరలు, కూరగాయలతో చేస్తేనే ఎంతో కలర్ ఫుల్ గా, రుచికరంగా ఉంటాయి.