Jeera VS Saunf : ఉదయం లేచిన వెంటనే చాలామంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఇంటి చిట్కాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు గోరు వెచ్చని నీటిలో జీలకర్ర లేదా సోంపు కలిపి తాగడం ఒక సాధారణ అలవాటు అయిపోయింది. అయితే అసలు మంచి ఫలితాలిచ్చేది ఏది? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థ…
జీర్ణవ్యవస్థ చక్కగా పని చేయాలంటే ఉదయాన్నే తీసుకునే ఆహారం, పానీయాలు కీలకం. కొందరు తేలికపాటి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మరికొందరు ఎక్కువ ఆయిలీ ఆహారం తీసుకుంటారు. ఇలాంటి సమయంలో జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగి అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే ఉదయం మొదటగా శరీరానికి ఉపశమనం ఇచ్చే డ్రింక్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జీలకర్ర లేదా సోంపు..
ఇప్పటికే చాలామంది ఉదయం నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవడం, లేక జీలకర్ర లేదా సోంపు కలిపిన నీటిని తాగడం చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండు వేర్వేరు లక్షణాలు కలిగినవే అయినా జీర్ణ సంబంధిత సమస్యల పరిష్కారంలో తమదైన పాత్ర పోషిస్తాయి.
అజీర్తి, గ్యాస్…
జీలకర్ర గురించి చెప్పాలంటే, ఇది అజీర్తి, గ్యాస్ సమస్యల నివారణలో చాలా ఫలితాలను ఇస్తుంది. దీనిలో ఉండే పోషకాలు జీర్ణరసాల ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా ఆహారం సులభంగా జీర్ణమవడంలో సహాయపడతాయి. అదేవిధంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలోనూ ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిపుణుల ప్రకారం జీరా వాటర్ తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.
వేడి తగ్గించడంలో..
ఇదే సమయంలో సోంపు గురించి చూస్తే ఇది శరీరంలోని వేడి తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. మెటబాలిజాన్ని మెరుగుపరచడం, జీర్ణవ్యవస్థను శాంతింపజేయడం ద్వారా శరీరానికి తేలికను ఇస్తుంది. ముఖ్యంగా సోంపు వాటర్ ఆకలిని నియంత్రించి బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది. సోంపు వాటర్ తాగడం వలన అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. అయితే గర్భిణీలు, పిల్లలకు పాలివ్వే తల్లులు వీటిని ఉపయోగించడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
ఈ రెండు పానీయాల వాడకంపై కూడా మనం ఒకసారి దృష్టి పెట్టాలి. చాలా మంది ఈ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగుతుంటారు. ఇలా చేయడం వలన వాటిలోని ప్రయోజనకరమైన పదార్థాలు పూర్తిగా నీటిలో కలిసిపోతాయి. ఇది మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది.
జీలకర్ర నీరు తాగాలా? లేక సోంపు నీరు తాగాలా?..
అయితే చాలా మంది ఎదుర్కొనే ప్రశ్న ఏదంటే – ఉదయాన్నే జీలకర్ర నీరు తాగాలా? లేక సోంపు నీరు తాగాలా? ఈ ప్రశ్నకు ఓ స్పష్టమైన సమాధానం ఇవ్వడం కష్టం. ఎందుకంటే ఈ రెండు పదార్థాలు వేర్వేరు లక్షణాలు కలిగి ఉన్నాయి. ఒకటి హార్ట్ హెల్త్, కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఫలితాలిస్తే, మరొకటి శరీర వేడి తగ్గించి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.
అందుకే ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ రెండు నీటుల్లో ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఎక్కువగా గ్యాస్, కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే జీరా వాటర్ మంచిది. అయితే అధిక బాడీ హీట్, అసిడిటీ ఉండే వారికి సోంపు వాటర్ ఎక్కువ మేలు చేస్తుంది.


